లెఫ్ట్‌ భవిష్యత్‌ కాంగ్రెస్‌ చేతిలో

Left Parties Focus On West Bengal And Kerala - Sakshi

బెంగాల్, కేరళపైనే వామపక్షాల దృష్టి

ఒక రాష్ట్రంలో కాంగ్రెస్‌తో కరచాలనం చేస్తూ మరో రాష్ట్రంలో అదే పార్టీపై కత్తులు దూస్తూ ఎన్నికల రణక్షేత్రంలోకి దిగిన లెఫ్ట్‌ పార్టీలకు అంతా అగమ్యగోచరంగా ఉంది. ఒక చోట నిలబెట్టుకోవాలి, మరో చోట పునర్‌వైభవం సాధించాలి వామపక్ష పార్టీలను తేల్చడమైనా, ముంచడమైనా ఇప్పుడు కాంగ్రెస్‌ చేతుల్లోనే ఉంది.

కేరళలో అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే కాంగ్రెస్‌ పార్టీని కట్టడి చేయాలి, పశ్చిమ బెంగాల్‌లో తిరిగి పట్టు సాధించాలంటే కాంగ్రెస్‌ పార్టీతో కలిసి పని చేయాలి. ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న  రాజకీయ వైచిత్రిని ఎదుర్కోవడమే ఇప్పుడు వామపక్ష పార్టీల ముందున్న అసలు సిసలు సవాల్‌గా మారింది.  అసోం, తమిళనాడు, పాండిచ్చేరితో పాటు దేశవ్యాప్తంగా ఉత్కంఠను పెంచుతున్న పశ్చిమ బెంగాల్, కేరళలో ఎన్నికల వేడి రాజుకుంది. 2016లో బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విఫలప్రయోగంగా నిలిచినప్పటికీ  ఈ సారి ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌తోనే కలిసి వామపక్షాలు ఎన్నికల బరిలో దిగాయి.

బెంగాల్‌లో ఆదివారం జరిగిన కాంగ్రెస్‌–లెఫ్ట్‌ కూటమి నిర్వహించిన మెగా ర్యాలీకి జనం వెల్లువెత్తినప్పటికీ కాంగ్రెస్‌ అగ్రనేతలెవరూ హాజరుకాలేదు. కేరళలో యూడీఎఫ్‌ కూటమి విజయానికి తీవ్రంగా శ్రమిస్తున్న కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ, బెంగాల్‌లో వామపక్ష నాయకులతో కలిసి ఒకే వేదికను పంచుకోవడానికి ఇష్టపడలేదు. దీంతో స్థానిక కాంగ్రెస్‌ నేతలే ర్యాలీకి హాజరయ్యారు.  మరోవైపు కేరళలో వామపక్షాల నేతృత్వంలోని అధికారి ఎల్‌డీఎఫ్‌కు, కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌కి మధ్య ముఖాముఖి పోరు నెలకొంది.  కేరళలో వామపక్ష పార్టీలను ఓడించడానికి కాంగ్రెస్‌ పార్టీ బీజేపీతో తెరవెనుక అవగాహనతో పని చేస్తోందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. బీజేపీ ఓటమి కోసం పని చేయాల్సిన కాంగ్రెస్‌ ఇలా చేయడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. 

లెఫ్ట్‌ దారి వివాదాస్పదం 
భారతీయ జనతా పార్టీని ఓడించడానికి  కాషాయ వ్యతిరేక శక్తులన్నీ పిలుపునిస్తున్న వామపక్ష పార్టీలు ఇండియన్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌(ఐఎస్‌ఎఫ్‌)తో చేతులు కలపడానికి సిద్ధపడడం వివాదానికి దారి తీస్తోంది.  30 శాతం ముస్లిం జనాభా ఉన్న బెంగాల్‌లో 100–110 సీట్లలో వారి ప్రభావం ఉంటుంది. ముస్లిం ఓట్లను కొల్లగొట్టడానికి పరిషద్‌ అబ్బాస్‌ సిద్దికి నేతృత్వంలోని ఇండియన్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌ (ఐఎస్‌ఎఫ్‌)లను తమ కూటమిలో చేర్చడానికి సన్నాహాలు చేస్తున్నారు. కోల్‌కతాలో జరిగిన మెగా ర్యాలీకి సిద్దికి హాజరై ప్రసంగించారు.

‘‘మేమే ప్రత్యామ్నాయం, మేమే లౌకికవాదులం, మేమే మీ భవిష్యత్‌’’ అన్న నినాదంతో బెంగాల్‌ బరిలోకి దిగిన వామపక్ష నాయకులు తమ వేదికపై ముస్లిం మత పెద్ద సిద్దికిని కూర్చోబెట్టడం పలు విమర్శలకు దారి తీస్తోంది. కరడుగట్టిన మతవాదితో కలుస్తూ లౌకిక రాగాలాపన ఎలా సాధ్యమంటూ సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు హోరెత్తిపోతున్నాయి. వామపక్షాలు వేసే అడుగులు బీజేపీకి లబ్ధి చేకూరుతాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.  పదేళ్లుగా మమతా దీదీ అణచివేత చర్యల్ని ఎదుర్కొంటూనే ప్రజా ఉద్యమాల ద్వారా తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నాలైతే వామపక్ష పార్టీలు చేస్తూనే ఉన్నాయి.     – న్యూఢిల్లీ

ఓటు బ్యాంకు
2016లో లెఫ్ట్, కాంగ్రెస్‌ కూటమికి  38% ఓట్లువచ్చాయి. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌కు పోలయిన ఓట్ల కంటే ఇది కేవలం 7శాతం మాత్రమే తక్కువ. అందులో వామపక్ష పార్టీలే 26శాతం ఓటు బ్యాంకుని సాధిం చాయి. అయితే గత ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో లెఫ్ట్‌ పార్టీల ఓటు బ్యాంకు ఏకంగా 7.52 శాతానికి తగ్గిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్‌తో మిత్రలాభం, మిత్రభేదాన్ని ఏకకాలంలోనే ఎదుర్కొంటూ వామపక్షాలు ఎలా ముందుకు సాగుతాయో చేచి చూడాల్సిందే. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top