ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారు: కేటీఆర్‌

KTR And harish Rao Comments On Congress Government - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆరు నెలల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారని అన్నారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌. ఎన్నికల ముందు అదానీ దొంగ అని విమర్శించిన రేవంత్‌ రెడ్డి.. సీఎం అయ్యాక దావోస్‌ సాక్షిగా  అదానీతో అలయ్‌-బలయ్‌ చేసుకున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ- అదానీ ఒకటేనని రాహుల్‌ అంటున్నారని.. మొన్న రేవంత్‌ కూడా అదానీ-మోదీ ఒకటేనని విమర్శించారని గుర్తు చేశారు.  

ఢిల్లీలో అదానీతో కొట్లాడుతూ తెలంగాణలో మాత్రం అదానీతో కలిసి ఎందుకు పనిచేస్తున్నారో చెప్పాలని రేవంత్‌ రెడ్డిని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది. సభకు మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, వీ శ్రీనివాస్‌గౌడ్‌, లక్ష్మారెడ్డి, కడియం శ్రీహరి, మాజీ స్పీకర్‌లు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదనాచారి, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని నేతలు హాజరయ్యారు.
చదవండి: MLC: నామినేషన్‌ వేయని ప్రతిపక్షాలు.. ఇద్దరి ఎన్నిక ఏకగ్రీవం!

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అవకాశవాదం, దిగజారుడు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ 420 హామీలను ఎప్పటికప్పుడు ప్రజలకు గుర్తు చేయాలని బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలను ప్రజలకు వివరించాలని సూచించారు. బీజేపీ ఆదేశాల మేరకు అదానీతో రేవంత్‌రెడ్డి కలిసి పని చేస్తున్నారని ఆరోపించారు.

రూ.2లక్షల రుణమాఫీ ఒకే విడతలో చేస్తామని రేవంత్‌రెడ్డి అన్నారని.. ఇప్పుడు రుణమాఫీ దశలవారీగా చేస్తామని వ్యవసాయ మంత్రి అంటున్నారని గుర్తు చేశారు. ఎరువుల కోసం రైతులు లైన్‌లో నిలబడే పరిస్థితులు మళ్లీ వచ్చాయన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అప్పులు కాదు.. ఆస్తులు సృష్టించిందన్నారు. బంగారు పళ్లెంలో పెట్టి తెలంగాణను కాంగ్రెస్‌కు అప్పగించామన్నారు.
 

whatsapp channel

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top