ఇది సోషల్‌ మీడియా యుగం.. ‘ఈనాడు’ కృత్రిమ ఉద్యమం ఆటలు సాగవ్‌

KSR Comment On Yellow Media Artificial Agitation - Sakshi

మాజీ  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతి కేసులలో చిక్కి విలవిలలాడుతున్న నేపధ్యంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 వంటి మీడియా సంస్థలు నడుపుతున్న ఆందోళనలు చూస్తుంటే గతంలో అంటే సుమారు మూడు దశాబ్దాల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన  ఒక కృత్రిమ ఉద్యమం గుర్తుకు వస్తుంది.ఇప్పుడు ఎలాగైతే చంద్రబాబుకు మద్దతుగా ఏపీ అట్టుడికి పోతోందని ఈ మీడియా ప్రచారం చేస్తోందో , సరిగ్గా  ఆ రోజుల్లో ఈనాడు అదే పని చేసేది. 

✍️ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎన్నడూ లేనంత ప్రశాంతంగా ఉంది. అయినా ఏదో అరాచాకం జరిగిపోతున్నట్లు ఈ తెలుగుదేశం మీడియా అసత్యాలను ప్రచారం చేస్తోంది.  ముప్పై ఏళ్ల క్రితం జరిగిన ఘట్టాలు గుర్తు చేసుకుంటే , సరిగ్గా అదే వ్యూహాన్ని టిడిపి మీడియా అమలు చేస్తున్నట్లు అనిపిస్తుంది. కాకపోతే అప్పట్లో మీడియా పరిమితంగా ఉండడం, సోషల్ మీడియా లేకపోవడంతో వీరి ఆడింది ఆటగా నడించింది.కాని రోజులు  మారాయి. వారికి పోటీగా కొత్త మీడియా వచ్చింది. అలాగే  సోషల్ మీడియా విస్తారంగా రావడంతో వీరి ఆటలు సాగడం లేదు.  ఆ రోజుల్లో  తొలుత సారా నిషేధ ఉద్యమం. తదుపరి దానికి కొనసాగింపుగా మద్య నిషేధ ఉద్యమం వచ్చాయి. ఒక మీడియా సంస్థ తలచుకుంటే ఉన్నవి లేనట్లు ,లేనివి ఉన్నట్లు చూపించగలదని  ఆ ఉద్యమం రుజువు చేసింది. 

✍️నెల్లూరు జిల్లాలో దూబగుంట అనే చోట రోశమ్మ అనే ఆమె స్థానికంగా సారా తాగి నాశనం అవుతున్న జీవితాలను గమనించి ,అందుకు వ్యతిరేకంగా ఆందోళన సాగించింది. అప్పట్లో జిల్లా కలెక్టర్‌గా ఉన్న ఒకరు  ప్రోత్సహించారు. అది మరికొద్ది గ్రామాలకు వ్యాపించింది. దానిని గమనించిన ఈనాడు మీడియా అనండి.. దాని అధిపతి రామోజీరావు అనండి.. అందిపుచ్చుకున్నారు.అప్పట్లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుండేది. దానికి తోడు మద్యం వ్యాపారంలో బాగా సంపాదించిన ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి పత్రికా రంగంలోకి దిగాలని తలపెట్టారు. 

✍️బహుశా దానిని కూడా దృష్టిలో ఉంచుకునే రామోజీరావు ఈ ఆందోళలకు మంచి కవరేజీ ఇచ్చే విధంగా సూచనలు చేశారని అంటారు. సర్కులేషన్ పెరగడానికి కూడా ఉపయోగపడుతుందని  అంచనా వేసుకున్నారు. దాంతో  అక్కడితో ఆగలేదు. ఈనాడు మీడియానే పూర్తిగా భుజాన వేసుకుని ఉద్యమాన్ని నడిపింది. సారా నిషేధాన్ని కోరుకునే వారి ఇంటర్వ్యూలను పుంఖానుపుంఖాలుగా ఇచ్చేది. చివరికి ఆనాటి గవర్నర్ కృష్ణకాంత్‌ను కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. 

✍️ఆయన మద్యం వ్యాపారంపై   తీవ్ర వ్యాఖ్యలు చేయడం అప్పట్లో కలకలం రేపింది.అదే సందర్భంలో హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమం లో ఒక అఖిలపక్ష సమావేశాన్ని కూడా రామోజీరావు ఏర్పాటు చేశారు. ఆ సభలో ఆనాటి ప్రతిపక్ష నేత ఎన్.టి.రామారావు కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో  ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి అక్కడ నుంచి ఆకస్మికంగా నిష్క్రమించారు. ఇందులో ఏదో ఫౌల్ ఉందని, ఎన్.టి.ఆర్.దీనిని రాజకీయంగా వాడుకుంటున్నారని ఆయన భావించారు. ఆ దశలో రామోజీరావుకు రెండు ప్రయోజనాలు దక్కాయి. ఒకటి ఆయన సంఘ సంస్కరణ అభిలాషి అన్న పేరు రావడం అయితే, మరొకటి తనకు ప్రత్యర్ధి అవుతారేమోనని అనుకున్న వ్యక్తిని వ్యాపారపరంగా దెబ్బకొట్టడం. ఈనాడు విలేకరులే పలు చోట్ల కొద్ది మంది జనాన్ని పోగు చేయించడం, ఏదో ఒక ఆందోళన చేయించి వాటిని తమ పత్రికలో వేయడం. ఈ తరహా  ఘట్టాలు కూడా చాలానే జరిగాయి.

✍️అదే సమయంలో పత్రికలలో ప్రచారం కోరుకునే వారికి కూడా మంచి వెసులుబాటుగా ఉండేది. ఈనాడులో ఒక ప్రత్యేక పేజీని కేటాయించి ఈ ఉద్యమాన్ని నడిపేవారు. నిజంగానే  ప్రజలలో అంత అలజడి ఉందా అని ఎవరైనా పరిశీలిస్తే అదేమీ కనిపించేది కాదు. కాకపోతే ఆ ప్రభావం కొంత ఉన్నట్లు అనిపించేది. దానిని ఆసరా చేసుకుని నిత్యం వార్తలు వండి వార్చేది. తప్పులేదు. జనానికి ఉపయోగపడేదే కదా అని అనుకున్నవారు కూడా ఉన్నారు. కారణం ఏమైతేనేమి కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వం ఆనాటి మంత్రి రోశయ్య ఆధ్వర్యంలో కమిటీ వేసి ఆయా రాష్ట్రాలలో పరిస్థితిని అద్యయనం చేసింది. ఈ కమిటీ గుజరాత్ కు కూడా వెళ్లి వచ్చింది. అక్కడ పేరుకే మద్య నిషేదం అమలు అవుతోందని ఈ కమిటీ గుర్తించింది.

✍️అయినా   సారా వరకు నిషేధించాలని ఆనాటి ప్రభుత్వం నిర్ణయించింది. అంతటితో ఉద్యమాన్ని ఈనాడు మీడియా ఆపు చేస్తుందని అనుకున్నారు. కాని అందుకు విరుద్దంగా రామోజీరావు యధా ప్రకారం ఒక పేజీని కేటాయించి సంపూర్ణ మద్య నిషేధం చేయాలని, సారా నిషేధం ఒక్కటే చాలదని ప్రచారం సాగించారు. దీనిని ఎన్.టి. రామారావు, టీడీపీ వారు తమకు అనుకూలంగా మలుచుకోవడానికి యాత్రలు చేశారు. ఎన్.టి.ఆర్. చేపట్టిన రైలు యాత్ర పెద్ద ప్రకంపన సృష్టించింది.ఈనాడును దృష్టిలో పెట్టుకుని సారాను నిషేధించినా,  రామోజీరావు ఫిలిం సిటీకి కీలకమైన కొంత భూమిని వేరేవారి నుంచి స్వాదీనం చేసుకుని ఇచ్చినా సంపూర్ణ మద్య నిషేధం అంటూ ఇలాచేస్తారా అని కోట్ల బాధపడేవారు.

✍️ఇక్కడ ఒక విశేషం చెప్పుకోవాలి.ఇంత ఉద్యమం నడిపిన తన డాల్ఫిన్ హోటల్ లో మద్యం అమ్మకాలను నిలుపుదల చేయలేదు. దీని గురించి ఆనాటి కాంగ్రెస్ నేతలు, మంత్రులు ప్రశ్నిస్తుండేవారు. అయినా రామోజీరావు పట్టించుకునేవారు కారు. ఇక సంపూర్ణ మద్య నిషేధం నినాదంతోపాటు, రెండు రూపాయలకే కిలో బియ్యం తదితర నినాదాలతో ప్రచారం చేసిన ఎన్.టి.ఆర్. అధికారంలోకి వచ్చారు. ఆయన వెంటనే సంపూర్ణ మద్య నిషేధం ప్రకటించారు. ఆ క్రెడిట్ లో చాలా భాగం రామోజీరావుకు దక్కిందంటే అతిశయోక్తి కాదు. కాని అసలు కధ ఇక్కడే మొదలైంది. 

✍️ఎన్.టి.ఆర్. చాలావరకు చిత్తశుద్దితోనే మద్య నిషేధం అమలుకు యత్నించారు. కాని కొందరు టిడిపి ఎమ్మెల్యేలు తమ ఇష్టారాజ్యంగా అక్రమ మద్య వ్యాపారం చేసేవారు. ఆ తరుణంలో ఎన్.టి.ఆర్.ను కూలదోసి  ఆయన అల్లుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్.టి.ఆర్.  హెల్త్ పర్మిట్లు అనుమతిస్తే,తాను అవి కూడా అంగీకరించనని చంద్రబాబు ప్రకటించారు. అబ్బా అని అంతా అనుకున్నారు.సీన్ కట్ చేస్తే ఆ కొద్ది కాలానికే అక్రమ మద్యం అరికట్టలేకపోతున్నామని ప్రచారం ఆరంభించారు. 

✍️రాష్ట్ర ఆర్ధిక పరిస్థితుల రీత్యా పలు నిర్ణయాలు చేయాలని అభిప్రాయం సేకరణ అంటూ కొత్త అంకానికి తెరదీశారు.ఇందుకోసం పలు సమావేశాలను నిర్వహించారు. ఈ క్రమంలో ఎక్కడా ఈనాడు మీడియా  ఆయనను తప్పు పట్టలేదు. వ్యతిరేకించలేదు. దీనికి మరో కారణం కూడా ఉందని చాలా మంది నమ్ముతారు. రామోజీరావు అప్పుడే రామోజీ ఫిలిం సిటీని ఆరంభించారు. ఆయా ప్రముఖులను పిలిచి ఫిలిం సిటీ చూపించేవారు. సినిమా షూటింగ్ లకు అనువుగా ఉంటుందని మార్కెటింగ్ చేసేవారు. 

✍️కాని మద్య నిషేధం సమస్య అవుతోందన్న అభిప్రాయం కలిగింది. ప్రత్యేకించి ఇతర రాష్ట్రాల నుంచి సినిమావారు వస్తే ఇది ఇబ్బందిగా ఉండేది.దాంతో కొన్ని పర్మిట్లు తీసుకుని మద్యం సరఫరా చేసేవారని అంటారు.ఈ లోగా చంద్రబాబు మద్యనిషేధాన్ని ఎత్తివేశారు.  ఈనాడు ఏదో మొక్కుబడికి ఒక సంపాదకీయం రాసి ఊరుకుంది. అందులో కూడా చంద్రబాబు కన్నా, టిడిపి ఎమ్మెల్యేలు, నేతలనే ఎక్కువగా తప్పు పట్టింది. ఆ ప్రకారం మద్య నిషేధం పోయింది.ఇప్పుడు కూడా సరిగ్గా ఈనాడు అదే మాదిరి చంద్రబాబు అవినీతి కేసులలో ఆయనకు అనుకూలంగా ప్రచారం సాగిస్తోంది. 

✍️దానికి ఆంధ్రజ్యోతి, టీవీ 5 తోడు అయ్యాయి. ప్రతి రోజు ఎవరెవరివో ఇంటర్వ్యూలు వేసి చంద్రబాబు తప్పు చేయలేదని ప్రొజెక్టు చేస్తున్నారు. చివరికి ఈ కేసులో నిందితులు అయి ఈడి అరెస్టు చేసినవారితో మాట్లాడించి చంద్రబాబుకు సర్టిఫికెట్లు ఇప్పిస్తున్నారు. జగన్ కేసులకు సంబంధించి పనికట్టుకుని అక్రమ ఆస్తుల కేసు అని రాసే వీరు చంద్రబాబు విషయంలో మాత్రం అవినీతి కేసు అని రాయడం లేదు.ఆయనపై పెట్టిన అక్రమ కేసులు అని తీర్పు ఇచ్చేస్తూ కధనాలు రాస్తున్నారు. ఇక రాష్ట్రం అంతా నిరసనలతో అట్టుడుకుతున్నట్లు పిక్చర్ ఇవ్వడానికి కష్టపడుతున్నారు. వారి పేపర్లు చూసినా, టీవీలు చూసినా ఏపీలో ఏదో జరిగిపోతోందన్న అనుమానం కలగాలన్న వారి ప్రయత్నాలు అర్దం అయిపోతూనే ఉన్నాయి.

✍️తెలుగుదేశం పార్టీవారు ఇష్టారీతిన నిరసనలు, ఆందోళనలకు జరుపుకోవడానికి  అనుమతి ఇవ్వడం లేదని ఈనాడు అరాచకం, నిరంకుశత్వం అంటూ హెడింగ్ పెట్టి ఒక అరపేజీ కథనాన్ని వండి వార్చింది.కొన్నాళ్ల క్రితం టిడిపి కార్యకర్తలు పోలీసు వాహనాన్ని దగ్దం చేసినా, ఒక పోలీసు కన్ను పోగొట్టినా, పలువురు పోలీసులకు గాయాలు అయినా, నిస్సిగ్గుగా టిడిపినే సమర్ధించే దుస్థితికి ఈనాడు, ఇతర టిడిపి మీడియా చేరింది.చంద్రబాబుకు మద్దతుగా మిన్నంటిన నిరసనలు, దేశదేశాల్లో సైతం ప్రజలంతా అదే పనిలో ఉన్నారన్నట్లుగా వీరి అసత్య ప్రచారం తారా స్థాయికి చేరింది. ఒక టీవీ విలేకరి అయితే రాజమండ్రి జైలులోకి చంద్రబాబును వేధించడానికి దోమలు పంపించారని చెప్పేంత నీచ,అధమ స్థాయికి వీరి జర్నలిజం వెళ్లింది.

✍️అక్కడక్కడ టిడిపి కార్యకర్తలు కొద్ది మంది నిరసనలు చెబుతుండవచ్చు.దాని వరకు వార్తలు ఇవ్వడం తప్పుకాదు. కాని ఏపీ ప్రజలంతా అన్నహారాలు మాని చంద్రబాబు కోసమే అల్లాడుతున్నట్లుగా కథనాలు ఇచ్చి పాఠకులను మభ్య పెట్టాలని చూస్తున్నారు. కొన్ని చోట్ల పెయిడ్ ఆర్టిస్టులను కూడా రంగంలో దింపుతున్నారు. మరో విశేషం చెప్పాలి. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగుల ఆందోళన అని హడావుడి చేశారు.

✍️ఇదంతా ఎక్కడ చేశారో తెలుసా! వైఎస్ రాజశేఖరరెడ్డి టైమ్ లో అభివృద్ది చెందిన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలో. ఆయన ఆధ్వర్యంలో నిర్మించిన రింగ్ రోడ్డుపైన. పైగా అక్కడ ఉన్నవారి వయసు నలభై ఏళ్ల లోపు అనుకుంటే వారికి, చంద్రబాబుకు ఏమి సంబంధమో తెలియదు. ఆయన ఎప్పుడో 2004లోనే ఉమ్మడి ఏపీలో అధికారం కోల్పోయారు.హైదరాబాద్ లో ఆ తర్వాత జరిగిన  అభివృద్దితో ఆయనకు సంబంధమే లేదు. చివరికి ఈ ఆందోళనలు,నిరసనలు అయితే తెలుగుదేశం వారివో, లేకపోతే ఒక సామాజికవర్గం వారివో అన్న పరిస్థితి నెలకొంది. ఇంతకన్నా సిగ్గుచేటు ఉంటుందా!


-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top