అమరావతి యాత్ర.. ఉత్తరాంధ్రలో జనం ఊరుకుంటారా?

Kommineni Srinivasa Rao Comment On Amaravati Padayatra - Sakshi

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల విషయం ఉత్తరాంధ్రలో బలమైన సెంటిమెంట్‌గా మారుతోంది. తాజాగా ఆ ప్రాంత మేధావులు, రాజకీయ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రౌండ్ టేబుల్ సమావేశం జరిపి శ్రీకాకుళం నుంచి అమరావతి వరకు పాదయాత్ర చేయాలన్న ప్రతిపాదన చేసుకున్నారు. దీనిపై వారు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. కానీ, అవసరమైతే విశాఖ , ఉత్తరాంధ్ర ప్రాంతం వారు కూడా క్రమంగా ఉద్యమ బాట పట్టేలా ఉన్నారు.  దీనికి ఒకటే కారణం కనిపిస్తోంది. తమ ప్రాంతాభివృద్దికి వచ్చే అవకాశాన్ని అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కాని, తెలుగుదేశం పార్టీవారు కాని  చెడగొట్టేపనిలో ఉన్నారన్న భావన కలగడమే.  రైతుల ముసుగులో తెలుగుదేశం పార్టీవారు అమరావతి నుంచి అరసవల్లి పాదయాత్రను నిర్వహిస్తున్నారన్నది బహిరంగ రహస్యమే.  అమరావతిలోని కొన్ని గ్రామాలలోనే మొత్తం రాజధాని కార్యాలయాలు ఏర్పాటు చేయాలని వీరు డిమాండ్ చేస్తున్నారు.

వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానులను వీరు వ్యతిరేకిస్తున్నారు. వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం తప్పుకాదు. కానీ, ఇతర ప్రాంతాలవారిని రెచ్చగొట్టేలా, మూడు రాజధానులకు మద్దతు ఇచ్చే నేతల ఊళ్లలో తొడలు కొడుతూ, చెప్పులు చూపుతూ చేస్తున్న హడావుడి చాలా ఇబ్బందికరంగా మారింది. తొలుత తిరుపతి వరకు పాదయాత్ర చేసిన వీరు ఇప్పుడు అరసవల్లి వరకు అంటూ నేరుగా వెళ్లకుండా, ఏవేవో రూట్లలో వెళుతూ అలజడి సృష్టించడానికి యత్నిస్తున్నారు. దీనితో సహజంగానే ఇతర ప్రాంతాలలోని ప్రజలకు తీవ్ర అసహనం కలుగుతుంది. తమ ప్రాంతంలో రాజధాని చేయవద్దని తమ ఉత్తరాంధ్రకే పాదయాత్ర పేరుతో రావడం అంటే తమను రెచ్చగొట్టడమేనని అక్కడి ప్రజలు భావిస్తున్నారు.

అందుకే పోటీ పాదయాత్రను తలపెట్టారు. అంతేకాక, ప్రతివారం, పదిహేను రోజులకు ఒకసారి సమావేశం అయి ఆందోళన కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. అంటే ఏమిటి ?అమరావతి నుంచి పాదయాత్ర విశాఖకు దగ్గరకు వచ్చేసరికి ఉద్రిక్త పరిస్థితులు పెరిగే అవకాశం ఉంది. ఎక్కడ ఏ చిన్న అవకాశం వచ్చినా, ప్రజలలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టే లక్ష్యంతోనే  అమరావతి - అరసవల్లి పాదయాత్రను ప్లాన్ చేశారన్న అభిప్రాయం ఏర్పడుతోంది. దానిని బలపరిచే విధంగా మాజీ మంత్రి,  ఎమ్మెల్యే కొడాలి నాని నియోజకవర్గమైన గుడివాడకు వెళ్లి ఆయన కార్యాలయం వద్ద,సినిమా ధియేటర్ వద్ద టీడీపీ నేతలు కొందరు చేసిన గలభా తీవ్ర అభ్యంతరకరమైనది. ఒక మహిళ వాహనం మీద నిలబడి తొడగొట్టిన తీరు అందరిని ఆశ్చర్యపరిచింది. వీరు పాదయాత్ర చేస్తున్నది తొడలు కొట్టడానికా అన్న వ్యాఖ్యలు వచ్చాయి. వీరిలో అసలు రైతులు ఎంతమంది అన్నదానిపై ఎవరి వాదనలు వారికి ఉన్నాయి. అది వేరే విషయం. 

ఒక్క మాట మాత్రం వాస్తవం. రాష్ట్రం అంతా ఏమైపోనివ్వండి.. తమ గ్రామాల పరిధిలోనే రాజధాని ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో వీరు చేస్తున్న ఈ యాత్ర ప్రధానంగా తెలుగుదేశంకు రాజకీయ ఊపిరి పోయడానికే అనిపిస్తుంది. అందుకే టీడీపీ నేతలే పలువురు వారితో కలిసి ఆయా చోట్ల నడుస్తున్నారు.అయితే ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతానికి ఈ పాదయాత్ర చేసేవారి వద్దకు వెళ్లి నేరుగా కలవడానికి సంకోచిస్తున్నట్లుగా ఉంది. ఆయన కాని, ఆయన కుమారుడు కాని వారి వద్దకు వెళ్లి సంఘీభావం తెలపలేదు. తమ పార్టీ నేతలను మాత్రం పంపి ఆర్గనైజ్ చేస్తున్నారు. దీనికి కారణం నేరుగా తాము అమరావతి పాదయాత్రలో కలిస్తే ఉత్తరాంధ్రలో పార్టీకి బాగా నష్టం వస్తుందన్న భయం కావచ్చు.ఈ నేపధ్యంలో విశాఖలో కూడా రాజధాని ఆకాంక్షను ప్రజలకు బలంగా తెలియచేయడానికి వీలుగా రౌండ్ టేబుల్ సదస్సు నిర్వహించారు. పలువురు మేధావులు విశాఖను పరిపాలనా రాజధాని చేయడం వల్ల వచ్చే ప్రయోజనాలను వివరించారు. 

ముంబై, హైదరాబాద్ లతో విశాఖ పోటీ పడగలుగుతుందని, అమరావతి ఎప్పటికి పోటీ పడుతుందని వారు ప్రశ్నించారు. అమరావతలో లక్షల కోట్లు వ్యయం చేస్తే తప్ప అబివృద్ది కాదని, కాని విశాఖలో అంత డబ్బు అవసరం ఉండదని, అనతికాలంలోనే లక్ష కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందని వారు వివరిస్తున్నారు. అమరావతిలో వంద అడుగుల లోతుకు వెళ్ళి పునాదులు తీయవలసి ఉంటుంది. అదే విశాఖలో అయితే ఆ ఇబ్బంది ఉండదు. తీర ప్రాంతం, టూరిజం, పరిశ్రమల రంగాలలోను. ఇటీవలికాలంలో ఐటి రంగంలోను విస్తరిస్తున్న విశాఖ రాజధాని అయితే రాష్ట్రప్రజలందరికి మేలు జరుగుతుందని మేధావులు చెబుతున్నారు. రౌండ్ టేబుల్ సదస్సులోమంత్రి బొత్స సత్యనారాయణ సీరియస్ వ్యాఖ్యలే చేశారు. అమరావతిలోని 500 కుటుంబాల కోసం మొత్తం రాష్ట్ర సంపద అంతా తాకట్టు పెట్టాలని అనడం బావ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల పన్నులు, ఆదాయం అంతా మట్టిలో పోయాలా అని కూడా ఆయన ప్రశ్నించారు. 

పాదయాత్ర పేరుతో టీడీపీవారు రెచ్చగొడుతున్నారని, తాము తలచుకుంటే వారికి అడ్డు తగలడం పెద్ద పని కాదని, కాకపోతే సంయమనం పాటిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో ఒక జడ్జి అమరావతి రాజదాని గురించి చేసిన వ్యాఖ్యలను కూడా బొత్స తప్పు పట్టారు.1953 లో మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయి ఆంద్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు విశాఖను రాజధాని చేయడానికి ప్రయత్నాలు జరిగాయని, చివరి నిమిషంలో కర్నూలు ఎంపిక జరిగిందని ఈ సదస్సులో పాల్గొన్న మేదావులు వివరించారు.అది నిజమే ఆనాటి ప్రముఖ నేత టంగుటూరి ప్రకాశం పంతులు విశాఖ ను రాజధాని చేద్దామని ప్రతిపాదించారు.కాని అది సాధ్యపడలేదు. నిజంగానే అప్పుడే కనుక విశాఖ రాజధానిగా ఆంద్ర రాష్ట్రం ఏర్పడి ఉంటే , ఉమ్మడి రాష్ట్రం అవసరం ఉండేదికాదు. రాజధాని ఇబ్బంది అసలే ఉండేదికాదు. ఈపాటికి హైదరాబాద్‌కు పోటీగా అభివృద్ధి అయి ఉండేది. కాని అప్పటి సెంటిమెంట్లు, రాజకీయాలు వేరుగా ఉండేవి.

ప్రస్తుతం అమరావతి లో శాసన రాజధాని ఉంటుందని ప్రభుత్వం చెబుతున్నా,కొందరు కావాలని ,అసలు రాజధానే లేకుండా పోయినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో ఎలా ముందుకు వెళుతుందో కాని,ఉత్తరాంధ్ర, రాయలసీమ వాసుల కోరికలు కూడా నెరవేర్చాలన్న వారి ఆకాంక్ష తీరుతుందో లేదో చెప్పలేం. సుప్రింకోర్టు తీర్పుపై ఇది ఆధారపడి ఉంటుంది. కొద్ది నెలల క్రితం మూడు రాజధానులు చట్టాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అయినా అమరావతి-అరసవల్లి పాదయాత్రను తెలుగుదేశం ప్లాన్ చేయడం కుట్ర రాజకీయం తప్ప మరొకటి కాదు. ఏది ఏమైనా వీరి పాదయాత్ర విశాఖవైపు వెళ్లే కొద్ది అక్కడి ప్రజలలో అలజడి పెరుగుతుంటుంది. టీడీపీ వారికి కూడా అదే కావాలి.

ఈ వివాదం వల్ల ఉద్రిక్తతలు ఏర్పడితే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై బురద చల్లవచ్చన్నది వారి ప్లాన్ గా చెబుతున్నారు.ఈ నేపధ్యంలో ఉత్తరాంధ్ర నుంచి పోటీ పాదయాత్ర చేపడితే ప్రజల మనోగతం అర్దం అవుతుందని మూడు రాజదానులకు మద్దతు ఇస్తున్నవారు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే స్థానిక ఎన్నికలలో విజయవాడ, గుంటూరు వంటి చోట్ల కూడా వైఎస్సార్‌సీపీ గెలిచింది. అంటే దాని అర్థం రాజధాని అంశం ప్రజలను ప్రభావితం చేయడం లేదని అర్థం చేసుకోవచ్చు. అందుకే ఎలాగొలా ప్రజలలో అమరావతిపై సానుకూలత తేవడం కోసం టీడీపీ నానా పాట్లు పడుతోంది. కాని ఉత్తరాంధ్ర రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ద్వారా అక్కడి ప్రముఖులు తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా తెలిపారు. మరి అమరావతి పాదయాత్రికులు విశాఖ వెళ్లి కూడా తొడకొడతారా? చెప్పులు చూపుతారా? అక్కడి ప్రజలు వీటిని భరిస్తారా అన్నది భవిష్యత్తులో చూడాల్సిందే.


- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top