కేసీఆర్‌కు కీలకంగా మారిన మునుగోడు.. ఐ ప్యాక్‌ నివేదికలో ఏముంది!

KCR Full Focus On Munugode Assembly Constituency - Sakshi

స్థానిక సంస్థల్లో వివిధ పార్టీల బలాబలాలపై టీఆర్‌ఎస్‌ లెక్కలు

నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై ఇప్పటికే ఐ ప్యాక్‌ నివేదిక

దీని ఆధారంగా మరిన్ని సర్వేలు చేయిస్తున్న గులాబీ పార్టీ

అధినేత పరిశీలనలో కూసుకుంట్ల, కర్నె, కృష్ణారెడ్డి పేరు 

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక ఖాయంగా కన్పిస్తున్న నేపథ్యంలో అక్కడ గులాబీ జెండా ఎగిరేలా ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన టీఆర్‌ఎస్‌ తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టింది. సుమారు పక్షం రోజుల క్రితమే ఉప ఎన్నికపై స్పష్టంగా ఉప్పందడంతో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ మునుగోడులో పార్టీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డిని గత నెల 22న ప్రగతిభవన్‌కు పిలిచి అక్కడి రాజకీయ పరిస్థితులపై చర్చించారు. మునుగోడుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి పర్యటనలు ముమ్మరం చేయడంతో పాటు పార్టీ యంత్రాంగాన్ని గాడిన పెట్టాలని ఆదేశించారు. మరోవైపు స్థానికుల డిమాండ్‌ మేరకు గట్టుప్పల్‌ను మండల కేంద్రంగా ఏర్పాటు చేయడంతో పాటు గట్టుప్పల్‌ సర్పంచ్, గట్టుప్పల్‌ మండల సాధన కోసం ఏర్పాటైన జేఏసీ చైర్మన్‌ను టీఆర్‌ఎస్‌ పార్టీలో చేర్చుకున్నారు. అదే సమయంలో సీఎంకు కృతజ్ఞత తెలిపే పేరిట గట్టుప్పల్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి మునుగోడు నియోజకవర్గం నలుమూలల నుంచి జన సమీకరణ చేయడం ద్వారా కదలిక తెచ్చారు.

స్థానిక ప్రజా ప్రతినిధులపై దృష్టి
మునుగోడులో మండలాల వారీగా ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు తదితరులు ఏ పార్టీలో ఎంతమంది ఉన్నారనే కోణంలో టీఆర్‌ఎస్‌ నివేదిక సిద్ధం చేసింది. స్థాని కంగా మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశమున్న ప్రజా ప్రతినిధులు, నేతలపై దృష్టి పెట్టే అవకాశముంది. బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, గత ఎన్నికల్లో పోటీ చేసిన గొంగిడి మనోహర్‌రెడ్డి రాజకీయ అడుగులు ఎటు పడతాయనే అంశాన్ని కూడా నిశితంగా గమనిస్తోంది.

పార్టీల బలాబలాలపై ఐ ప్యాక్‌ నివేదిక
నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులపై ఈ ఏడాది మార్చిలో ఐ ప్యాక్‌ బృందం సీఎం కేసీఆర్‌కు నివేదికను
అందజేసింది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ బలాబలాలు, పార్టీ అభ్యర్థిగా ఎవరైతే మెరుగు అనే అంశంతో పాటు పలు అంశాలను అందులో ప్రస్తావించారు. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కర్నె ప్రభాకర్‌తో పాటు కర్నాటి విద్యాసాగర్, నారబోయిన రవికుమార్‌ మధ్య విభేదాలను పరిష్కరించాల్సిన అవసరాన్ని పీకే బృందం నొక్కి చెప్పింది. ఇతర పార్టీల పరిస్థితితో పాటు ఆయా పార్టీలకు చెందిన నేతల బలాబలాలను కూడా నివేదిక అంచనా వేసింది. 

కొనసాగుతున్న సర్వేలు
ప్రస్తుతం ఉప ఎన్నిక వాతావరణం నెలకొన్న నేపథ్యంలో టీఆర్‌ఎస్‌.. ఐ ప్యాక్‌ నివేదిక ఆధారంగా మరిన్ని సర్వేలను వివిధ సంస్థల ద్వారా చేయిస్తోంది. అభ్యర్థి ఎంపికలో ఈ సర్వేల ద్వారా వెల్లడయ్యే ఫలితాలు అత్యంత కీలకంగా మారే సూచనలు ఉన్నాయి. దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నిక అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చిన్న తప్పుకు కూడా అవకాశం లేకుండా అభ్యర్తి ఎంపిక, ప్రచారం, ఎదుటి పార్టీల దూకుడును నిలువరించడం తదితరాలపై కేసీఆర్‌ కసరత్తు ప్రారంభించారు.

పోటీపై గుత్తా ఆసక్తి!
కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి మరోమారు అవకాశం లభిస్తుందని భావిస్తున్నా టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన మరికొందరు నేతలు కూడా తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. సర్వేల్లో తనకు అనుకూల ఫలితం వస్తే పోటీ అవకాశం ఇవ్వాల్సిందిగా కర్నె ప్రభాకర్‌ మంగళవారం సీఎం కేసీఆర్‌ను కలిసి విజ్ఞపి చేసినట్లు తెలిసింది. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుండగా, ఆయన కూడా మంగళవారం కేసీఆర్‌ను కలిసినట్లు తెలిసింది. ఇక శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి కూడా మునుగోడు నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆయన ఇటీవల మీడియాతో జరిపిన పిచ్చాపాటీ సంభాషణలో సీఎం కేసీఆర్‌ ఆదేశిస్తే పోటీకి సిద్ధమనే సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం ఉప ఎన్నిక వ్యూహంపై అంతర్గత కసరత్తు చేస్తున్న కేసీఆర్‌.. రాజగోపాల్‌రెడ్డి రాజీనామా ఆమోదం తర్వాత వీలైనంత త్వరగా అభ్యర్థిపై నిర్ణయం తీసుకుని దూకుడు పెంచే యోచనలో ఉన్నట్టు తెలిసింది.

ఇది కూడా చదవండి: గేరు మార్చిన కాషాయదళం.. మూడు జిల్లాల్లో టీఆర్‌ఎస్‌కు భారీ షాక్‌! 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top