కేటీఆర్‌ కోసం సీనియర్లను కేసీఆర్‌ తొక్కేస్తుండు.. టీఆర్‌ఎస్‌కు రాజయ్య గుడ్‌బై

KCR Close Aid Kanneboina Rajaiah Yadav Resigns TRS - Sakshi

సాక్షి, వరంగల్: తెలంగాణ రాష్ట్ర సమితికి షాక్‌ ఇచ్చారు సీనియర్ నేత కన్నెబోయిన రాజయ్య యాదవ్. కేసీఆర్‌కు సన్నిహితుడిగా పేరున్న రాజయ్య యాదవ్‌.. పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన టీఆర్‌ఎస్‌ పరిస్థితులపై, సీఎం కేసీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు.  

తెలంగాణ మలి దశ ఉద్యమ టైంలో కేసీఆర్ వెంట నడిచిన రాజయ్య యాదవ్.. రాష్ట్ర సాధన ఉద్యమంలోనూ కీలకంగా వ్యహరించారు. కేసీఆర్‌తో పాటు ఆమరణ దీక్షకు దిగిన ఆరుగురు సీనియర్ నేతలతో రాజయ్య యాదవ్ ఒకరు. కరీంనగర్ అలుగునూర్ వద్ద అరెస్టై ఖమ్మం జైలులో కేసీఆర్‌తో పాటు జైల్లోనూ గడిపారు రాజయ్య యాదవ్. గతంలో తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ చైర్మన్‌గా రాజయ్య యాదవ్ పని చేశారు కూడా.  ఇవాళ పార్టీకి రాజీనామా ప్రకటించిన సందర్భంలో ఇవాళ ఆయన హాట్‌ కామెంట్లు చేశారు. 

22 సంవత్సరాలపాటు పార్టీలో కొనసాగానని, కేసీఆర్‌తో సన్నిహితంగా మెలిగానని, ఇప్పుడు చాలా కష్టంగా పార్టీని వీడుతున్నానని రాజయ్య యాదవ్‌ తెలిపారు.

► ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్‌లో చాలా మార్పు వచ్చిందని, మునుపటిలా పార్టీ సీనియర్లను గౌరవించడం లేదని, కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వడం లేదని పేర్కొన్నారు. తనయుడు కేటీఆర్‌ కోసం పార్టీ సీనియర్లను కేసీఆర్‌ తొక్కిపడేశారని, పార్టీతో సంబంధలేని వాళ్లు, బయటివాళ్లదే టీఆర్‌ఎస్‌ రాజ్యమయ్యిందని రాజయ్య యాదవ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

► రాష్ట్రం కోసం పోరాడామని, సాధించిన రాష్ట్రంలో ఉద్యమకారులకే స్థానం లేకుండా పోయిందని, కొంతమంది బాధలో ఉన్నారని, తాను మాత్రం ఆ బాధ నుంచి విముక్తి చెందుతున్నానని పేర్కొన్నారు.  

► తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని,  పదవుల కోసం తాను ఏనాడూ పాకులాడలేదని.. తన, తెలంగాణ ఆత్మగౌరవం కోసమే తాను పార్టీని వీడాల్సి వస్తోందని కామెంట్లు చేశారు. 

► టీఆర్‌ఎస్‌లో ఉన్నంతకాలం ఉదమ్యకారులకు బాధే మిగులుతుంది. టీఆర్‌ఎస్‌ కోసం పని చేసినవాళ్లను అవమానకరంగా చూస్తున్నారు. నాకు కాళ్లు మొక్కడం అలవాటు లేదు. ఏదైనా తప్పు చేశానని పార్టీ నుంచి తొలగించినా బాగుండేది. ఏదీ జరగడం లేదు.

► పార్టీలో కొందరు వాపును చూసి బలుపు అనుకుంటున్నారని, ఇది మంచి పద్ధతి కాదని రాజయ్య పేర్కొన్నారు. ప్రస్తుతం వాళ్ల టైం నడుస్తోందని, కానీ, ఇలా ప్రవర్తించిన పార్టీలు రాజకీయ చరిత్రలో కనుమరుగైన సందర్భాలున్నాయని గుర్తించాలని హితవు పలికారాయన.

► ఆత్మ గౌరవం లేనిచోట ఎవరూ ఉండరు. రేపో మాపో మరికొందరు పార్టీని వీడతారు. టీఆర్‌ఎస్‌ ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌. కానీ, ఆ పార్టీ బలహీనంగా ఉండడంతో బీజేపీ వైపే ఎక్కువ మంది చూస్తున్నారు. బీజేపీ నేతలు నాతో కూడా టచ్ లో ఉన్నారు అని రాజయ్య యాదవ్‌ తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top