breaking news
rajaiah yadav
-
వరంగల్: టీఆర్ఎస్కు రాజయ్య షాక్
సాక్షి, వరంగల్: తెలంగాణ రాష్ట్ర సమితికి షాక్ ఇచ్చారు సీనియర్ నేత కన్నెబోయిన రాజయ్య యాదవ్. కేసీఆర్‌కు సన్నిహితుడిగా పేరున్న రాజయ్య యాదవ్.. పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన టీఆర్ఎస్ పరిస్థితులపై, సీఎం కేసీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ మలి దశ ఉద్యమ టైంలో కేసీఆర్ వెంట నడిచిన రాజయ్య యాదవ్.. రాష్ట్ర సాధన ఉద్యమంలోనూ కీలకంగా వ్యహరించారు. కేసీఆర్‌తో పాటు ఆమరణ దీక్షకు దిగిన ఆరుగురు సీనియర్ నేతలతో రాజయ్య యాదవ్ ఒకరు. కరీంనగర్ అలుగునూర్ వద్ద అరెస్టై ఖమ్మం జైలులో కేసీఆర్‌తో పాటు జైల్లోనూ గడిపారు రాజయ్య యాదవ్. గతంలో తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ చైర్మన్‌గా రాజయ్య యాదవ్ పని చేశారు కూడా. ఇవాళ పార్టీకి రాజీనామా ప్రకటించిన సందర్భంలో ఇవాళ ఆయన హాట్ కామెంట్లు చేశారు. ► 22 సంవత్సరాలపాటు పార్టీలో కొనసాగానని, కేసీఆర్‌తో సన్నిహితంగా మెలిగానని, ఇప్పుడు చాలా కష్టంగా పార్టీని వీడుతున్నానని రాజయ్య యాదవ్ తెలిపారు. ► ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్‌లో చాలా మార్పు వచ్చిందని, మునుపటిలా పార్టీ సీనియర్లను గౌరవించడం లేదని, కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని పేర్కొన్నారు. తనయుడు కేటీఆర్ కోసం పార్టీ సీనియర్లను కేసీఆర్ తొక్కిపడేశారని, పార్టీతో సంబంధలేని వాళ్లు, బయటివాళ్లదే టీఆర్ఎస్ రాజ్యమయ్యిందని రాజయ్య యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ► రాష్ట్రం కోసం పోరాడామని, సాధించిన రాష్ట్రంలో ఉద్యమకారులకే స్థానం లేకుండా పోయిందని, కొంతమంది బాధలో ఉన్నారని, తాను మాత్రం ఆ బాధ నుంచి విముక్తి చెందుతున్నానని పేర్కొన్నారు. ► తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని, పదవుల కోసం తాను ఏనాడూ పాకులాడలేదని.. తన, తెలంగాణ ఆత్మగౌరవం కోసమే తాను పార్టీని వీడాల్సి వస్తోందని కామెంట్లు చేశారు. ► టీఆర్ఎస్లో ఉన్నంతకాలం ఉదమ్యకారులకు బాధే మిగులుతుంది. టీఆర్ఎస్ కోసం పని చేసినవాళ్లను అవమానకరంగా చూస్తున్నారు. నాకు కాళ్లు మొక్కడం అలవాటు లేదు. ఏదైనా తప్పు చేశానని పార్టీ నుంచి తొలగించినా బాగుండేది. ఏదీ జరగడం లేదు. ► పార్టీలో కొందరు వాపును చూసి బలుపు అనుకుంటున్నారని, ఇది మంచి పద్ధతి కాదని రాజయ్య పేర్కొన్నారు. ప్రస్తుతం వాళ్ల టైం నడుస్తోందని, కానీ, ఇలా ప్రవర్తించిన పార్టీలు రాజకీయ చరిత్రలో కనుమరుగైన సందర్భాలున్నాయని గుర్తించాలని హితవు పలికారాయన. ► ఆత్మ గౌరవం లేనిచోట ఎవరూ ఉండరు. రేపో మాపో మరికొందరు పార్టీని వీడతారు. టీఆర్ఎస్ ప్రత్యామ్నాయం కాంగ్రెస్. కానీ, ఆ పార్టీ బలహీనంగా ఉండడంతో బీజేపీ వైపే ఎక్కువ మంది చూస్తున్నారు. బీజేపీ నేతలు నాతో కూడా టచ్ లో ఉన్నారు అని రాజయ్య యాదవ్ తెలిపారు. -
తెలంగాణ అభివద్ధి కేసీఆర్‌తోనే సాధ్యం
గజ్వేల్ రూరల్/జోగిపేట/మెదక్ టౌన్, న్యూస్‌లైన్: తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తోనే సాధ్యమని ఆ పార్టీ జిల్లా ఇన్చార్జి రాజయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం గజ్వేల్, జోగిపేట, మెదక్ పట్టణాల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ సాధించుకున్నామన్నారు. టీఆర్ఎస్ ప్రజలకు ప్రధానమైన పలు హామీలు ఇచ్చిందని వాటిని నెరవేర్చేందుకు అధికారంలోకి రావాల్సి ఉందన్నారు. కాంగ్రెస్‌తో పొత్తు ప్రసక్తేలేదు.. తెలంగాణ తెచ్చింది తామేనని కాంగ్రెస్ నాయకులు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని రాజయ్య యాదవ్ అన్నారు. 60 ఏళ్ల పోరాటం, 1,200 మంది విద్యార్థులు, యువకుల బలిదానాలు చేసుకున్నా స్పందించని కాంగ్రెస్ నేతలకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం అని చెప్పుకోవడం సరికాదన్నారు. వెనుక బడిన తెలంగాణ ప్రాంతాన్ని వదిలి సీమాంధ్ర ప్రాంతానికి ప్యాకేజీ ఇవ్వడం దారుణమన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు ప్రసక్తేలేదని రాజయ్య యాదవ్ స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్ కీలకపాత్ర కీలకమని, పునర్నిర్మాణంలోనూ టీఆర్ఎస్ ప్రధాన భూమిక పోషించాల్సి ఉన్నందున ఒంటరి పోరుకు మొగ్గు చూపుతున్నామన్నారు. చంద్రబాబు తెలంగాణకు సీఎం అవుతావా? తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. రెండు కళ్ల సిద్ధాంతాన్ని పాటించిన చంద్రబాబు తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారన్నారు. తెలంగాణలో దుకాణాన్ని మూసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఈ ప్రాంతానికి బీసీ అభ్యర్థిని సీఎం చేస్తాననడం హాస్యాస్పదమని రాజయ్య యాదవ్ అన్నారు. చంద్రబాబు పరిపూర్ణత గల రాజకీయ నాయకుడైతే తెలంగాణకు సీఎం కావాలని సవాల్ విసిరారు. తెలంగాణ వచ్చే చివరి క్షణం వరకు కూడా అడ్డుకునేందుకు అన్ని జాతీయ పార్టీల నేతల కాళ్లు పట్టుకొని బతిమాలిన చరిత్ర చంద్రబాబుదన్నారు. ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశాల్లో మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, రాష్ర్ట కార్యదర్శి ఎం.దేవేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ లావణ్య, అందోల్ నియోజకవర్గ ఇన్చార్జి పి.కిష్టయ్య, గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి భూంరెడ్డి, రాష్ట్ర నాయకులు ఎలక్షన్‌రెడ్డి, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్ పాల్గొన్నారు.