బాబుది రైతులను పాడుచేసే దగా యాత్ర  | Sakshi
Sakshi News home page

బాబుది రైతులను పాడుచేసే దగా యాత్ర 

Published Fri, May 12 2023 5:26 AM

Karumuri Venkata Nageswara Rao comments over chandrababu naidu  - Sakshi

తణుకు టౌన్‌: అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతుల కోసమంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు చేపట్టింది రైతు పోరుబాట కాదని.. అది రైతు పాడు యాత్రగా మిగిలిపోతుందని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విమర్శించారు.

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలో గురువారం రాత్రి రైతులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో 5 లక్షల మెట్రిక్‌ టన్నుల బాయిల్డ్‌ రైస్‌ కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వ సంస్థలతో ఒప్పందం చేసినట్టు తెలిపారు. దీనివల్ల జిల్లాలో సాగు చేసిన బొండాలు రకం ధాన్యం ఎక్కువగా కొనుగోలు చేసి రైతులకు లాభం కలిగిస్తున్నట్టు చెప్పారు.

చంద్రబాబు ఐరన్‌ లెగ్‌ నాయకుడని, ఆయన వెళ్లిన ప్రతిచోట వర్షాలు, ఈదురు గాలుల కారణంగా రైతులు మరింత నష్టపోతున్నారని చెప్పారు. గురువారం సాయంత్రం తణుకు నియోజకవర్గంలోని ఇరగవరం గ్రామంలోకి చేరగానే భారీ వర్షంతో కూడిన ఈదురు గాలులకు 10 విద్యుత్‌ స్తంభాలు కూలిపోయి, రైతులకు మరింత నష్టం ఏర్పడిందని తెలిపారు. ఈ పరిణామాలతో చంద్రబాబు చేపట్టిన యాత్ర రైతు పాడు యాత్రగా మారి రైతులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు.  

సంచుల కొరత లేదు 
ధాన్యం కొనుగోలుకు గోనె సంచుల కొరత లేదని, బియ్యానికి ఉపయోగించే సంచులను కూడా ధాన్యం రైతులకు అందించే ఏర్పాట్లు చేశామని మంత్రి కారుమూరి చెప్పారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలులో అలసత్వం వహించిన 36 రైస్‌ మిల్లులను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టామని, 46 మంది అధికారులపై చర్యలు కూడా తీసుకున్నామని తెలిపారు. ధాన్యం రైతులకు బుధవారం ఒక్కరోజే రూ.470 కోట్ల మొత్తం ఆన్‌లైన్‌ ద్వారా రైతుల బ్యాంక్‌ ఖాతాలకు జమ చేసినట్టు చెప్పారు.

రైతులు కాపకాయల అయ్యప్పస్వామి, కడియం సత్యనారాయణ మాట్లాడుతూ.. గతం కంటే ఈ సంవత్సరం ధాన్యం సొమ్ము నాలుగు రోజుల్లోనే బ్యాంక్‌ ఖాతాల్లో పడినట్టు చెప్పారు. రైతు భరోసా కేంద్రం సేవలు చాలా బాగున్నాయని, ఎప్పటికప్పుడు ధాన్యానికి సంబంధించిన వివరాలు, సమాచారం అందించారని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులను మంత్రి కారుమూరి సత్కరించారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement