మా మధ్య విభేదాల్లేవు

Kakani Govardhan Reddy And Anilkumar Yadav On Yellow Media - Sakshi

అవన్నీ మీడియా సృష్టే 

అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం 

మంత్రి కాకాణి, మాజీ మంత్రి అనిల్‌

సాక్షి, అమరావతి: తమ మధ్య విభేదాల్లేవని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ ప్రాంతీయ కో ఆర్డినేటర్‌ అనిల్‌కుమార్‌యాదవ్‌ స్పష్టం చేశారు. విభేదాలు మీడియా సృష్టేనన్నారు. తామంతా కలిసి పనిచేస్తున్నామని పేర్కొన్నారు. వారు బుధవారం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. అనంతరం వారు వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. 2024 ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ను మళ్లీ సీఎంను చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. మంత్రి కాకాణి మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనిల్‌కుమార్‌యాదవ్‌తోపాటు నెల్లూరు జిల్లాలో పార్టీ నేతలంతా కలిసికట్టుగా పోరాటం చేశామని చెప్పారు.

నెల్లూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్‌ చేసిందని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చాక తొలి మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న అనిల్‌తో కలిసి నెల్లూరు జిల్లా అభివృద్ధికి కృషిచేశామన్నారు. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ నేపథ్యంలో సీఎం వైఎస్‌ జగన్‌ తనను మంత్రివర్గంలోకి తీసుకున్నారని, అనిల్‌ని వైఎస్సార్, తిరుపతి జిల్లాల పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తగా నియమించారని చెప్పారు. తమ మధ్య విభేదాలు సృష్టించాలనే సంఘవిద్రోహశక్తులు నెల్లూరులో ఫ్లెక్సీలను చింపేశాయన్నారు.

నిప్పులేకుండానే పొగ సృష్టించడం ఎల్లో మీడియాకు అలవాటేనన్నారు. ‘సీఎం వైఎస్‌ జగన్‌ను కలిశాక  మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోతే.. సీఎం వైఎస్‌ జగన్‌ చీవాట్లు పెట్టారు.. అందుకే కాకాణి మొహం చాటేశారు.. అంటూ తప్పుడు కథనాలు ప్రసారం చేస్తారు కాబట్టే మీడియాతో మాట్లాడుతున్నా..’ అని చెప్పారు. ‘కరువుకు మారుపేరు చంద్రబాబు.. సుభిక్షానికి మరోపేరు సీఎం జగన్‌.. ఏ కారణంతో రైతులు టీడీపీకి ఓట్లేస్తారో చంద్రబాబు చెప్పాలి..’ అని పేర్కొన్నారు. రైతులు, కౌలురైతులపై ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ ప్రకారం మాట్లాడటం తప్ప రైతుల గురించి పవన్‌కల్యాణ్‌కు ఏం తెలుసని ఆయన ప్రశ్నించారు. 

సీఎం మనుషులం.. ఆయన గీతగీస్తే దాటం.. 
అనిల్‌కుమార్‌యాదవ్‌ మాట్లాడుతూ తామంతా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సైనికులమని, ఆయన ఏది చెబితే అది చేస్తామని చెప్పారు. తనపై నమ్మకంతో రీజనల్‌ కో ఆర్డినేటర్‌గా నియమించిన సీఎం జగన్‌కి కృతజ్ఞతలు చెప్పేందుకు కలిశానన్నారు. సీఎం జగన్‌ తనకు మూడేళ్లు మంత్రిగా అవకాశం ఇచ్చారని, ఇప్పుడు కాకాణికి ఇచ్చారని చెప్పారు. అందరం కలిసికట్టుగా పార్టీ బలోపేతం కోసం, ప్రజల కోసం పనిచేస్తామన్నారు.  

వైఎస్సార్‌సీపీలో వర్గాలు ఉండవని, అంతా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ వర్గమన్నారు. అధినేత మాటే తమకు శిరోధార్యమన్నారు. జగన్‌ మనుషులమైన తాము ఆయన గీతగీస్తే దాటబోమని స్పష్టం చేశారు. ఇప్పుడు మంత్రి పదవులు కోల్పోయిన 14 మందిమి మళ్లీ మంత్రులమవుతామన్నారు.  తాను మంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు నియోజకవర్గంలో ఏ పార్టీ ఫ్లెక్సీలైనా తీసేశారంటే.. అది మునిసిపల్‌ కార్పొరేషన్‌ వాళ్లు తీసేసినవేనన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కూడా గాలికి చిరిగాయన్నారు. వచ్చే ఎన్నికల్లో ఫ్రంట్‌ వారియర్స్‌గా ముందుకెళ్తామని, అందుకు సీఎం జగన్‌ తమను ఎంచుకుని పార్టీ బాధ్యతలు ఇవ్వడం గర్వంగా ఉందని అనిల్‌కుమార్‌యాదవ్‌ చెప్పారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top