చంద్రబాబు, బాలయ్యకు కొత్త కష్టాలు.. జూనియర్‌ ఎన్టీఆర్‌తో ఎఫెక్ట్‌? | Sakshi
Sakshi News home page

చంద్రబాబు, బాలయ్యకు కొత్త కష్టాలు.. జూనియర్‌ ఎన్టీఆర్‌తో ఎఫెక్ట్‌?

Published Sun, Jan 28 2024 3:37 PM

Jr NTR Fans Political Domination To Chandrababu And TDP - Sakshi

జూనియర్‌ ఎన్‌టీఆర్ పేరు వినిపించినా.. ఫోటో కనిపించినా నారా, నందమూరి కుటుంబాలు వణికిపోతున్నాయి ఎందుకు? నాయకత్వ లక్షణాలు లేని కొడుకును తలచుకుని చంద్రబాబు, అల్లుడిని గుర్తు చేసుకుకుని బాలయ్య ఆందోళన చెందుతున్నారా? ఎప్పటికైనా లోకేష్‌కు జూనియర్‌ ఎన్‌టీఆర్‌తోనే ప్రమాదమని భయపడుతున్నారా? హైదరాబాద్‌లోని ఎన్‌టీఆర్ ఘాట్‌లో ఏర్పాటు చేసిన జూనియర్‌ ఫ్లెక్సీలను తొలగించమని బాలయ్య ఎందుకు ఆదేశాలు జారీ చేశారు?..

జూనియర్ ఎన్టీఆర్ పేరు చెబితేనే చంద్రబాబు బాలకృష్ణ ఉలిక్కిపడుతున్నారు. జూనియర్ ఫ్లెక్సీలు చూసినా, జెండాలను చూసినా వారు వణికిపోతున్నారు. అవి తమ కంటికి కనిపించకుండా తొలగించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో సభలు, సమావేశాలు అంటూ చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతున్నారు. చంద్రబాబు సభల్లో జూనియర్ అభిమానులు జెండాలు పట్టుకుని ప్రత్యక్షమవుతున్నారు. 

సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారు. కుప్పంలో సైతం చంద్రబాబుకు ఇదే పరిస్థితి ఎదురైంది. జూనియర్ సీఎం.. సీఎం అంటూ ఆయన అభిమానులు చేస్తున్న నినాదాలు చంద్రబాబుకు తలనొప్పిగా మారుతున్నాయి. తన కుమారుడు లోకేష్‌కు భవిష్యత్తులో పార్టీలో జూనియర్ ఎన్టీఆర్‌తో పోటీ తప్పదని భావించిన చంద్రబాబు ఎక్కడా జూనియర్ పేరు వినపడకుండా జాగ్రత్త పడుతున్నారు. వ్యూహాత్మకంగానే పార్టీలో జూనియర్ ఎన్టీఆర్‌కు ఎలాంటి పాత్ర లేకుండా చేసేశారు చంద్రబాబు. రోజురోజుకు బలహీన పడుతున్న పార్టీలోకి జూనియర్‌ను తీసుకురావాలనే సూచన చేసిన బుచ్చయ్య చౌదరి, అయ్యన్నపాత్రుడు లాంటి సీనియర్ నేతలకు చంద్రబాబు పార్టీలో ప్రాధాన్యత తగ్గిస్తూ వస్తున్నారు.

చంద్రబాబే కాదు జూనియర్‌ని చూసి బాలకృష్ణ కూడా ఆందోళన చెందుతున్నారు. తన అల్లుడు లోకేష్‌కు జూనియర్ నుంచి పోటీ తప్పదని భావించిన బాలకృష్ణ జూనియర్‌ను నందమూరి కుటుంబానికి కూడా దూరం చేశారు. కుటుంబంలో జరిగే మంచి చెడుల కార్యక్రమాలకు సైతం పిలవడం మానేశారు. కుటుంబంలో మిగతా సభ్యులు కూడా జూనియర్‌తో కలవకుండా కట్టడి చేశారు. నందమూరి కుటుంబంలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లను ఒంటరి చేసే ప్రయత్నం చేస్తున్నారు.

రక్తం పంచుకు పుట్టిన అన్న హరికృష్ణ కుమారులని కూడా చూడకుండా బాలయ్య వారి మీద విద్వేషం వెళ్ళగక్కుతున్నారు. వారి సినిమాలపై టీడీపీ సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేయిస్తూ.. సినిమాలు ప్లాప్ అంటూ రివ్యూలు రాయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ దగ్గర అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే వాటిని తీసివేయాలని బాలకృష్ణ హుకుం జారీ చేశారు. 

అవసరం ఉన్నన్ని రోజులు హరికృష్ణను, జూనియర్‌ను వాడుకున్న చంద్రబాబు, బాలకృష్ణలు తర్వాత వారిని కరివేపాకులా పక్కన పెట్టేశారు. ఎన్టీఆర్ ఎపిసోడ్‌లో హరికృష్ణను అడ్డం పెట్టుకొని కుటుంబాన్ని ఏకతాటిపైకి తెచ్చిన చంద్రబాబు.. మామకు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి సీటు లాక్కున్నారు. హరికృష్ణ అవసరం తీరాక అనేక రూపాల్లో అవమానించి మానసికంగా వేధించారు. సమైక్య ఆంధ్ర కోసం ఎంపీ పదవికి రాజీనామా చేసినా మళ్లీ టీడీపీ నుంచి ఎటువంటి పదవి ఇవ్వకుండా పక్కన పెట్టారు.

పొలిట్‌బ్యూరో సభ్యునిగా హరికృష్ణను తొలగించి ఆయన స్థానంలో తన వియ్యంకుడు బాలకృష్ణను తీసుకువచ్చారు. హరికృష్ణ తరహాలోనే జూనియర్‌ని కూడా వాడుకుని వదిలేసారు. జూనియర్‌తో ఎన్నికల్లో ప్రచారం చేయించుకున్న చంద్రబాబు తర్వాత పార్టీలో ప్రాధాన్యత లేకుండా చేశారు. ఇదంతా భవిష్యత్తులో తన కుమారుడు లోకేష్‌కు జూనియర్ పోటీగా ఎదుగుతాడనే భయంతోనే అటు చంద్రబాబు ఇటు బాలకృష్ణ జూనియర్‌ను తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. 

Advertisement
Advertisement