Karnataka Assembly Results: ప్రజల తీర్పుని గౌరవిస్తాం: హెచ్‌డీ కుమారస్వామి

JDS Leader HD Kumaraswamy On Karnataka Assembly Election Results - Sakshi

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కింగ్‌ మేకర్ అవుతుంది అనుకున్న జేడీఎస్‌కు ఊహించని భంగపాటు ఎదురైంది. ఆ పార్టీ కేవలం 20 స్థానాల్లోనే ఆధిక్యం కనబరుస్తోంది. గత ఎన్నికల్లో గెల్చిన 37 సీట్లతో పోల్చితే ఈ సంఖ్య చాలా తక్కువ. దీంతో ప్రజల తీర్పుని గౌరవిస్తామని జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి తెలిపారు. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుని ముందుకెళ్తామని చెప్పారు. ప్రజల కోసం తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

కాగా.. చెన్నపటణ నుంచి పోటీ చేసిన హెచ్‌డీ కుమారస్వామి ఘన విజయం సాధించారు. హోలెనరసీపుర్‌ నుంచి బరిలోకి దిగిన ఈయన సోదురుడ హెచ్‌.డీ రేవన్న కూడా గెలుపొందారు. కానీ రామనగరం నుంచి పోటీ చేసిన కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమారస్వామి మాత్రం ఓటమిపాలయ్యారు. తన తాత హెచ్‌డీ దేవెగౌడకు కంచుకోటగా చెప్పుకొనే ఈ నియోజకవర్గంలో నిఖిల్ ఓడిపోవడం జేడీఎస్‌ను కలవరపాటుకు గురి చేస్తోంది.

మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో మెజార్టీకి 113 స్థానాలు అవసరం. ప్రస్తుతం కాంగ్రెస్‌ 137 స్థానాల్లో గెలుపు దిశగా దూసుకుపోతంది. బీజేపీ 64 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. జేడీఎస్ 20, ఇతరులు 4 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నారు.

మరోవైపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. బెంగళూరులో రేపు సీఎల్పీ సమావేశం నిర్వహించనుంది. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆదివారం సాయంత్రం గవర్నర్‌ను కలవనుంది.
చదవండి: కాంగ్రెస్ విజయానికి కారణమైన 6 మంత్రాలివే..

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top