యువతకు చంద్రబాబు మళ్ళీ వెన్నుపోటు: జక్కంపూడి రాజా | Jakkampudi Raja Fires On Chandrababu Fake Promises | Sakshi
Sakshi News home page

యువతకు చంద్రబాబు మళ్ళీ వెన్నుపోటు: జక్కంపూడి రాజా

Jul 1 2025 6:21 PM | Updated on Jul 1 2025 7:41 PM

Jakkampudi Raja Fires On Chandrababu Fake Promises

సాక్షి, తాడేపల్లి: అధికారం కోసం ప్రతిసారీ యువతను నమ్మించి మోసం చేయడం అలవాటుగా చేసుకున్న చంద్రబాబు మరోసారి తన నిజ స్వరూపాన్ని ప్రదర్శించారని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 20 లక్షల ఉద్యోగాలు, ప్రతి నిరుద్యోగికి భృతి అంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు ఏదని ప్రశ్నించారు.

చివరికి మెగా డీఎస్సీ అంటూ సీఎంగా చంద్రబాబు చేసిన తొలి సంతకానికే ఏడాది కాలంగా విలువలేని దారుణమైన పాలన ఏపీలో జరుగుతోందని ధ్వజమెత్తారు. కూటమి చేస్తున్న మోసాలపై యువత తీవ్ర ఆగ్రహంతో ఉందని, తగిన విధంగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే..

వైఎస్సార్‌సీపీ యువ‌జ‌న విభాగంతో ఇవాళ పార్టీ అధినేత‌, మాజీ సీఎం వైఎస్‌ జ‌గ‌న్ స‌మావేశం నిర్వ‌హించి దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అరాచ‌కాల‌పై గొంతెత్తాల‌ని సూచించారు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని ఆదేశించారు. ఆయ‌న ఆదేశాల‌తో వైఎస్సార్సీపీ యువ‌జ‌న విభాగం రెట్టించిన ఉత్సాహంతో ప‌నిచేస్తుంది. వైఎస్‌ జ‌గ‌న్‌ని సీఎం చేసే దాకా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేస్తాం. ప్ర‌భుత్వం మెడ‌లు వంచి సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాలు అమ‌లయ్యేలా చూస్తాం. వైఎస్‌ జ‌గ‌న్ మ‌ళ్లీ సీఎం అయితేనే రాష్ట్రానికి మంచి రోజులొస్తాయి. సంక్షేమం, అభివృద్ధి జ‌ర‌గాలంటే ఆయ‌న సీఎం కావాలి. ప్ర‌భుత్వం కుట్ర‌లు చేయ‌డం మాని ఇకనైనా ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల అమ‌లు కోసం ప్ర‌య‌త్నం చేయాలి.

నిరుద్యోగులను దగా చేస్తున్న ప్రభుత్వమిది
వైఎస్సార్సీపీ పాల‌న‌లో వైఎస్‌ జ‌గ‌న్ ప్ర‌క‌టించిన టీచ‌ర్ పోస్టులను భ‌ర్తీ చేస్తానంటూ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత చంద్రబాబు మెగా డీఎస్సీ ఫైల్‌పై తొలి సంత‌కం చేశారు. ఏడాది పూర్త‌యినా దానికి దిక్కుమొక్కు లేకుండా చేశాడు. 2014లో నిరుద్యోగ యువ‌త‌కు నెల‌కు రూ. 2వేల నిరుద్యోగ భృతి ఇస్తామ‌ని చెప్పి మోసం చేసిన చంద్ర‌బాబు, 2024 లోనూ నెల‌కు రూ.3వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామ‌ని మాయమాటలు చెప్పి ఓట్లు దండుకున్నారు. చంద్రబాబుకు వంతపాడే ఈనాడు పత్రిక లెక్క‌ల ప్ర‌కారమే రాష్ట్రంలో 1.56 కోట్ల మంది నిరుద్యోగ యువ‌త ఉంటే గ‌త ఏడాది వారంద‌రికీ ఒక్కొక్క‌రికి రూ. 36 వేలు చొప్పున చంద్ర‌బాబు బ‌కాయి పడ్డాడు. ఒక్క నిరుద్యోగ భృతి పేరుతోనే రూ.56 వేల కోట్ల‌కు పైగా కూట‌మి ప్ర‌భుత్వం బ‌కాయిపడింది.

కొత్త ఉద్యోగాల భర్తీ లేదు.. ఉన్న ఉద్యోగాల తొలగింపు
కూట‌మి మేనిఫెస్టోలో ఏడాదికి 4 ల‌క్షల చొప్పున ఐదేళ్ల‌లో యువ‌త‌కు 20 ల‌క్ష‌ల ఉద్యోగాలిస్తామ‌ని చెప్పారు. ఉద్యోగాలు వ‌చ్చే వ‌ర‌కు నెల‌కు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామ‌ని మేనిఫెస్టోలో ప్ర‌క‌టించారు. ఏడాది గ‌డిచినా రాష్ట్రంలో ఏ ఒక్క నిరుద్యోగికి కూడా ఒక్క రూపాయి ఇవ్వ‌లేదు. ఎన్నిక‌ల్లో ప్ర‌తి ఇంటికీ వెళ్లి సూప‌ర్ సిక్స్ పేరుతో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, చంద్ర‌బాబు సంత‌కాలు చేసిన బాండ్లు పంపిణీ చేశారు. కానీ కూట‌మి ప్రభుత్వం వ‌చ్చాక ఏడాదిలో ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వ‌క‌పోగా ఒక్కో వ్య‌వ‌స్థ‌నూ ఎత్తివేస్తూ ఉన్న ఉద్యోగాల‌నే తీసేస్తున్నారు.

వ‌లంటీర్ల గౌర‌వం వేత‌నం రూ.5 వేల నుంచి రూ.10 వేల‌కు పెంచుతామ‌ని చెప్పిన ఈ కూట‌మి పెద్ద‌లు, చివరికి వారిని రోడ్డుపాలు చేశారు. గ్రామ వార్డు స‌చివాల‌యాల్లో 33 వేల పోస్టులు భ‌ర్తీ చేయాల్సి ఉండ‌గా రేష‌న‌లైజేష‌న్ పేరుతో ఉన్న ఉద్యోగులే ఎక్కువ‌ని తేల్చేసి నిరుద్యోగుల ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లారు. ఇంటింటికీ రేష‌న్ పంపిణీ చేస్తున్న ఎండీయూ వాహ‌నాల‌ను తీసేసి 15 వేల మందిని ఉద్యోగాల్లో నుంచి తొల‌గించారు. ప్ర‌భుత్వం నిర్వ‌హించే మ‌ద్యం దుకాణాల్లో ప‌నిచేసే 18 వేల మంది ఉద్యోగుల‌ను తొల‌గించారు.

ఏపీ ఫైబ‌ర్ నెట్ కార్పొరేష‌న్‌లో 2 వేల మంది ఉద్యోగుల‌ను తొల‌గించారు. ఉపాధి హామీ ప‌థ‌కంలో ఫీల్డ్ అసిస్టెంట్‌లుగా దాదాపు 15 ఏళ్లుగా ప‌నిచేస్తున్న వారిని తొల‌గించి దాదాపు 2,360 మందికి ఉపాధి లేకుండా చేశారు. ఏపీఎండీసీలో ఔట్‌సోర్సింగ్ విధానంలో ప‌నిచేసే దాదాపు 400 మంది ఉద్యోగుల‌ను, ఉద్యోగుల జీతాన్ని ద‌ళారులు దోచుకోకుండా కోత‌ల్లేకుండా శాశ్వ‌త ఉద్యోగుల‌కు ద‌క్కే అన్ని సౌక‌ర్యాలు క‌ల్పించిన ఆప్కాస్ అనే వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేయాల‌నే కుట్ర జ‌రుగుతోంది.

వైఎస్‌ జ‌గ‌న్ పాల‌న‌లో 6.30 ల‌క్ష‌ల ప్ర‌భుత్వ ఉద్యోగాలు
వైఎస్‌ జగన్ ఐదేళ్ల పాలనలో యువతకు అండగా నిలిచారు. ఉద్యోగాల భర్తీ నుంచి, ఉపాధి కల్పన వరకు చక్కని ప్రణాళికతో పాలనను సాగించారు. పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారు. అధికారంలోకి వ‌చ్చిన 3 నెల‌ల్లోనే గ్రామ స‌చివాల‌యాల‌ను ప్రారంభించారు. ఒకేసారి దాదాపు 1.36 లక్షల మంది సచివాలయ శాశ్వత ఉద్యోగాలు భర్తీ చేశారు. 2.60 ల‌క్ష‌ల మంది వ‌లంటీర్ల‌ను నియ‌మించి సంక్షేమ ప‌థ‌కాల‌ను ఇంటికే అందించారు.

ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాల‌న‌లో క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల్లో 6.30 ల‌క్ష‌ల మందికి ఉద్యోగాలు క‌ల్పించ‌డం జ‌రిగింది. ఐదేళ్ల‌లో మెడిక‌ల్ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో దాదాపు 48 వేల ఉద్యోగాలు ఇవ్వ‌డం దేశ చ‌రిత్ర‌లో తొలిసారి. ఏపీయ‌స్ ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేసి ఉద్యోగుల దీర్ఘ‌కాలిక స‌మ‌స్య‌కు ఎండ్ కార్డ్ వేశారు. ఎంఎస్ఎంఈల ద్వారా 33,82,242 మందికి ఉపాధి లభించింది. వైఎస్‌ జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌లో ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగంలో క‌లిపి 40 ల‌క్ష‌ల మందికి ఉద్యోగాలు క‌ల్పించిన‌ట్టు సోషియో ఎక‌న‌మిక్ స‌ర్వే రిపోర్టులో పొందుప‌ర్చ‌డం జ‌రిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement