సానుభూతి కోసమే ఇదంతా.. ఈటల రాజేందర్‌పై మంత్రి జగదీష్‌రెడ్డి ఫైర్‌

Jagadeesh Reddy Fires On Etela Rajender Over False Allegations On Attack - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత ఈటల రాజేందర్‌ అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి జగదీష్‌ రెడ్డి ధ్వజమెత్తారు. వాస్తవాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్‌లో మంత్రి మాట్లాడుతూ.. మునుగోడులో ధర్మమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు. శాంతి భద్రతలు, గన్‌ లైసెన్స్‌లపై ఈటల అసత్యాన్ని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ వంచన చేరి భాష, న్యాయం, ధర్మం పేరుతో సానుభూతి కోసం మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయన నిలబడిందే కౌరవుల వైపు అంటూ దుయ్యబట్టారు.

బీజేపీ నేతలే టీఆర్ఎస్ నేతలపై దాడులు చేశారని మంత్రి జగదీష్‌రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన బీజేపీ నేతలే దాడులు చేశారని, మునుగోడులో మెజారిటీ రాదనే విషయమే అర్థమయి ఇలాంటి పనులకు పాల్పడ్డారని మండిపడ్డారు. అందుకే రాజేందర్ సానుభూతి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. ఓటమికి సాకులు వెతుక్కుంటూ అసత్యలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్‌కు హింస నచ్చదు.. శాంతియుతంగా ఎన్నికలకు వెళ్లాలనే కోరుకుంటారని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లాలో ఎన్నో ఘర్షణలు ఉండేవని, టీఆర్ఎస్ వచ్చాక ఒక రాజకీయ ఘర్షణ జరగలేదని తెలిపారు.

‘తెలంగాణలో అభివృద్ధి జరగకపోతే ఉత్తప్రదేశ్, మధ్య ప్రదేశ్, గుజరాత్ వాళ్ళు ఎందుకు మాట్లాడుకుంటున్నారు. దుర్మార్గమైన పార్టీలో చేరి ఏదో మాట్లాడి సానుభూతి పొందాలని చూస్తున్నారు. తెలంగాణలో ఉన్న శాంతి భద్రతలు, రక్షణ ఇంకెక్కడ లేదు. షీటీమ్స్ ఎంతో బాగా పనిచేస్తున్నాయి. ఎవరు ఎటు వైపు ఉన్నారో, ఎవరు కౌరవుల వైపు చేరారో అన్ని ప్రజలకు తెలుసు. దాడులు దాడులు అంటున్నరు.. ఎవరు దాడులు చేశారో అన్ని సాక్షాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ సోదాలేమి మా ఆత్మస్థైర్యాన్ని కోల్పోయేలా చేయవు.. ప్రజలు మా వైపు ఉన్నారు. మాతో ఉన్నారు. నా పీఏలపై ఎక్కడా సోదాలు జరగలేదు. నా సన్నిహితుడుపై జరిగింది’ అని మంత్రి పేర్కొన్నారు.
చదవండి: మునుగోడులో రోడ్డెక్కిన ఓటర్లు.. 10 వేలు, తులం బంగారం ఇస్తామని చెప్పి ..

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top