
సాక్షి, నెల్లూరు జిల్లా: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరు పర్యటనపై అక్రమ కేసుల పర్వం మొదలైంది. వైఎస్సార్‌సీపీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. 30 పోలీసు యాక్ట్ అమల్లో ఉండగా నిబంధనలు అతిక్రమించి ఆందోళన చేశారని మాజీ మంత్రి ప్రసన్నకుమార్‌రెడ్డితో పాటు మరికొందరిపై దర్గామిట్ట పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారు.
ప్రసన్న ఇంటికి సమీపంలో వైఎస్ జగన్ కోసం ఎదురుచూస్తున్న పార్టీ శేణ్రులపై పోలీసులు అకారణంగా లాఠీచార్జ్ చేశారు. దీంతో ప్రసన్న రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ మేరకు ఆయనపై మొదటి కేసు నమోదుగా కాగా.. అభిమానులను అడ్డుకునే క్రమంలో కావలి స్పెషల్ బ్రాంచ్ హెచ్‌సీ మాలకొండయ్య కిందపడడంతో ఆయన చేయి విరిగిందని.. ప్రసన్నకుమార్‌రెడ్డి, బి.శ్రీనివాస్‌యాదవ్, మరికొందరిపై మరో తప్పుడు కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బైక్ ర్యాలీ నిర్వహించారంటూ కొందరు యువకులపైనా కేసు నమోదు చేయనున్నట్లు తెలిసింది.
కాగా, వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన సందర్భంగా ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటి సమీపంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రసన్నకుమార్‌రెడ్డి నివాసానికి వైఎస్ జగన్ వస్తారని తెలియడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులతోపాటు అభిమానులు, ప్రజలు అక్కడికి చేరుకున్నారు. పోలీసుల ఆంక్షల నేపథ్యంలో ఎలాంటి హడావుడి చేయకుండా వైఎస్ జగన్‌ను చూసేందుకు ప్రశాంతంగా నిరీక్షిస్తున్నారు.
ఈ క్రమంలో వైఎస్ జగన్‌కు స్వాగతం పలికేందుకు ప్రసన్నకుమార్‌రెడ్డి ఉదయం 10.30 గంటలకు తన ఇంటికి వంద మీటర్ల దూరంలోని ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్ ప్రాంతానికి చేరుకున్నారు. అంతలో పోలీసులు జోక్యం చేసుకుంటూ.. అక్కడి నుంచి ముందుకెళ్లాలని చెప్పడంతో వారి మాటను గౌరవించి వారు చెప్పిన చోటుకు వెళ్లారు. అదే సమయంలో దర్గామిట్ట సీఐ రోశయ్య, కొందరు పొలీస్ సిబ్బంది అకారణంగా ప్రసన్నతోపాటు పార్టీ కేడర్‌పై లాఠీచార్జ్ చేసి నెట్టేశారు. దీంతో ప్రసన్నకుమార్‌రెడ్డి చేతికి గాయమైంది. పోలీసులు నెట్టేయడంతో ఆయన కిందపడబోయారు. కార్యకర్తలు పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది.

పోలీసుల తీరుతో ప్రసన్నకుమార్‌రెడ్డి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పోలీసుల దురుసు ప్రవర్తనకు ఎస్పీ వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘మా అధినేత వైఎస్ జగన్ వచ్చే వరకు ఇక్కడే కూర్చుంటా.. పోలీసులు ఏం చేసుకుంటారో చేసుకోండి.. అరెస్ట్ చేస్తారా.. చేయండి’ అంటూ రోడ్డుపై బైఠాయించారు. మధ్యాహ్నం 1.15 గంటల (వైఎస్ జగన్ అక్కడికి చేరుకునే వరకు) వరకు మండుటెండలో నడిరోడ్డుపైనే కూర్చున్నారు. పోలీసులు ఓ దశలో ఆయన్ను అక్కడి నుంచి తరలించేందుకు వ్యాన్ తీసుకొచ్చారు. పరిస్థితి చేయి దాటే ప్రమాదం ఉందని భావించి, ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.