Huzurabad Bypoll: ఓటరు ఎటువైపు?

Huzurabad Bypoll: Last 24 Hours Crucial For Ruling And Opposition Parties - Sakshi

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో కీలకంగా చివరి 24 గంటలు

ఊపందుకున్న ప్రలోభాల పర్వం 

భారీగా డబ్బు, మద్యం పంపకాలు 

తమకు డబ్బులు అందలేదంటూ గ్రామాల్లో కొందరి నిరసనలు 

రేపు ఉదయం 7 నుంచే పోలింగ్‌..

గెలుపుపై ప్రధాన పార్టీల్లో ధీమా

సాక్షి, హైదరాబాద్‌:  హుజూరాబాద్‌ ఉప ఎన్నిక పోలింగ్‌కు ఇంకా ఒక్క రోజే ఉండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఓటర్ల తీర్పు ఎటువైపు ఉం టుందోనన్న ఆసక్తి కనిపిస్తోంది. శనివారం ఉద యం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కానుండటంతో.. ప్రధాన పార్టీలు ఓటర్లకు గాలం వేసేందుకు చివరి ప్రయత్నాలు చేస్తున్నాయి. కీలక నేతలు నియోజకవర్గాన్ని వదిలి వెళ్లినా కూడా ఫోన్ల ద్వారా స్థానిక నేతలతో పూర్తిస్థాయిలో టచ్‌లో ఉంటున్నారు.

పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. ఉన్న కాస్త సమయాన్ని ఎలా ‘సద్వినియోగం’ చేసుకోవాలనే దానిపై ఆదేశాలు, సూచనలు ఇస్తున్నారు. ఏ మాత్రం పరిస్థితి చేయి దాటిపోకుండా అభ్యర్థులు, వారి అనుచరులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ క్రమంలో డబ్బు, మద్యం, ఇతర బహుమతుల పంపిణీ భారీ ఎత్తున కొనసాగుతోందని స్థానికులు చెప్తున్నారు. 
(చదవండి: Jagtial Crime News: ముగ్గురు స్నేహితురాళ్ల ఆత్మహత్య?)

అంచనాలకు అందకుండా.. 
ఉప ఎన్నికపై రాష్ట్రవ్యాప్తంగా అనేక ఊహాగానాలు సాగుతున్నాయి. కానీ హుజూరాబాద్‌ నియోజకవర్గం పరిధిలో మాత్రం పరిస్థితి అంచనాలకు అందడం లేదని విశ్లేషకులు చెప్తున్నారు. ప్రచారంలో టీఆర్‌ఎస్, బీజేపీ శ్రేణులు నువ్వా, నేనా అన్నట్టుగా వ్యవహరించాయని.. పోలింగ్‌ మొదలైతేగానీ ఎవరి ప్రభావం ఎంతవరకు ఉంటుందన్నది స్పష్టంగా తెలిసే అవకాశం లేదని అంటున్నారు. ఇక ఓటర్లలో చాలా వరకు గుంభనంగా వ్యవహరిస్తున్నారని ప్రధాన పార్టీల స్థానిక నేతలు చెప్తున్నారు. ఎవరినైనా పలకరిస్తే.. ఇప్పుడే ఏమీ చెప్పలేం అంటున్నారని, పోలింగ్‌ నాడే నిర్ణయించుకుంటామని చెప్తున్నారని పేర్కొంటున్నారు. 

ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. 
టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీ తరఫున బరిలోకి దిగిన ఈటల రాజేందర్‌.. ఎలాగైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు. ఈటలను ఓడించి, తమ అభ్యర్థిని గెలిపించుకుని ప్రజల మద్దతు తమకే ఉందని నిరూపించుకోవాలని టీఆర్‌ఎస్‌ పట్టుదలతో వ్యవహరిస్తోంది.

మరోవైపు రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌ అయిన తర్వాత జరుగుతున్న తొలి ఉప ఎన్నిక కావడం, రాష్ట్రంలో తిరిగి బలం పుంజుకోవాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్‌ పార్టీ ప్రచారం నిర్వహించింది. మొత్తంగా ప్రధాన పార్టీలన్నీ కూడా ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవద్దు అన్నట్టుగా శ్రమిస్తున్నాయి. భారీగా డబ్బు, మద్యం పంపిణీ జరుగుతోందంటూ ప్రచారం జరుగుతుండటంతో ఎన్నికల సంఘం కూడా స్పందించింది. గట్టిగా నిఘా పెట్టాలని, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులు, పోలీసు సిబ్బందిని ఆదేశించింది. 
(చదవండి: బద్వేలు బరిలో లోపాయికారీ పొత్తులు!)

ప్రలోభాల ‘వార్‌’!
డబ్బులు, మద్యం పంపిణీకి సంబంధించి వాట్సాప్, ఫేస్‌బుక్‌ తదితర సోషల్‌ మీడియా యాప్స్‌లో విపరీతంగా పోస్టులు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఒకపార్టీ ఓటుకు రూ.6 వేలు, ప్రతిగా మరోపార్టీ రూ.10 వేలు పంచుతున్నట్టుగా వీడియోలు వైరల్‌ అయ్యాయి. ఇందుకు అనుగుణంగా తమకు డబ్బులు రావడం లేదంటూ పలు గ్రామాల్లో జనం ఆందోళనలు చేయడం మరింత ఆసక్తిగా మారింది.

బుధవారం హుజూరాబాద్, జమ్మికుంట మండలాల్లో రెండు, మూడు చోట్ల కొందరు నిరసనలు తెలిపారు. గురువారం కూడా హుజూరాబాద్, వీణవంక, ఇల్లందకుంట, జమ్మికుంట, కమలాపూర్‌ మండలాల్లో, రెండు మున్సిపాలిటీల పరిధిలోని పలుప్రాంతాల్లో కొందరు గుమిగూడి తమకు డబ్బులు రాలేదంటూ ధర్నాలు చేశారు. స్థానిక నేతలు తమకు పంచాల్సిన డబ్బును నొక్కేస్తున్నారని కొందరు ఆరోపణలు చేయడం, తమకు ఇవ్వడం లేదని నిలదీయడం వంటి ఘటనలు జరిగాయి. 
 
జోరుగా బెట్టింగ్‌లు
రాష్ట్రవ్యాప్తంగా హుజూరాబాద్‌ ఉప ఎన్నికపై ఆసక్తి నెలకొనగా.. దీనిని సొమ్ము చేసుకునేందుకు బెట్టింగ్‌ దందాలు మొదలైనట్టు సమాచారం. శనివారం ఓటింగ్‌ సరళి ఎలా ఉండబోతోంది? పోలింగ్‌ శాతం పెరుగుతుందా, తగ్గుతుందా? ఎవరు గెలుస్తారు? ఎంత మెజార్టీ వస్తుంది? అన్న దానిపై విస్తృతంగా బెట్టింగ్‌ జరుగుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతమున్న అంచనాల మేరకు పోటాపోటీ నెలకొనే అవకాశం ఉందని.. అందువల్ల ప్రధాన పార్టీల మధ్య సమాన స్థాయిలో పందేలు నమోదవుతున్నాయని స్థానికులు చెప్తున్నారు. శనివారం పోలింగ్‌ సరళిని బట్టి బెట్టింగ్‌ ఊపందుకునే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

ఎవరి ధీమా వారిదే.. 
హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో గెలుపు తమదంటే తమదని టీఆర్‌ఎస్, బీజేపీ ముఖ్య నేతలు ధీమా వ్యక్తం చేస్తుండగా.. కాంగ్రెస్‌ గణనీయంగా ఓట్లు సాధిస్తుందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. టీఆర్‌ఎస్‌ తరఫున అన్నీతానే ప్రచారాన్ని ఉరకలెత్తించిన మంత్రి హరీశ్‌రావు.. ఏడున్నరేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధే తమను గెలిపిస్తుందని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.

దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తరహాలోనే హుజూరాబాద్‌లోనూ బీజేపీ ఊపు ఉంటుందని, గెలిచేది తామేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ధీమాగా చెప్తున్నారు. టీఆర్‌ఎస్, బీజేపీ రెండూ అధికార దుర్వినియోగానికి, ప్రలోభాలకు దిగాయని.. ప్రజలు తమ కోసం పోరాడే కాంగ్రెస్‌ పార్టీని గెలిపించుకుంటారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అంటున్నారు.
(చదవండి: ఎవరిని మభ్య పెట్టడానికి దీక్ష?)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top