కేంద్రంలో ఉన్నది ప్రభుత్వమా.. ప్రైవేటు కంపెనీనా?: మంత్రి హరీశ్‌రావు

Harish Rao Slams On Central Government Over Telangana Tribal University - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రైతులు పండించిన ధాన్యం మొత్తం కేంద్రం కొనాల్సిందేనని మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం గిరిజనుల మనోభావాలను దెబ్బతీసిందని మండిపడ్డారు. ఎస్టీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపిందని తెలిపారు. కేంద్రంలో ఉన్నది ప్రభుత్వమా.. ప్రైవేటు కంపెనీనా? అని సూటిగా ప్రశ్నించారు. ఎస్టీ రిజర్వేషన్లు ఎప్పుడిస్తారని ఉత్తమ్ కేంద్రాన్ని ప్రశ్నించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు రాలేదనడం పచ్చి అబద్ధమని అ‍న్నారు. బీజేపీ భారతీయ జూటా పార్టీగా మారిందని మండిపడ్డారు.

తెలంగాణలో 9.08 శాతం తగ్గకుండా గిరిజన రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిందని గుర్తుచేశారు. పార్లమెంట్‌ను కేంద్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందని దుయ్యబట్టారు. గిరిజన రిజర్వేషన్ల పెంపు కోసం సీఎం కేసీఆర్.. ప్రధానమంత్రి నరేంద్రమోదీని కూడా కలిశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ లేఖలకు కేంద్రం నుంచి సమాధానం కూడా వచ్చిందని వెల్లడించారు. బీజేపీ వాట్సప్‌లోనే కాదు.. పార్లమెంట్‌లో కూడా పచ్చి అబద్ధాలు ఆడుతుందని మండిపడ్డారు.

బీజేపీ గిరిజనుల గొంతు కోస్తుందని, బీజేపీ చేతగానితనానికి ఇది నిదర్శనమని ఆగ్రహం వ్యక్తంచేశారు. సభకు తప్పుడు సమాచారం ఇచ్చిన కేంద్ర మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్‌ చేశారు. రేపు(బుధవారం) పార్లమెంట్‌లో ప్రివిలేజ్ మోషన్ ఇస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కార్యక్రమాలు చేపడుతామని అన్నారు. గిరిజన రిజర్వేషన్ల బిల్లు ఆమోదించేదాక ప్రతీ గిరిజన తాండాలో నిరసనలు కొనసాగుతాయని తెలిపారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top