టీవీకే విజయ్‌ను ఉద్దేశిస్తూ.. తమిళనాడు గవర్నర్‌ అధికారిక ప్రకటన | Governor Tells Vijay, Majority Not Yet Established | Sakshi
Sakshi News home page

టీవీకే విజయ్‌ను ఉద్దేశిస్తూ.. తమిళనాడు గవర్నర్‌ అధికారిక ప్రకటన

May 7 2026 3:16 PM | Updated on May 7 2026 3:43 PM

Governor Tells Vijay, Majority Not Yet Established

సాక్షి,చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ మరింతగా పెరిగింది. తాజాగా గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ చెన్నైలో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు సి. జోసెఫ్ విజయ్‌ను కలిశారు. ఈ సమావేశం అనంతరం గవర్నర్ కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ప్రకటనలో ‘ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ మద్దతు ఇంకా లభించలేదు. అసెంబ్లీలో స్పష్టమైన మెజారిటీ నిరూపించకపోతే ప్రభుత్వం ఏర్పాటు ఆహ్వానం ఇవ్వలేం’ అని పేర్కొంది. దీంతో టీవీకే ప్రభుత్వం ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతోంది.

234 సభ్యుల అసెంబ్లీలో టీవీకే 108 స్థానాలు గెలుచుకుంది. విజయ్ రెండు నియోజకవర్గాల్లో గెలవడంతో ఒక సీటు వదులుకోవాలి. దీంతో పార్టీ బలం 107కి తగ్గుతుంది. కాంగ్రెస్ 5 ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించడంతో సంఖ్య 112కి చేరింది. కానీ మెజారిటీకి కావలసిన 118కి ఇంకా తక్కువ. 

ఇక ఇతర పార్టీల వైఖరి కీలకంగా మారింది. సీపీఐ,సీపీఎం, వీసీకే మద్దతు ఇవ్వాలని ఆలోచిస్తున్నాయి. డీఎంకే అధినేత స్టాలిన్ విజయ్‌కు మద్దతు ఇచ్చే అంశాన్ని వామపక్షాలకే వదిలేశారు. అయితే ఏఐఏడీఎంకే మాత్రం టీవీకేకు మద్దతు ఇవ్వబోమని స్పష్టంగా తెలిపింది.

టీవీకే మద్దతుదారులు లోక్‌భవన్ వద్ద నిరసనలు చేపట్టారు. గవర్నర్ ఆలస్యం పై పలువురు ప్రముఖులు విమర్శలు చేశారు. టీవీకే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తోంది. మొత్తం మీద, టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయినప్పటికీ, మెజారిటీకి కావలసిన సంఖ్య ఇంకా తక్కువ. గవర్నర్ ఆహ్వానం ఇవ్వడానికి ముందు స్పష్టమైన మెజారిటీ నిరూపణ కోరుతున్నారు. చిన్న పార్టీల నిర్ణయం, కాంగ్రెస్ మద్దతు, డీఎంకే తాత్కాలిక వెనుకడుగు వంటి అంశాలు తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠను మరింతగా పెంచుతున్నాయి.

 

 

Advertisement
 
Advertisement
Advertisement