బీజేపీకి గుడ్‌బై.. ఏ పార్టీలోకి వెళ్లను.. ‘ఏక్‌ నిరంజన్‌’: మాజీ సీఎం

Goa Polls: After Quitting BJP Ex CM Laxmikant Parsekar Clarifies On Contesting - Sakshi

పణజి: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో మాండ్రెమ్‌ స్థానం నుంచి ఒంటరిగా బరిలో దిగనున్నట్టు ఇటీవల బీజేపీకి గుడ్‌బై చెప్పిన గోవా మాజీ సీఎం లక్ష్మీకాంత్‌ పర్సేకర్‌ ప్రకటించారు. శనివారమే పార్టీకి రాజీనామా లేఖను పంపానని, అన్ని పదవులను వదిలేశానని చెప్పారు. రాజీనామాకు ముందు వరకు ఆయన బీజేపీ మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. తాను రాజీనామా చేశాక చాలా పార్టీలు సంప్రదింపులు జరిపాయని, తాను ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.

త్వరలోనే నామినేషన్‌ దాఖలు చేస్తానన్నారు. మాండ్రెమ్‌ టికెట్‌ను తనకు కాకుండా సిట్టింగ్‌ ఎమ్మెల్యే దయానంద్‌ సోప్టేకు పార్టీ ఇవ్వడంతో పర్సేకర్‌ తీవ్ర నిరాశ చెందారు. 2002 నుంచి 2017 వరకు మాండ్రెమ్‌ ఎమ్మెల్యేగా పర్సేకర్‌ గెలుపొందుతూ వచ్చారు. 2017 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన సోప్టే.. పర్సేకర్‌ను ఓడించారు. తర్వాత 2019లో బీజేపీలో చేరారు. పర్సేకర్‌ 2014 నుంచి 2017 వరకు గోవా సీఎంగా పని చేశారు. అప్పటి గోవా సీఎం మనోహర్‌ పరీకర్‌ కేంద్ర రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో పర్సేకర్‌ను సీఎంగా పార్టీ ఎన్నుకుంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top