ప్రధాన పార్టీలకు..వలసల దెబ్బ

Goa Assembly elections 2022: Immigration blow to major parties - Sakshi

ఎన్నికల వేళ పెరిగిపోతున్న ఫిరాయింపుల పర్వం

అన్ని పార్టీల్లోనూ నేతల పక్క చూపులు 

ఎవరెటు వెళుతున్నారో తెలియని గందరగోళంలో పార్టీలు

బీజేపీకి క్రిస్టియన్‌ ఎమ్మెల్యేల గుడ్‌బై

కుదేలైన కాంగ్రెస్‌

17 నుంచి 2కు పడిపోయిన ఎమ్మెల్యేల సంఖ్య

గోవా రూటే సెపరేటు.. ఆ రాష్ట్రంలో ఫిరాయింపులు సర్వసాధారణం. అతి చిన్న రాష్ట్రమైన గోవాలో పార్టీ కంటే నాయకులే అత్యంత శక్తిమంతులు. పార్టీ  ఫిరాయింపులతో ప్రభుత్వాలు కూలదోయగలరు,  వాటితోనే ప్రభుత్వాలను నిలబెట్టగలరు. ఇప్పుడు కూడా ఆయారామ్, గయారామ్‌ సంస్కృతి పెరిగి గందరగోళానికి దారితీస్తోంది.  

అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ గోవాలో పార్టీ ఫిరాయింపులు అధికమయ్యాయి. ఏ నాయకుడు ఎప్పుడు ఎటు దూకుతారో  తెలియక అన్ని పార్టీలు గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఇన్నాళ్లూ బీజేపీ, కాంగ్రెస్‌ హవా కొనసాగిన గోవాలో ఇప్పుడు తృణమూల్‌ కాంగ్రెస్‌ కూడా ఎంట్రీ ఇవ్వడంతో నాలుగు స్తంభాలాట (ఆమ్‌ ఆద్మీ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లోనే ఇక్కడ బరిలోకి దిగింది) నెలకొంది. దీంతో నాయకుల పక్క చూపులు ఎక్కువయ్యాయి.

తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎక్కువగా ఆపరేషన్‌ ఆకర్‌‡్ష నిర్వహిస్తోంది. ఆ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ బృందం రాష్ట్రంలోని 40 నియోజకవర్గాల్లో అత్యంత ప్రభావం చూపించే నాయకులపై వల విసురుతోంది. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న తృణమూల్‌ పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడానికి సై అంటోంది. కాంగ్రెస్‌ మాజీ ముఖ్యమంత్రి, ఈశాన్య రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి అయిన లూయీజిన్హో ఫలేయిరో 2021 సెప్టెంబర్‌లో తృణమూల్‌లో చేరడంతో ఈ ఫిరాయింపుల పర్వం మొదలైంది. వెంటనే ఆయన్ను రాజ్యసభకు పంపిన మమతా బెనర్జీ ఎవరొచ్చినా తగిన గౌరవం ఇస్తామని సంకేతాలు పంపారు.

గోవా మరో మాజీ సీఎం, ఎన్సీపీ ఎమ్మెల్యే చర్చిల్‌ అలెమావో కూడా పార్టీని వీడి టీఎంసీలో చేరారు. వీరిద్దరి రాకతో కేథలిక్కుల్లో తృణమూల్‌కు పట్టు లభించినట్టయింది. గత ఎన్నికల్లో 17 మంది ఎమ్మెల్యేలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌లో ప్రస్తుతం ఇద్దరే మిగిలి ఉండడం పార్టీ దుస్థితిని చాటిచెబుతోంది. 2017లో ప్రభుత్వ ఏర్పాటు సమయంలో ఇద్దరు ఎమ్మెల్యేలు, 2019లో ఏకంగా 10 మంది కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. తర్వాత గత ఏడాది మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను వీడారు. అధికార బీజేపీలో సొంత పార్టీ మంత్రులే అవినీతి ఆరోపణలు చేయడంతో ఆ పార్టీని వీడేవారి సంఖ్య పెరుగుతోంది.   

బీజేపీకి క్రిస్టియన్లు దూరమవుతున్నారా?  
గోవాలో బీజేపీ క్రిస్టియన్‌ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు. కలంగుటే ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి మైఖేల్‌ లోబో బీజేపీకి రాజీనామా చేయడం రాజకీయంగా సంచలనం సృష్టించింది. ఆయన కాంగ్రెస్‌లో చేరిపోయారు. గోవాలో మెజార్టీ జనాభా హిందువులైనప్పటికీ 2011 లెక్కల ప్రకారం 25% క్రిస్టియన్లు ఉన్నారు. మనోహర్‌ పారిక్కర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రిస్టియన్లను ఆకర్షించే కార్యక్రమాలు నిర్వహించారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 13 స్థానాలను గెలిస్తే వారిలో ఏడుగురు ఎమ్మెల్యేలు క్రిస్టియన్లు కావడం విశేషం.

గత నెలలో కార్టోలిమ్‌ ఎమ్మెల్యే అలీనా సల్దాన్హా బీజేపీకి రాజీనామా చేసి ఆప్‌లో చేరారు. మరో క్రిస్టియన్‌ ఎమ్మెల్యే వాస్కో నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కార్లోస్‌ అల్మీదా కాంగ్రెస్‌లో చేరారు. ఇక వెలిమ్‌ ఎమ్మెల్యే, మంత్రి ఫిలిప్‌ నెరి, రోడ్రిగెజ్‌ ఎమ్మెల్యే బాబాసన్‌ త్వరలోనే బీజేపీని వీడతారని ప్రచారం జరుగుతోంది. ఇక మంత్రి మైఖేల్‌ లోబో తన భార్య దలిలాకి కూడా టికెట్‌ ఆశించారు. అది వచ్చే అవకాశం లేకపోవడంతో పార్టీని వీడారన్న ఊహాగానాలు ఉన్నాయి.

ఉత్తర గోవాకి చెందిన లోబోకు  5–6 నియోజకవర్గాల్లో మంచి పట్టు ఉంది. క్రిస్టియన్‌ జనాభా అధికంగా ఉన్న ఈ నియోజకవర్గాల్లో బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తే ఓడిపోతామన్న భయంతోనే వీరంతా రాజీనామాకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. మదర్‌ థెరిసా నెలకొల్పిన మిషనరీస్‌ ఆప్‌ చారిటీకి విదేశీ విరాళాల సేకరణకు లైసెన్స్‌ పునురుద్ధరించకపోవడం.. ఆపై విమర్శలు రావడంతో 15 రోజుల తర్వాత కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఓకే చెప్పడం తెలిసిందే. ఈ పరిణామాలు క్రిస్టియన్లలో బీజేపీపై ఆగ్రహం తెప్పించి ఉంటాయని ఈ నాయకులు భయపడుతున్నారు.  

అంతా గందరగోళం
ఎమ్మెల్యేలు, నేతలు పార్టీలు మారుతుండటంతో ఎవరెక్కడ ఉన్నారోననే తీవ్రమైన గందరగోళం నెలకొంది. దీంతో ఓటర్లు ఎవరివైపు ఉంటారో చెప్పడం తలపండిన రాజకీయ విశ్లేషకులకు కూడా సాధ్యం కావడం లేదు. ‘‘బీజేపీ తీవ్ర అధికార వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. కానీ టీఎంసీ ఎన్నికల బరిలోకి రావడంతో కాంగ్రెస్‌ ఓటు బ్యాంకుకి దెబ్బపడింది. గత ఎన్నికల్లో 6.3 శాతం ఓటు షేర్‌ సాధించిన ఆప్‌ క్రమంగా బలం పుంజుకుంటోంది. ప్రతిపక్షాలన్నీ ఏకమైతేనే అధికార బీజేపీని ఓడించగలరు’’ అని ఎన్నికల విశ్లేషకుడు క్లాఫాటో కౌంటిన్హో అభిప్రాయపడ్డారు.     
– నేషనల్‌ డెస్క్, సాక్షి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top