ఇండియా కాదు భారత్, దేశం పేరు మార్చే దిశగా కేంద్రం | Sakshi
Sakshi News home page

ఇండియా కాదు భారత్, దేశం పేరు మార్చే దిశగా కేంద్రం

Published Tue, Sep 5 2023 1:13 PM

G20 Dinner Invite Sparks Big Buzz Over President Of Bharat  - Sakshi

సాక్షి, ఢిల్లీ:  కేంద్రంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలబెట్టిన జీ20 సదస్సు ఊహించని పరిణామానికి దారి తీసింది. రాష్ట్రపతి భవన్‌ నుంచి వెలువడ్డ G20 డిన్నర్‌ ఆహ్వాన పత్రికతో సంచలన విషయం తెరమీదికి వచ్చింది. ఆహ్వాన పత్రికలో ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా బదులు.. ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌ అని ముద్రించింది రాష్ట్రపతి భవన్‌. దీంతో దేశం పేరును ఆంగ్లంలో ఇండియా నుంచి భారత్‌కు మార్చే ప్రయత్నాల్లో కేంద్రం ఉందనే చర్చ ఊపందుకుంది.

జీ20 సదస్సులో భాగంగా.. సెప్టెంబర్‌ 9వ తేదీన వివిధ దేశాల అధినేతలకు, ప్రతినిధులకు విందు ఏర్పాటు చేయనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.  ఇందుకోసం విదేశీ అధినేతలకు ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌ పేరుతోనే ఆహ్వానాలు పంపింది రాష్ట్రపతి . ఇదే ఇప్పుడు రాజకీయ అభ్యంతరాలకు దారి తీసింది. రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇండియా.. రిపబ్లిక్‌ ఆఫ్‌ భారత్‌గా మారబోతోందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అంతేకాదు.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లోనే తీర్మానం ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సంకేతాలిస్తూ ఓ ట్వీట్‌ కూడా చేశారు. రిపబ్లిక్ అఫ్ భారత్.. మన నాగరికత అమృత్ కాల్ వైపు ముందుకు సాగుతున్నందుకు సంతోషంగా ఉందంటూ ట్వీట్‌లో పేర్కొన్నారాయన.

ఇంకోవైపు కాంగ్రెస్‌ ఈ పరిణామంపై మండిపడుతోంది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 1లో పేర్కొన్న యూనియన్‌ స్టేట్స్‌పై ముమ్మాటికీ దాడేనని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ ట్వీట్‌ చేశారు.  చరిత్రను వక్రీకరిస్తూ.. దేశాన్ని విభజిస్తూ.. మోదీ ముందుకు సాగుతున్నారంటూ మండిపడ్డారు. దీనికి బీజేపీ కౌంటర్‌ ఇచ్చింది.  

‘‘దేశ గౌరవానికి, గర్వానికి సంబంధించిన ప్రతి విషయంపై కాంగ్రెస్‌కు ఎందుకు అంత అభ్యంతరం? వ్యక్తం చేస్తోంది. భారత్ జోడో పేరుతో రాజకీయ యాత్రలు చేసిన వాళ్లు.. భారత్ మాతా కీ జై అనే ప్రకటనను ఎందుకు ద్వేషిస్తున్నారు. కాంగ్రెస్‌కు దేశంపైనా, దేశ రాజ్యాంగంపైనా, రాజ్యాంగ సంస్థలపైనా గౌరవం లేదని మరోసారి స్పష్టం చేశారు. కాంగ్రెస్ దేశ వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక ఉద్దేశాల గురించి దేశం మొత్తానికి బాగా తెలుసు అని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్‌ చేశారు.

కొత్త భవనంలోనేనా?
ఆంగ్లంలో ఇండియా(India)గా ఉచ్చరించే పేరును.. భారత్‌(Bharat)గా మారుస్తూ తీర్మానం ప్రవేశపెట్టేందుకు.. 18 నుంచి 22వ తేదీలో జరగబోయే పార్లమెంట్‌ సమావేశాలను కేంద్రం వేదికగా చేసుకుంటుందా? అనే దానిపై ఒక స్పష్టత మాత్రం రావాలి. తొలి రెండు రోజులు పాత పార్లమెంట్‌ భవనంలో.. తర్వాతి మూడు రోజులు కొత్త పార్లమెంట్‌ భవనంలో సమావేశాలు జరుగుతాయి. కొత్త పార్లమెంట్‌ భవనంలోనే.. పేరుపై తీర్మానంతో పాటు జమిలి ఎన్నికలు, బ్రిటిష్‌కాలం నాటి ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్‌ యాక్ట్‌ స్థానంలో తీసుకురాబోయే కొత్త చట్టాలను చర్చించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

దేశం పేరును ఇండియా అని కాకుండా భారత్ అని పిలవాలని ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుడు మోహన్ భగవత్ రెండ్రోజుల క్రితం పిలుపునిచ్చారు. ఆ తర్వాత రాష్ట్రపతికి పంపిన ఆహ్వానం వెలుగులోకి వచ్చింది. ప్రతిపక్షాల కూటమి ఇండియా పేరును పెట్టుకున్న తర్వాత దేశం పేరును ఇండియా అని పిలవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అటు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా వర్సెస్ మోదీ లాంటి నినాదాలు చర్చలను తీవ్రతరం చేశాయి. 

ఇదీ చదవండి: ఇండియా కూటమి కోఆర్డినేషన్ కమిటీ తొలి భేటీ ఎప్పుడంటే..?

 
Advertisement
 
Advertisement