ప్రభుత్వ సంస్థలను అమ్మడంతోనే మీకు శక్తి

ప్రధాని మోదీ వ్యాఖ్యలపై పొన్నం ప్రభాకర్
సాక్షి, హైదరాబాద్: 20 ఏళ్లుగా తనను ప్రతిపక్ష పార్టీలు తిట్టే తిట్ల వల్ల న్యూట్రిషన్ జరిగి తనకు శక్తి వస్తోందని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ స్పందించారు. ‘ప్రతిపక్షాల తిట్ల కారణంగా మీకు శక్తి రావడం లేదు. పోర్టులు, ఎయిర్‌పోర్టులతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ, అంబానీలకు అమ్మడం వల్ల వస్తోంది’అని ఆయన వ్యాఖ్యానించారు.
ఆదివారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీలు బలరాంనాయక్, సురేశ్‌షెట్కార్, అంజన్‌కుమార్‌యాదవ్, సిరిసిల్ల రాజయ్యలతో కలిసి ఆయన మాట్లాడారు. పేదలను దోచుకునే వారిని వదిలిపెట్టబోమని మోదీ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దేశంలో మోదీ కన్నా పేదలను దోచుకునే పెద్ద దోపిడీదారుడు ఎవరున్నారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ వెళ్లి ఉండాల్సిందని, సీఎం హోదాలో తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం మోదీతో కొట్లాడాల్సిందని పొన్నం అభిప్రాయపడ్డారు.