Khammam Politics: ‘కారు’ జోరు పెరుగుతుందా?.. ఆ ఇద్దరు కీలక నేతల పరిస్థితేంటి?

Focus On Khammam District Politics - Sakshi

సాక్షి, ఖమ్మం: వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో కారు జోరు పెరుగుతుందా? లేక ముచ్చటగా మూడోసారి కూడా సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతుందా? ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో కీలకంగా మారిన ఆ ఇద్దరు కీలక నేతల పరిస్థితేంటి? క్యాడర్ ఉండి లీడర్లు లేని కాంగ్రెస్ పార్టీ సత్తా చాటగలుగుతుందా? జిల్లాలో బీజేపీ బోణీ కొడుతుందా? కామ్రేడ్లు పూర్తిగా కనుమరుగైనట్లేనా? ఖమ్మం జిల్లా రాజకీయాలపై ఫోకస్..
చదవండి: మల్లారెడ్డా మజాకా.. మాస్‌ డ్యాన్స్‌తో ఇరగదీసిండు

తెలంగాణలోని ఇతర జిల్లాలతో పోల్చితే ఖమ్మం జిల్లా రాజకీయాలు డిఫరెంట్‌గా ఉంటాయి. ఒకప్పుడు ఎరుపు కాంతులతో మెరిసిన కామ్రేడ్లు ఇప్పుడు క్రమంగా కనుమరుగవుతున్నారు. గత రెండు ఎన్నికలు అధికార టీఆర్ఏస్ కు కూడా కలిసిరాలేదు. రాష్ట్రం అంతా గులాబీ గాలి వీచినా ఖమ్మం జిల్లాలో సీన్ రివర్స్ అయింది. అన్ని జిల్లాల్లో ఘోరమైన ఫలితాలు తెచ్చుకున్న కాంగ్రెస్‌ ఖమ్మంలో మాత్రం ఎక్కువ స్థానాలను గెలుచుకుంది. అయితే గెలిచిన ఎమ్మెల్యేలు కారెక్కేయడంతో కార్యకర్తల కష్టానికి విలువ లేకుండా పోయింది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికీ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్యనే ప్రధాన పోటీ కనిపిస్తోంది. బీజేపీ ప్రభావం జిల్లాలో అంతంత మాత్రంగానే ఉంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు ఎవరైనా బీజేపీలో చేరితే తప్ప కాషాయ పార్టీ జిల్లాలో సత్తా చాటే పరిస్థితులు కనిపించడంలేదు.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక జరిగిన రెండు ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి టీఆర్ఎస్ ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించగలిగింది. 2014లో కొత్తగూడెం నుంచి జలగం వెంకట్రావు గెలుపొందగా.. 2018లో ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్ కుమార్ గెలిచారు. గత ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు, జలగం వెంకట్రావు ఓటమి పాలవడంతో పువ్వాడ అజయ్ కుమార్‌ను మంత్రి పదవి వరించింది. అజయ్ కుమార్ పై పోటి చేసి ఓడిన నామా నాగేశ్వరరావు గులాబీ గూటికి చేరి ఖమ్మం ఎంపీ టికెట్ తెచ్చుకుని కాంగ్రెస్ అభ్యర్థి రేణకా చౌదరిపై గెలుపోందారు.

ఎంపీ టికెట్ ఆశించి నిరాశకు గురైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి అప్పటి నుంచి పార్టీ విషయంలో అసంతృప్తిగా ఉంటున్నారు. పొంగులేటితో పాటు తుమ్మల నాగేశ్వరరావు సైతం కారులో ఇబ్బందికరమైన ప్రయాణం కొనసాగిస్తున్నారు. కొంతకాలంగా ఇద్దరు నేతలు పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది. కేటీఆర్ సైతం తుమ్మల, పొంగులేటిని పార్టీ నుంచి వెళ్లనీయకుండా బుజ్జగించే ప్రయత్నాలు చేయడంతో వారు తాత్కాలికంగా పార్టీ మార్పునకు బ్రేక్ వేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇటీవలి జరిగిన సాయి గణేష్‌ ఆత్మహత్య వ్యవహారంతో పాటు వనమా రాఘవ ఎపిసోడ్ అధికార పార్టీని డ్యామేజ్ చేసింది. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో.. వనమా రాఘవ కీలక నిందితుడు కావడంతో ఆయన తండ్రి వనమా వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్ జిల్లాలో పెద్ద ఎత్తున వినిపించింది. ఇది స్థానికంగా అధికార పార్టీకి మైనస్ కావడమే కాకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తంగా ఎఫెక్ట్‌ పడే పరిస్థితిని తీసుకువచ్చింది. ఖమ్మం టౌన్‌లో జరిగిన బీజేపీ కార్యకర్త సాయి గణేష్‌ సూసైడ్ ఘటన  మంత్రి అజయ్ కుమార్‌ను చిక్కుల్లో పడే విధంగా చేసింది. తన చావుకు కారణం మంత్రి అజయ్ కుమార్ అని గణేష్ మరణ వాంగ్మూలం ఇవ్వడంతో మంత్రిని బర్తరఫ్ చేయాలనే డిమాండ్‌తో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశాయి. ఈ రెండు ఘటనలు అధికార టీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టాయనే చెప్పాలి..

ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ పరిస్థితి విచిత్రంగానే ఉందని చెప్పాలి. అన్ని నియోజకవర్గాల్లోనూ క్యాడర్ ఉన్నా లీడర్లు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. మధిర నుంచి భట్టి విక్రమార్క, భద్రాచలం నుంచి పోదెం వీరయ్య మినహా చెప్పుకోదగ్గ నేతలు ఎవరు లేరనే చెప్పాలి. ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి మాజీ ఎంపీ రేణుక చౌదరి ఉన్నా.. ఆమె వచ్చే ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ సీటుకు పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనిలో భాగంగానే రేణుకా చౌదరి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. సత్తుపల్లి నుంచి మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, మానవతా రాయ్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. కొత్తగూడెం నుంచి ముగ్గురు నేతలు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక పాలేరు, వైరా, ఇల్లందు, పినపాక, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నియోజకవర్గ ఇంచార్జీలు ఎవరు ఉన్నారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీ పుంజుకోవాలంటే కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి నేతలు చేరితే తప్ప జిల్లాలో కమలదళం ప్రభావం చూపే అవకాశాలు కనిపించడంలేదు. ప్రస్తుతానికి పొంగులేటి సుధాకర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, గల్లా సత్యనారాయణ వంటి నేతలు జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నా.. కాంగ్రెస్, టీఆర్ఎస్‌కు పోటీ ఇచ్చే పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు. టీఆర్ఎస్ నుంచి అసంతృఫ్త నేతలు ఎవరైనా బీజేపీ కండువా కప్పుకుంటే తప్ప జిల్లాలో బీజేపీ బోణీ కోట్టే పరిస్థితులు లేవని చెప్పవచ్చు. ఒకప్పుడు జిల్లాలో మెజారిటీ స్థానాలు గెలుచుకున్న చరిత్ర ఉన్న ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కాలక్రమంలో పూర్తిగా కనుమరుగయ్యే స్థితికి చేరాయి.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యనే పోరు కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్నికలు సమీపించే సమయంలో టిఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరికలు సాగితేనే జిల్లాలో త్రిముఖ పోటీ జరిగే అవకాశం ఉంది. లేకుంటే కాంగ్రెస్, కారు పార్టీల మధ్య ముఖాముఖీ పోటీనే జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top