కశ్మీర్‌లో త్వరలో ఎన్నికలు..?

Elections In Jammu And Kashmir, Sources - Sakshi

కేంద్ర ప్రభుత్వం యోచన

రాజకీయ పార్టీలతో చర్చలకు సిద్ధం  

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌లో త్వరలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం యోచిస్తోంది. ఈ మేరకు రాజకీయ ప్రక్రియను ప్రారంభించడానికి, కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధణకు వివిధ పార్టీలతో చర్చించాలని కేంద్రం భావిస్తున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు ఆదివారం ఎన్డీటీవీతో చెప్పాయి. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. జమ్మూ కశ్మీర్‌కి ప్రత్యేక హోదా పునరుద్ధరించాలన్న డిమాండ్‌తో ఏర్పాటైన 7 పార్టీల గుప్కర్‌ కూటమి (పీఏజీడీ) కేంద్రంతో చర్చలకు అంగీకరించింది. 

మరోవైపు నేషనల్‌ కాన్ఫరెన్స్‌.. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన చర్చలకు మాత్రమే  హాజరవుతామని స్పష్టం చేసింది. 2018 జూన్‌లో మెహబూబా ముఫ్తీకి చెందిన పీడీపీతో బీజేపీ తెగదెంపులు చేసుకున్నాక కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన విధించింది. తర్వాత ఆగస్టు, 2019లో జమ్మూ కశ్మీర్‌ స్వతంత్ర ప్రతిపత్తిని నిర్వీర్యం చేస్తూ... 370 ఆర్టికల్‌ రద్దు చేసింది. వాస్తవానికి 2019 లోక్‌సభ ఎన్నికలతో పాటు కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు జరిపి ఉండవలసింది. భద్రతా కారణాల దృష్ట్యా ఎన్నికల సంఘం ఆ సాహసం చేయలేదు.

రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత  మోదీ ప్రభుత్వం కశ్మీర్‌ స్వయంప్రతిపత్తిని నిర్వీర్యం చేస్తూ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టింది. గత ఏడాది ఆగస్టులో ఏర్పాటైన గుప్కర్‌ కూటమి స్థానిక ఎన్నికల్లో 100కి పైగా స్థానాల్లో విజయం సాధించింది. కానీ, 6 నెలలుగా అంతర్గత విభేదాలతో చురుగ్గా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడం లేదు. ఆ కూటమి చీఫ్‌ ఫరూక్‌ అబ్దుల్లా ఇటీవల పీడీపీ చీఫ్‌తో మంతనాలు జరిపారు. ఆ తర్వాత జుమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించి ఎన్నికలపై కేంద్రంతో చర్చల్లో పాల్గొంటామన్నారు.

అమెరికా ఒత్తిడి పని చేస్తోందా?  
కశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం భావించడం వెనుక అమెరికా ఒత్తిడి ఉందని సమాచారం. కశ్మీర్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించడాన్నే బైడెన్‌ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆ దేశ ఉన్నతాధికారి ఒకరు ఇటీవల వ్యాఖ్యానించడం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top