టీఆర్‌ఎస్‌కు ‘మెజారిటీ’ గుబులు!

Dubbaka Bypolls: TRS Party Skeptical Of A Majority - Sakshi

గెలుపు తథ్యమైనా ఓట్లు తగ్గొచ్చని నేతల అంచనా

2, 3 మండలాల్లో బీజేపీ గట్టిపోటీ ఇచ్చిందని విశ్లేషణ

‘గ్రేటర్‌’ ఎన్నికల్లో కమలం దూకుడుకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయం

డివిజన్లవారీగా పార్టీ పరిస్థితికి అనుగుణంగా ప్రణాళిక  

సాక్షి, హైదరాబాద్‌: దుబ్బాకలో సిట్టింగ్‌ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకుంటామని అధికార టీఆర్‌ఎస్‌ గట్టిగా చెబుతున్నా మెజారిటీ విషయంలో మాత్రం ఆ పార్టీ గుబులు చెందుతోంది. ఎన్నికల ప్రక్రియ మొదట్లో మెజారిటీ పెంచుకోవడంపైనే దృష్టి సారించిన టీఆర్‌ఎస్‌... ఇప్పుడు గెలిస్తే చాలు అన్న స్థాయిలో ఉంది. కనీసం 25 వేల మెజారిటీ వస్తుందని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నా పోలింగ్‌ తరువాత వెలువడుతున్న అంచనాలు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో బీజేపీ ఓటు శాతం గణనీయంగా పెరిగిందన్న అంచనాలను కూడా టీఆర్‌ఎస్‌ విశ్లేషిస్తోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జనవరి మూడో వారంలో జరుగుతాయనే సంకేతాలు రావడం, జీహెచ్‌ఎంసీ ఎన్నికల సన్నాహాలను బీజేపీ ఇప్పటికే ప్రారంభించిన నేపథ్యంలో దుబ్బాక ఫలితం కమలదళానికి ఆయుధంగా మారకూడదనే అభిప్రాయం టీఆర్‌ఎస్‌లో కనిపిస్తోంది.

90 వేల ఓట్లపై ధీమా...
ఈ నెల 3న దుబ్బాక ఉప ఎన్నిక ముగిశాక పోలింగ్‌ సరళితోపాటు తమకు పోలయ్యే ఓట్లపై టీఆర్‌ఎస్‌ అంచనాకు వచ్చినట్లు సమాచారం. 1.64 లక్షల ఓట్లు పోలవగా సుమారు 90 వేల ఓట్లు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సాధిస్తారని పార్టీ నేతలు భావిస్తున్నారు. మిగతా సుమారు 74 వేల ఓట్లలో బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులు సాధించే ఓట్ల సంఖ్యపైనే మెజారిటీ ఆధారపడి ఉంటుందని విశ్లేషిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో బీజేపీ హడావుడి చేసినా దుబ్బాక నియోజకవర్గంలో ఆ పార్టీకి ఓటింగ్‌ అదే స్థాయిలో జరగలేదని క్షేత్రస్థాయిలో పనిచేసిన టీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు. నియోజకవర్గంలోని ఏడు మండలాలకుగాను 2 లేదా 3 మండలాల పరిధిలోనే బీజేపీ కొంతమేర ప్రభావం చూపిందనే ప్రాథమిక అంచనాకు టీఆర్‌ఎస్‌ వచ్చింది.

భారీ మెజారిటీ పరిస్థితి నుంచి...
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో దుబ్బాక నుంచి వరుసగా నాలుగోసారి పోటీ చేసిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి చెరుకు ముత్యంరెడ్డిపై సుమారు 37 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి మద్దుల నాగేశ్వర్‌రెడ్డిపై సోలిపేట రామలింగారెడ్డి 62,500పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2014, 2018లోనూ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎం. రఘునందన్‌రావు మూడో స్థానంలో నిలిచి డిపాజిట్‌ కూడా కోల్పోయారు. అయితే తాజాగా జరిగిన ఉప ఎన్నికలో మాత్రం ఆయన తీవ్ర పోటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌లో క్షేత్రస్థాయి అంతర్గత విభేదాలు, పార్టీ అభ్యర్థి విద్యార్హత, ప్రభుత్వ వ్యతిరేకత, యువతలో అసంతృప్తి వంటి కారణాలతోపాటు బీజేపీ, కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వం దుబ్బాకలోనే మకాం వేయడంతో పోటాపోటీ ప్రచారం జరిగింది. ఈ పరిణామం తమ అనుకూల ఓటింగ్‌కు దారితీసినట్లు బీజేపీ అంచనా వేస్తోంది.

జీహెచ్‌ఎంసీలో పునరావృతం కాకుండా...
రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు కేంద్ర నిధుల విషయంలో దుబ్బాకలో బీజేపీ చేసిన ప్రచారం జీహెచ్‌ఎంసీలో పునరావృతం కాకుండా చూడాలనే అభిప్రాయం టీఆర్‌ఎస్‌లో కనిపిస్తోంది. దుబ్బాకలో బీజేపీకి ఓట్ల శాతం పెరిగితే జీహెచ్‌ఎంసీపై ప్రభావం చూపే అవకాశముందని భావిస్తున్న టీఆర్‌ఎస్‌... వీలైనంత మేర ఆ పార్టీకి అడ్డుకట్ట వేసే వ్యూహాలకు పదును పెడుతోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో బలమైన బీజేపీ నేతలను పార్టీలోకి ఆకర్షించాలనే వ్యూహంలో భాగంగా జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ ఇన్‌చార్జితోపాటు పలువురు డివిజన్‌ స్థాయి నేతలు గులాబీ గూటికి చేరుకున్నారు. మరోవైపు జీహెచ్‌ఎంసీలో డివిజన్లవారీగా ఇప్పటికే పార్టీ బలం అంచనాకు వచ్చిన టీఆర్‌ఎస్‌... విపక్ష పార్టీల పరిస్థితిని కూడా అంచనా వేసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడక ముందే నగర శివార్లలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలనే యోచనలో పార్టీ అధినేత కేసీఆర్‌ ఉన్నట్లు సమాచారం.

మాకు ప్రజల మద్దతు పెరుగుతోంది: కె. లక్ష్మణ్‌  
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణకు నిధుల కేటాయింపు విషయంలో భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధిని ఎవరూ శంకించాల్సిన అవసరం లేదని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ స్పష్టం చేశారు. వరద బాధితులను ఆదుకునేం దుకు తెలంగాణకు కేంద్రం నిధులు కేటాయిం చిందని ఆయన తెలిపారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా బీజేపీకి ప్రజల్లో మద్దతు పెరుగుతున్న కారణంగా, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకు నేందుకే మంత్రి కేటీఆర్‌ తమపై ఎదురుదాడి చేస్తున్నారని లక్ష్మణ్‌ మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో టీఆర్‌ఎస్‌ ప్రజలను తప్పు దోవ పట్టిస్తోందని, త్వరలో హైదరాబాద్‌లో ‘బడుగుల సభ’ ఏర్పాటు చేసి టీఆర్‌ఎస్‌– ఎంఐఎం నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తామని హెచ్చరించారు. వరద సాయం పేరుతో ప్రభుత్వ ధనాన్ని టీఆర్‌ఎస్‌ తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటోందని లక్ష్మణ్‌ దుయ్యబట్టారు. కేంద్ర నిధులపై చర్చకు సిద్ధం: హైదరాబాద్‌ అభివృద్ధికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనేక నిధులు కేటాయించిందని లక్ష్మణ్‌ తెలిపారు. కేంద్రం కేటాయించిన నిధులపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని కేటీఆర్‌కు సవాల్‌ విసిరారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top