
రెడ్డిపల్లిలో మాట్లాడుతున్న బీజేపీ జాతీయ నాయకురాలు డీకే అరుణ
సాక్షి, చేగుంట(తూప్రాన్): రాష్ట్రంలోని అభివృద్ధి పథకాలన్నిటికీ కేంద్రం నిధులే ఖర్చు చేస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో డీకే అరుణ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం నిర్వహించగా బోనాల ఊరేగింపుతో మహిళలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ గ్రామాల్లోని స్వచ్ఛభారత్, ఉపాధిహామీ పనులు, సీసీ రోడ్లు, వైకుంఠధామాలు, రైతు వేదికలు, పింఛన్లు, బియ్యం అన్ని పథకాలకు కేంద్రం నిధులనే వాడుకొని తామే చేసామని టీఆర్‌ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను 3లక్షల కోట్ల అప్పులతో కేసీఆర్ ప్రభుత్వం అప్పుల తెలంగాణగా మార్చారని ఆరోపించారు. డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, యవకులకు నిరుద్యోగ భృతి, దళితుల మూడెకరాల భూమి వంటి హామీలను మరిచిపోయారన్నారు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలే అభివృద్ధి చెంది మిగితా నియోజకవర్గాలు ఎందుకు అభివృద్ధి చెందడం లేదో ప్రభుత్వం ప్రజలకు సమాధానం తెలపాలన్నారు.
రైతుబంధు పెద్ద దోపిడీ పథకమని ఎక్కువ వ్యవసాయ భూమలు ఉన్న రైతులకు లక్షల రూపాయలు, సామాన్య రైతులకు వేల రూపాయలను ఇస్తూ పేద రైతులను మోసం చేస్తున్నారని తెలిపారు. కరోనా కష్టాలతో ఉన్న రాష్ట్ర ప్రజలకు ఎల్‌ఆర్‌ఎస్‌తో వేలాది రూపాయలు గ్రామ పంచాయతీలకు చెల్లించే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. రాష్ట్రంలో మార్పు కోసం దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్‌రావును గెలిపించాలని డీకే అరుణ ప్రజలనుకోరారు. భారత్‌ను భయపెట్టాలనే దేశాలు ప్రధాని నరేంద్రమోదీ అంటే భయపడుతున్నాయి. రామజన్మ భూమి మొదలుకొని దేశంలోని చాలా సమస్యలకు ప్రధాని పరిష్కారం చూపుతున్నారని తెలిపారు. ప్రపంచంలోని అన్ని దేశాలు ప్రధాని మోదీ నాయకత్వాన్ని మెచ్చుకుంటున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్, సిద్దిపేట పార్టీ జిల్లా అధక్షులు గడ్డం శ్రీనివాస్, శ్రీకాంత్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు ఉమాదేవి, మాజీ ఎమ్మెల్యేలు శశిధర్‌రెడ్డి, ఎన్‌ఎం శ్రీనివాస్‌రెడ్డి జిల్లా నాయకులు గోవింద్, మండలశాఖ అధ్యక్షులు భూపాల్, ఉపాధ్యక్షులు ఎంర్ రమేశ్, మాజీ సర్పంచులు బాల్‌చందర్, రాజగోపాల్, మాజీ ఎంపీపీ పాండుతో పాటు పలు గ్రామాల బీజేపీ నాయకులు పాల్గొన్నారు.