Divya Spandana: ఎక్కడికీ పారిపోలేదు.. రాజీనామా చేశా

Divya Spandana: I Did Not Run Away, I Resigned For Personal Reasons - Sakshi

మాజీ ఎంపీ, నటి దివ్య స్పందన

డీకే బ్యాచ్‌ ట్రోల్‌ చేస్తున్నారని ఆరోపణ

పార్టీని మోసం చేయలేదని వివరణ

బెంగళూరు: తాను ఎక్కడికి పారిపోలేదని, వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేశానని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మాజీ అధ్యక్షురాలు, నటి దివ్య స్పందన(రమ్య) తెలిపారు. కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేయమని కాంగ్రెస్ తన కార్యకర్తలను ఆయన ఆదేశించారని ట్విటర్‌లో పేర్కొన్నారు. 

మోసం చేయలేదు
‘నేను బయటికి వచ్చాక నా విశ్వసనీయతను దెబ్బతీసేందుకు, ప్రత్యేకించి కన్నడ వార్తా ఛానళ్లలో ‘ఆమె కాంగ్రెస్‌ పార్టీని ఎనిమిది కోట్లకు మోసం చేసి పారిపోయింది’ అనే కథనాన్ని నాటారు. నేను పారిపోలేదు. నా వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేశాను. నేను కచ్చితంగా కాంగ్రెస్‌ పార్టీని ఎనిమిది కోట్లకు మోసం చేయలేదు. నిశ్శబ్దంగా ఉండటమే నా తప్పయింద’ని దివ్య స్పందన ట్వీట్‌ చేశారు. 

అసలేంటి వివాదం?
పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌పై డీకే శివకుమార్‌ చేసిన ప్రకటనతో వివాదం మొదలైంది. పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో బహిరంగ వేదికలపై తనను ప్రశ్నించకుండా రక్షణ కోరుతూ ఉన్నత విద్యాశాఖ మంత్రి సీఎన్ అశ్వత్‌నారాయణన్‌.. కాంగ్రెస్ నాయకుడు ఎంబీ పాటిల్‌ను కలిశారని శివకుమార్‌ వెల్లడించారు. దీనిపై రమ్య స్పందిస్తూ.. పార్టీలకు అతీతంగా నాయకులు కలుసుకోవడం తప్పేంటని ప్రశ్నించారు. నిబద్దత కలిగిన కాంగ్రెస్‌వాది అయిన ఎంబీ పాటిల్‌ గురించి శివకుమార్‌ చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగించాయని ట్వీట్‌ చేశారు. 

ఇన్నాళ్లు ఏమైపోయారు?
ఈ నేపథ్యంలో ట్విటర్‌ వేదికగా శివకుమార్‌ మద్దతుదారులు రమ్యను ట్రోల్‌ చేయడం మొదలు పెట్టారు. ఇన్నాళ్లు ఏమైపోయారని, ఇప్పుడే మేల్కొన్నారా అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. శివకుమార్ ఆదేశాలకు అనుగుణంగానే ఇదంతా జరుగుతోందని రమ్య ఆరోపించారు. ఈ వ్యవహారంపై స్పందించాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కోరారు. 

ముందే రాజీనామా నిర్ణయం
నటి రమ్య  2012లో యూత్ కాంగ్రెస్ ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2013లో ఆమె మాండ్య లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికల్లో గెలిచారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ వేవ్‌లో ఆమె ఓడిపోయారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షురాలిగా పనిచేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి తర్వాత ఆ పదవికి రాజీనామా చేశారు. అయితే ఎన్నికల ఫలితాలు రావడానికి ముందే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు రమ్య వెల్లడించారు. ఇటీవల తరచుగా సోషల్ మీడియాలో కనిపిస్తున్నప్పటికీ.. రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. (చదవండి: మత మార్పిడుల నియంత్రణకు ఆర్డినెన్స్‌)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top