సీఎం కొడుకు నుంచి ప్రాణహాని.. నన్ను చంపేందుకు సుపారీ ఇచ్చారు.. సంజయ్‌ రౌత్‌ సంచలన ఆరోపణలు

Devendra Fadnavis 'Sympathy Jab After Sanjay Raut Claims Threat To Life - Sakshi

ముంబై : ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిండే కుమారుడు, ఎంపీ శ్రీకాంత్‌ శిండే నుంచి తనకు ప్రాణానికి హాని ఉందని రాజ్యసభ ఎంపీ సంజయ్‌రౌత్‌ ముంబై పోలీసులకు లేఖ రాశారు. తనను చంపమని థానేకు చెందిన నేరస్తుడు రాజా ఠాకూర్‌కు శ్రీకాంత్‌ శిండే సుపారీ ఇచ్చారని లేఖలో పేర్కొన్నారు. అందుకు సంబంధించిన పూర్తి సమాచారం తన దగ్గర ఉందని, బాధ్యతాయుతమైన పౌరునిగా పోలీసులకు తెలియజేస్తున్నానన్నారు.

లేఖను ముంబై పోలీస్‌ కమిషనర్‌తోపాటు హోంశాఖ మంత్రిగా ఉన్న ఉన్న డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు సైతం పంపించారు. దీనిపై మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే స్పందించారు. ఈ ఫిర్యాదుపై తీవ్రంగా స్పందించాల్సి ఉంది. కానీ.. దురదృష్టవశాత్తు ద్రోహుల వర్గం పట్టించుకోవడం లేదన్నారు. ముంబైలోని మాహింలో ఒక ఎమ్మెల్యే ఫైరింగ్‌ చేసినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదన్నారు. 

కాగా సంజయ్‌ రౌత్‌ పోలీసులకు రాసిన లేఖపై డిప్యూడీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ తీవ్రంగా స్పందించారు. కేవలం పబ్లిసిటీ కోసమే ఆరోపణలు చేశారని సంజయ్‌ రౌత్‌పై విరుచుకుపడ్డారు. ‘ఇలాంటి ఆరోపణలు చేసి సంచలనం సృష్టిస్తున్నారు. దాని వల్ల తనకు కొంత సానుభూతి వస్తుందని అనుకోవచ్చు. కానీ బూటకపు ఆరోపణలు చేసి సానుభూతి పొందొద్దు.’ అని అన్నారు.

అంతేగాక రౌత్‌కు అదనపు రక్షణ కల్పించడంపై ఫడ్నవీస్ మాట్లాడుతూ, ‘సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. కొంతమంది నాయకులకు రక్షణ కల్పించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఒక నిర్దిష్ట నాయకుడికి రక్షణ కల్పించాలా లేదా పెంచాలా వద్దా అని కమిటీ నిర్ణయిస్తుంది. ఈ కమిటీ అధిపతి అయిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలాగే ప్యానెల్ రౌత్‌ లేఖను పరిగణలోకి తీసుకుంటుంది’ అని వ్యాఖ్యానించారు.

మరోవైపు  రౌత్‌ ఆరోపణలపై  ఏక్‌నాథ్‌ శిండే వర్గం ‌ఎమ్మెల్యే సంజయ్‌ శిర్సాట్‌ మాట్లాడుతూ.. అవి సానుభూతికోసం ఠాక్రే సేన వేస్తున్న చిల్లర వేషాలని అన్నారు. ఒకవేళ బెదిరింపుపై ఏమాత్రం నిజమున్న సమగ్ర విచారణ జరిపిస్తామని, కానీ శ్రీకాంత్‌ శిండే అలా చేస్తారని తాను నమ్మనని స్పష్టం చేశారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top