ఆరునూరైనా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి: వైఎస్ షర్మిల

Covid-19 should be included in Aarogyasri: YS Sharmila - Sakshi

డ్వాక్రా సంఘాల రుణాలను, వడ్డీలను ప్రభుత్వం మాఫీ చేయాలి

చికిత్స కోసం యశోదకు.. పబ్లిసిటీ కోసం గాంధీకా?

హైదరాబాద్: వరి, మిర్చి పంటలు కొనుగోలు చేయాలని రైతన్నలు ఆందోళనలు ఓవైపు.. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వేయడం లేదనే మనస్తాపంతో మరోవైపు నిరుద్యోగుల ఆత్మహత్యలు.. ఇంకోవైపు. ఈ కరోనా కష్ట కాలంలో మహిళలు తమ కుటుంబ పోషణ కోసం తమ పేరుమీదున్న ఇళ్లను, బంగారాన్ని, చివరకు, మంగళ సూత్రాన్ని కూడా తాకట్టు పెట్టి.. దీనస్థితిలో కాలం వెళ్ల దీస్తున్నారని వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఇదీ తెలంగాణలోని వాస్తవ పరిస్థితి, కానీ ప్రభుత్వానికి ఇవేమి కనిపించడం లేదన్నారు. 

వైఎస్.షర్మిల ప్రధాన అనుచరురాలు ఇందిరాశోభన్ తో కలిసి తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి డ్వాక్రా సంఘాల మహిళలతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. కోవిడ్ మేనేజ్మెంట్ బాగుందని, టెస్టింగ్ గానీ, వ్యాక్సినేషన్ సిస్టమ్ గానీ, మెడికల్ సర్వీసెస్ అంతా బాగుందని తెలంగాణ చీఫ్ సెక్రటరీ చెప్పడం హాస్యాస్పదమన్నారు. ‘అన్నీ బాగున్నాయని మీకు మీరు సొంత డబ్బా కొట్టుకుంటే సరిపోతుందా’ అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. అసలు ప్రజలు ఎంత కష్టపడుతున్నారో ముందు తెలుసుకోవాలన్నారు. 

అటు.. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతున్న చందంగా.. సీఎం కేసీఆర్ కూడా తాను చేసే పనులు తెలంగాణ ప్రజలెవ్వరూ గమనించడం లేదనుకోవడం పొరబాటన్నారు. చికిత్స కోసం యశోద ఆసుపత్రి వెళ్లిన కేసీఆర్ పబ్లిసిటీ కోసం గాంధీ ఆసుపత్రికి వెళ్లారని ఆమె ఎద్దేవా చేశారు. ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ప్రతి రోజు తాము విన్నవిస్తున్నా.. దున్నపోతు మీద వాన పడ్డ చందంగా దాన్ని ఈ సర్కార్ అసలు పట్టించుకోవడం లేదని వైఎస్ షర్మిల మండిపడ్డారు. తమ ఒత్తిడి తట్టుకోలేక కరోనాను ఆరోగ్యశ్రీలో కాకుండా ఆయుష్మాన్ భారత్‌లో చేర్చి చేతులు దులుపుకున్నారన్నారు. ఆయుష్మాన్ భారత్ వల్ల తెలంగాణలోని 26 లక్షల కుటుంబాలకే లబ్ధి చేకూరుతుందని, అదే ఆరోగ్యశ్రీ వల్ల 80 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతాయన్నారు. 

దయచేసి కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి
కేసీఆర్ దొర, దయచేసి కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కోరుతున్నామన్నారు. ఒకప్పుడు ఆయుష్మాన్ భారత్ ఒట్టి దిక్కుమాలిన పథకం అన్న కేసీఆర్.. ఇప్పుడే అదే స్కీమ్‌లో ఎందుకు అమలు చేస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. అటు.. ఆయుష్మాన్ భారత్‌లో అన్ని వ్యాధులకు 5 లక్షల రూపాయల వరకే పరిమితి ఉందని, అదే ఆరోగ్యశ్రీలో కొన్ని పథకాలకు 13 లక్షల రూపాయల వరకు పరిమితి ఉందని షర్మిల తెలిపారు. కరోనా వైద్యానికి లక్షలకు లక్షలు ఖర్చువుతున్నాయని, ఈ డబ్బునంతా ఎవరు చెల్లిస్తారో కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. కరోనా ఆరోగ్యశ్రీలో చేర్చి పేదలను ఆదుకోవాలని మరోమారు డిమాండ్ చేస్తున్నామన్నారు వైఎస్ షర్మిల. 

ఇక కరోనా సమయంలో చికిత్సల కోసం, కుటుంబ పోషణ కోసం డ్వాక్రా మహిళలు 10 వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారని, ఇది గత ఏడాదితో పోలిస్తే 60 శాతం అధికమని ఆమె చెప్పుకొచ్చారు. ఉపాధి లేక, ఆదాయం రాక, ప్రభుత్వం ఆదుకోక లక్షలాది మహిళలు అప్పుల పాలయ్యారని వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. అటు.. వైఎస్సార్ పాలనలో మాదిరిగా ఇప్పుడున్న కేసీఆర్ పాలనలో విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ లేదని, కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్య అని మాట ఇచ్చి ఆ మాటను సీఎం కేసీఆర్ తప్పడం వల్లే, పిల్లల చదువుల కోసం మహిళలు అప్పులు చేస్తూనే ఉన్నారన్నారు. ఇప్పుడు వైద్యానికి తోడు, బతికేందుకు కూడా అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇదేనా మహిళా సాధికారతా..?
ఆడవాళ్లు అప్పులు చేస్తే గానీ ఇళ్లు గడవలేని పరిస్థితి నేడు తెలంగాణలో ఉందన్నారు. ఇదేనా సంక్షేమం, ఇదేనా మహిళా సాధికారతా.. ముఖ్యమంత్రి ఆలోచన చేయాలన్నారు. మహిళలంటే సీఎం కేసీఆర్ కు ఎప్పుడూ చులకనేనని అందుకే వారికి పదవులు ఇవ్వరన్నారు. ఒకవేళ వాళ్లు తిరగబడితే తెలంగాణ తల్లి సాక్షిగా వారిపై దాడులు చేసి అవమానిస్తారని వాపోయారు. ముఖ్యమంత్రి అసమర్థత వల్ల, చేతగాని తనం వల్ల 10 లక్షలకు పైగా మహిళలు అప్పుల పాలయ్యారని, డ్వాక్రా మహిళా సంఘాల రుణాలన్నింటినీ మాఫీ చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. ‘గత మూడేళ్లుగా మహిళా సంఘాల రుణాల వడ్డీలకు ఎగనామం పెడుతున్నారు. ఆ వడ్డీ భారం కూడా  అక్కచెల్లెమ్మల మీదే పడుతుంది. ఆ వడ్డీ, రుణాలు మాఫీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నా. ఇది కేసీఆర్‌ ప్రభుత్వ కనీస బాధ్యత’ అని అన్నారు.

చదవండి: కరోనా కాలం: మరీ 70 వేల రూపాయలా?!
సాకులతో సరి.. సీరియస్‌నెస్‌ లేదు మరి!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top