పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు సూత్రాలు చెప్పడంతో సామాన్యుడిపై పిడుగు గ్యారెంటీ అనే ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. అందుకు తగ్గట్లే.. మొన్న కమర్షియల్ గ్యాస్.. నిన్న పాలు, కూరగాయలు.. రేట్లు పెరుగుతూ వచ్చాయి. తాజాగా.. ఇంధన ధరలు పెరగడంతో విపక్షాలు మోదీని లక్ష్యంగా చేసుకుని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నాయి.
ఎన్నికలు కావడంతో ప్రధాని మోదీ వసూళ్లు మొదలుపెట్టారంటూ కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది. మోదీని ద్రవ్యోల్బణం మనిషి(Mehngai Man Modi)గా అభివర్ణిస్తూ.. ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నారని మండిపడింది. ఇంధన పొదుపు పేరిట కొత్త డ్రామాలకు తెర తీశారని.. విదేశీ ప్రయాణాలు వద్దంటూనే ఇప్పుడు ఆయనే విదేశాలకు వెళ్లాడని ఆ పార్టీ కార్యదర్శి జైరామ్ రమేశ్ విమర్శలు గుప్పించారు.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ పెరుగుదలను దయనీయమైన పరిస్థితిగా పేర్కొంది. అదే సమయంలో బెంగాల్ బీజేపీ ప్రభుత్వం వ్యాట్ తగ్గిస్తుందా? అని ప్రశ్నించింది. మరోవైపు.. కేంద్రంలోని బీజేపీ సర్కాన్‌ను సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ లక్ష్యంగా చేసుకుని సెటైర్లు వేశారు. పెట్రోల్ రేట్లు పెరగడం.. సైకిల్(సమాజ్‌వాదీ గుర్తు)నే భవిష్యత్తు అంటూ కార్టూన్ షేర్ చేశారు.
దేశవ్యాప్తంగా పెట్రో రేట్లు తప్పవనే ఊహాగానాలు గత కొన్నిరోజులుగా వినిపిస్తున్నాయి. అయితే ఎన్నికలయ్యాక అది ఉండొచ్చని అంతా భావించారు. ఈ మధ్యలో పెంపు వార్తలను కొట్టేసిన కేంద్రం.. సరిపడా నిల్వలు ఉన్నాయని చెబుతూ వస్తోంది. అయితే ఎన్నికలయ్యాక ప్రధాని మోదీ ఇంధన పొదుపు వ్యాఖ్యలు చేయడం.. ఆ వెంటనే కేంద్ర పెట్రోలియం శాఖ సైతం పెంపు తప్పదనే సంకేతాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇవాళ పెట్రోల్, డీజిల్‌పైన రూ.3 చొప్పున పెంపును ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి.


