Komatireddy Raj Gopal Reddy: టీ కాంగ్రెస్‌ లొల్లి.. వీహెచ్‌ హామీతో కోమటిరెడ్డి తగ్గేనా?

Congress Party Senior VH Meet Komatireddy Raj Gopal Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. పార్టీ మారతారనే ప్రచారం టీ కాంగ్రెస్‌లో కలవరం రేపుతోంది. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పార్టీ మార్పుపై త్వరలోనే స్పష్టత ఇస్తానని ఒక ప్రకటన ఇచ్చారు. అయితే ఈ ప్రకటనతో.. రంగంలోకి దిగిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్ శనివారం కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో భేటీ అయ్యారు.  

కాంగ్రెస్‌ పార్టీలో తగిన గౌరవం దక్కడం లేదని,  అవమానం జరిగే చోట ఉండలేనని కోమటిరెడ్డి,  వీహెచ్‌ వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అయితే.. పాత కాంగ్రెస్‌ నేతలంతా బయటకు వెళ్తే పార్టీ దెబ్బ తింటుందని వీహెచ్‌ సర్దిచెప్పే ప్రయత్నం చేసినట్లు సమాచారం. అంతేకాదు.. సోనియా, రాహుల్‌ గాంధీ అపాయింట్‌మెంట్‌ కోరి వాళ్లతో ఈ అంశంపై చర్చిస్తానని వీహెచ్‌ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఈ నెల 22న ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇదిలా ఉంటే.. ఆదివారం ఉదయం 11 గంటలకు జరగబోయే సీనియర్ల భేటీకి రావాలంటూ రాజగోపాల్‌రెడ్డిని వీహెచ్‌ కోరినట్లు సమాచారం. ఈ భేటీలో అసంతృప్త సీనియర్లంతా హాజరై.. కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ ఆహ్వానంపై రాజగోపాల్‌రెడ్డి నుంచి ఎలాంటి స్పందన వచ్చిందనేది తెలియాల్సి ఉంది. 

ఇదిలా ఉంటే.. అసెంబ్లీలో ఈమధ్య జరిగిన ఓ ఘటన ఆయన అసంతృప్తికి కారణమైంది. మంత్రి తలసానితో జరిగిన వ్యక్తిగత వ్యాఖ్యలు.. మాటల యుద్ధానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తనకు అండగా నిలబడలేదని కోమటిరెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. గౌరవం లేని చోట ఉండలేనని, తగిన వేదిక ద్వారా కేసీఆర్‌పై పోరాడుతానని, నమ్మి తన వెంట వచ్చేవాళ్లు రావొచ్చంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top