నిర్మల్‌లో హ్యాండిస్తాడా?

Congress Leaders in Nirmal District Look Sideways - Sakshi

తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి కొన్ని చోట్ల ఇబ్బందికరంగా మారింది. జిల్లాల్లో నాయకులు పక్క చూపులు చూస్తున్నారు. నిర్మల్‌ జిల్లాలో గట్టి నాయకుడు ఒకాయన పక్క పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నాడు. ఈయనకు ఉన్న పలుకుబడి చూసి ఆ పార్టీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. 

రామ రామ
నిర్మల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు  రామారావు పటేల్ ఎంత ప్రయత్నిస్తున్నా జిల్లాలో పార్టీ డెవలప్ కావడం లేదని నిరాశ చెందుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రామారావు పటేల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి.. 36,860 ఓట్లు సాధించి మూడో స్థానానికి పరిమితమయ్యారు. అక్కడ టీఆర్ఎస్ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి రెండో స్థానంలో నిలిచారు. ఇక్కడ కాంగ్రెస్ వెనక్కి వెళ్తుంటే, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు బలపడతున్నాయట. పార్టీ పరిస్థితి ఇలా అయితే తాను ఎమ్మెల్యేగా గెలవడం సాధ్యం కాదని ఆయన నిర్థారించుకున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. 

కమలం ఆకర్ష్ 
ముథోల్ నియోజకవర్గంలో‌ బిజెపి బలంగా ఉందన్న అంచనాలున్నాయి. పార్టీకి హిందూత్వ ఓటు బ్యాంక్ కలిసి వస్తుందన్న విశ్లేషణలున్నాయి. అందుకే రామారావు పటేల్‌ కమలంపై రామారావు కన్నేశారట. ఆరునూరైనా ఈసారి ఎమ్మెల్యే కావాలని భావిస్తున్నారట. అందువల్ల ఎమ్మెల్యే కావాలంటే పార్టీ మారాలని, అదీ కమలం పార్టీలో చేరాలని రామారావు పటేల్ నిర్ణయించుకున్నారని టాక్. బిజెపి  పెద్దలతో  సంప్రదింపులు కూడా పూర్తయ్యాయని చెబుతున్నారు. 

కొత్త ముఖం కావాలి.!
ముథోల్‌లో హిందూ ఓటు  బ్యాంకు ఉన్నప్పటికీ.. బిజెపి అభ్యర్థి రమాదేవి రెండు సార్లు ఓటమి పాలయ్యారు. ఆమెపై ఓటర్లలో ఉన్న వ్యతిరేకతే కారణమని చెబుతున్నారు. ఈ సారి అభ్యర్థి మారితే కమలం పార్టీ గెలుస్తుందని కాషాయపార్టీ సర్వేలో తెలిందట. ఇలాంటి పరిస్థితులలో నియోజకవర్గంలో మంచి పలుకుబడి ఉన్న రామారావు పటేల్ చేరితే పార్టీకి   గెలుపు ఖాయమని కమలం పార్టీ పెద్దలు భావిస్తున్నారట.. అందుకే రామారావు చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వినిపిస్తోంది.

ముందు తమ్ముడు.. తర్వాత.!
ఇప్పటికే రామారావుపటేల్ సోదరుడు మోహన్ రావు పటేల్ బిజెపిలో కొనసాగుతున్నారు. కాగా పార్టీ ‌మార్పుపై రామరావు పటేల్ ఇంతవరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే జిల్లాలో ముఖ్యమైన నేత కావడంతో రామారావు పటేల్‌ పార్టీ మారకుండా హైకమాండ్‌ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమీటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డికి రామరావు పటేల్ అత్యంత సన్నిహితుడు. దాంతో రామరావు పటేల్ పార్టీ మారకుండా   మహేశ్వర రెడ్డి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top