
సాక్షి,న్యూఢిల్లీ: విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు,కాళేశ్వరం స్కాంలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పై ఆరోపణలొచ్చాయి. ఈ కేసుల్లో కేసీఆర్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపుతారనే ఊహాగానాలూ ఊపందుకున్నాయి. అయితే,ఈ ఊహాగానాలకు ఢిల్లీ కేంద్రం సీఎం రేవంత్ తెరదించారు. కేసీఆర్ అరెస్ట్‌పై సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు.
బీసీ రిజర్వేషన్ల బిల్లుల ఆమోదానికి పార్లమెంట్‌లో ఒత్తిడి పెంచాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ నేతల బృందం ఢిల్లీలో పర్యటిస్తోంది. పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ చిట్‌చాట్ నిర్వహించారు.
కేసీఆర్‌ను నేనెందుకు జైల్లో వేస్తా.. ఆయనే స్వీయ నియంత్రణగా జైల్లో ఉన్నట్లు ఫామ్ హౌస్‌లో ఉన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌కు.. చర్లపల్లి జైలుకు తేడా లేదు. ఫామ్ హౌస్‌లో పోలీసుల పర్యవేక్షణ ఉంటది. జైల్లో పోలీసుల పహారా ఉంటుంది. అప్పుడప్పుడు జైలుకు విజిటర్స్ వస్తుంటారు.. అలాగే ఫామ్ హౌస్‌కి విజిటర్స్ వెళ్లి వస్తున్నారు. కేసీఆర్‌ను ఓడించడమే పెద్ద శిక్ష. నేనెందుకు విద్వేష రాజకీయాలు చేస్తా.
మేం దుప్పటి కప్పుకొని పడుకున్నా తెలంగాణ ప్రజలు రెండోసారి కాంగ్రెస్ గెలిపిస్తారు. బీహార్ ఎన్నికలతో పాటే జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక వస్తుందని అనుకుంటున్నా. బీఆర్‌ఎస్ నేతలు కూడా నైతిక విజయం అంటే నైతికత కూడా ఆత్మహత్య చేసుకుంటుంది. బీఆర్‌ఎస్ నేతలకు నైతికత గురించి మాట్లాడే అర్హత లేదు .
బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలన్నది మా విధానం. బీజేపీ నేతలు.. మీకు కావలసిన పద్ధతిలో చట్టం చేయండి. కిషన్ రెడ్డికి బీసీ బిల్లులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాం. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 150 సీట్ల కంటే ఎక్కువ రానివ్వం. 2029లో ఎన్నికలు గెలిచి చూపిస్తాం..కిషన్ రెడ్డి అడ్డుకుంటారా?’ అని అన్నారు.