
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా , డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్
అసెంబ్లీ, మండలి సమావేశాలు ఏర్పాటు చేస్తాం
లేదంటే ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మాక్ అసెంబ్లీ పెడదాం
అక్కడికి మా మంత్రులను పంపిస్తా..పిలిస్తే నేనూ వస్తా
కృష్ణా, గోదావరి జలాలపై చర్చిద్దాం.. న్యాయ, నీటిపారుదల నిపుణులనూ పిలుద్దాం
మాజీ సీఎం కేసీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవాల్
రైతులకు కేసీఆర్ మరణ శాసనం రాశారని ఫైర్.. క్లబ్బులు, పబ్బులకు తనను పిలవద్దని కేటీఆర్‌కు సూచన
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా మాట్లాడిన సీఎం
సాక్షి, హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్ సుదీర్ఘ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఆయన ఏ తారీఖు ఇచ్చినా శాసనసభ, మండలి సమావేశాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ‘కృష్ణా, గోదావరి జలాలకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో, ఆ తర్వాత తొమ్మిదిన్నరేళ్లలో మీరు, ఏడాదిన్నరలో మేము తీసుకున్న నిర్ణయాలపై చర్చిద్దాం..’ అని కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
న్యాయ, సాగునీటి రంగ నిపుణులను పిలిపించి వారి అభిప్రాయాన్ని కూడా ప్రజలకు వినిపిద్దామని అన్నారు. ‘ఏ చిన్న గందరగోళం ఏర్పడకుండా, ఎవరి గౌరవానికి భంగం కలిగించకుండా చట్ట పరిధిలో సభ నిర్వహించే బాధ్యత నాది. ఆరోగ్యం సహకరించక కేసీఆర్ రాకపోతే ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు మా మంత్రుల బృందాన్ని పంపిస్తా. తారీఖు చెప్తే మా వాళ్లు మొత్తం సెటప్ తీసుకుని వస్తారు.
అక్కడే మాక్ అసెంబ్లీ నిర్వహించి చర్చ పెడదాం. కోదండరాం అందులో కూర్చోవాలి. కేసీఆర్ పిలిస్తే నేనూ వస్తా..’ అని సీఎం సవాల్ విసిరారు. మేడిగడ్డ బరాజ్‌కు సంబంధించి తప్పుడు నిర్ణయాలు, ఏపీ కృష్ణా జలాల అక్రమ తరలింపు అంశాలపై బుధవారం ప్రజాభవన్‌లో మంత్రి ఉత్తమ్ నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా ఆయన మాట్లాడారు.
చట్ట సభల్లో చర్చిద్దాం..లేదంటే ఫామ్‌హౌస్‌కు వస్తా
‘చట్టసభల్లో కృష్ణా, గోదావరి జలాలపై చర్చకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఏ తారీఖున వస్తారో చెబుతూ స్పీకర్‌కు లేఖ రాయమన్నాం. అంతేకానీ సవాలు విసరలేదు. ఆయన (కేటీఆర్) సడన్‌గా బయలుదేరిండు. పేరు ప్రస్తావిస్తే నా స్థాయి తగ్గుతుంది. పొద్దటి పూట క్లబ్బుల్లో, రాత్రిపూట పబ్బుల్లో చర్చజేద్దామని ఉబలాటపడుతున్నడు. వీధుల్లో, క్లబ్బుల్లో, పబ్బుల్లో కాకుండా మనం చట్టసభల్లో చర్చిద్దాం. క్లబ్బులు, పబ్బులకు, ఆ కల్చర్‌కు నేను చదువుకునే రోజుల నుంచే దూరం. నన్ను వాటికి పిలవద్దు. అయితే అసెంబ్లీకి, లేకుంటే మండలికి, లేకపోతే ఎర్రవల్లి ఫార్మ్‌హౌస్‌కి వస్తా..’ అని రేవంత్ అన్నారు.
వీధి భాగోతాలు మంచివి కావు..
‘ప్రదాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలి. ప్రజలకు ఉపయోగపడాలని అని నేను అంటుంటే ఆయన ఎందుకూ పనికి రాడు..ఆయనతో ఏం పని అని ఆయన కొడుకు (కేటీఆర్) అంటాడు. నేపాల్‌లో రాజ్యం రాలేదని డిన్నర్‌కి పిలిపించి (యువరాజు)16 మందిని ఏకే 47తో పటపటా కాల్చిండు. అందరూ పోయాక వాడొకడే మిగిలి నేపాల్‌కు రాజైండు. కుటుంబంలో సమస్యలుంటే కుటుంబ పెద్దలు, కుల పెద్దలతో కూర్చొని పంచాయతీ తేల్చుకోవాలి. తమ్ముడు చెల్లెలకు, బావబామ్మర్దికి పంచాయతీలు ఉంటాయి. కానీ ఈ వీధి భాగోతాలు మంచివి కావు..’ అని సీఎం వ్యాఖ్యానించారు.
కేసీఆర్ ఏపీకి అన్ని రకాలుగా సహకరించారు
‘కృష్ణా జలాల్లో ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలను 2015, 2020లో కేసీఆర్ మంజూరు చేసి వచ్చిండు. సముద్రంలో కలుస్తున్న 3 వేల టీఎంసీలను కృష్ణా బేసిన్‌కు అక్కడి నుంచి పెన్నా బేసిన్‌కు తీసుకెళ్లండని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి సలహాలిచ్చిండు. ఏపీకి అన్ని రకాలుగా సహకరించిండు. రాయలసీమను రత్నాల సీమ చేస్తానని ప్రకటించిండు.
కృష్ణా బేసిన్‌లోని రైతులకు శాశ్వత మరణ శాసనం రాసే అధికారం కేసీఆర్‌కు ఎవరూ ఇవ్వలేదు. హైదరాబాద్‌లో ఏపీ, ఇతర రాష్ట్రాల ప్రజలు 20 శాతం ఉన్న నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్ర కోటా నుంచి నగర అవసరాలను వేరు చేసి మిగిలిన జలాలను పంపకాలు చేద్దాం అని ఆనాడు కేసీఆర్ అని ఉంటే పరిస్థితి మరోలా ఉండేది..’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.
కృష్ణా జలాల దోపిడీకి అవకాశం కల్పించారు
‘జూరాల ప్రాజెక్టు నుంచి రోజుకు 2 టీఎంసీల తరలింపు కోసం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణానికి సర్వేలు జరపాలని 2011లో కిరణ్‌కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జీవో ఇచ్చారు. అయితే కేసీఆర్ సోర్సు(నీటిని తీసుకునే ప్రదేశం)ను జూరాల నుంచి శ్రీశైలంకు మార్చడంతో తెలంగాణకు తీవ్ర నష్టం జరిగింది. తుంగభద్ర, కృష్ణా, భీమా నదుల నుంచి తెలంగాణలోని గద్వాల, ఆలంపూర్‌లో ముందుగా కృష్ణా జలాలు ప్రవేశిస్తాయి.
ఆ నీళ్లను అక్కడే ఒడిసి పట్టుకుని తెచ్చుకుని ఉంటే.. ఈ రోజు శ్రీశైలం బ్యాక్‌వాటర్ వద్ద ఏపీకి మనం పైనుంచి వదిలితేనే నీళ్లు దొరుకుతుండే. పోతిరెడ్డిపాడు, రాయలసీమ, మల్యాల, ముచ్చుమర్రి లిఫ్టుల ద్వారా నీళ్లు తరలించుకుపోవడానికి ఏపీకి అవకాశం ఉండేది కాదు. కిందికి పోయాక పట్టుకోవాలనే నిర్ణయంతో పూర్తిగా రాయలసీమ ప్రాంతానికి నీళ్లు తరలిపోతున్నాయి. అక్కడి నుంచి అక్కడే దారిదోపిడీ చేసే అవకాశాన్ని ఏపీకి కేసీఆర్ కల్పించాడు..’ అని ముఖ్యమంత్రి ఆరోపించారు.
సీమాంధ్ర పాలకుల కంటే వెయ్యి రెట్లు ఎక్కువ ద్రోహం
‘శ్రీశైలం నుంచి ఏపీ పెద్ద మొత్తంలో నీళ్లు తీసుకుంటుండడంతో శ్రీశైలం, సాగర్, పులిచింతలలో విద్యుదుత్పత్తి అవకాశాన్ని తెలంగాణ కోల్పోయి ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతోంది. ‘పాలమూరు’ ప్రాజెక్టు సామర్థ్యాన్ని 2 టీఎంసీల నుంచి టీఎంసీకి తగ్గించి కేసీఆర్ మరో అన్యాయం చేశారు.
శ్రీశైలం నుంచి నీటి తరలింపు సామర్థ్యాన్ని ఏపీ రోజుకు 4 టీఎంసీల నుంచి 10 టీఎంసీలకు పెంచుకోగా, కేసీఆర్ మాత్రం తెలంగాణ సామర్థ్యాన్ని తగ్గించారు. కృష్ణా జలాల్లో కేసీఆర్ చేసిన ద్రోహం ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు చేసిన అన్యాయం కంటే వెయ్యి రెట్లు ఎక్కువ.
కేసీఆర్‌ను వంద కొరడా దెబ్బలు కొట్టాలి
సీమాంధ్ర పాలకులను ఒక కొరడా దెబ్బ కొట్టాల్సి వస్తే కేసీఆర్‌ను వంద కొరడా దెబ్బలు కొట్టాల్సిందే. బేసిన్లు లేవు..భేషజాలు లేవని చెప్పే అధికారం కేసీఆర్‌కు ఎవరు ఇచ్చారు? ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పేరును కాళేశ్వరంగా మార్చి రంగారెడ్డి జిల్లాలోని ఆయకట్టును పూర్తిగా, నల్లగొండ జిల్లాలోని 4 లక్షల ఆయకట్టును కేసీఆర్ తొలగించిండు.
కృష్ణా బేసిన్‌లోని రంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలను తరలిస్తే కృష్ణా ట్రిబ్యునల్‌లో నీటి కేటాయింపుల సమస్య వస్తది అని సమర్థించుకుండు. ప్రాజెక్టుల నిర్మాణంతో ఉమ్మడి రాష్ట్రంలో 54 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తే ఎకరాకు రూ.93 వేలు ఖర్చు కాగా, కేసీఆర్ ధనదాహంతో 15 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చి ఎకరాకు రూ.11 లక్షలు ఖర్చు పెట్టిండు..’ అని రేవంత్ ధ్వజమెత్తారు.
ఏపీ సీఎంకు అభ్యంతరం ఎందుకు?
‘బనకచర్లతో వరద జలాలే తీసుకెళ్తామంటున్న ఏపీ సీఎంకు, మా నల్లగొండకు వరద, నికర జలాలు తీసుకెళ్తే అభ్యంతరం ఏమిటి? మా ప్రాజెక్టులన్నీ కట్టుకుంటే వరద ఉందా? లేదా? అనేది తేలుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కూలింది కాబట్టి కింద మీకు వరద కనిపించవచ్చు..’ అని ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి సీఎం వ్యాఖ్యానించారు. కాగా మంత్రి శ్రీధర్‌బాబుకు మాజీమంత్రి హరీశ్‌రావు ఫోన్ చేసి ప్రజాభవన్‌లో సమావేశాల నిర్వహణపై అభ్యంతరం తెలపడంపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది గడీ కాదని అన్నారు.