‘పాదాలకు నమస్కరించినా పట్టించుకోలేదు’

Chirag Paswan Says Cut Open His Heart Will Find PM Modi - Sakshi

నాకు మోదీ ఫొటోలు అక్కర్లేదు

నితీశ్‌ కుమార్‌ ప్రవర్తన షాక్‌కు గురిచేసింది

బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడమే లక్ష్యం

పట్నా: బీజేపీతో కలిసి బిహార్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయటమే తనకున్న ఏకైక లక్ష్యమని లోక్‌జనశక్తి (ఎల్‌జేపీ) చీఫ్‌ చిరాగ్‌ పాశ్వాన్‌ అన్నారు.  ఆ పార్టీ నాయకుల మాటలు తనను బాధిస్తున్నాయని, ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో లేకపోయినా ఎన్నికల్లో విజయం సాధించగల సత్తా తమకు ఉందని పేర్కొన్నారు. మోదీ రాముడైతే, తాను హనుమంతుడి లాంటివాడినని, ఆయన ఆశీసులు తనకు ఎప్పుడూ ఉంటాయంటూ అభిమానం చాటుకున్నారు. కాగా అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో, దివంగత కేంద్ర మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ కుమారుడు చిరాగ్‌ పాశ్వాన్‌ తమ పార్టీ ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించిన విషయం తెలిసిందే. బీజేపీతో స్నేహం కొనసాగిస్తూనే, జేడీ(యూ) అభ్యర్థులపై ఎల్‌జేపీని బరిలోకి దింపి, ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ను ఢీకొట్టేందుకు ఈ యువనేత సిద్ధమయ్యారు. (చదవండి: పాశ్వాన్‌ మృతి: కుమారుడికి కష్టాలు..!)

తప్పుదోవ పట్టించొద్దు
ఈ నేపథ్యంలో నితీశ్‌ కుమార్‌కు చెక్‌ పెట్టేందుకే, బీజేపీ అతడిని అస్త్రంగా వాడుకుంటోందన్న సందేహాలు తలెత్తాయి. దీంతో జేడీయూ నేతల నుంచి ఇదే తరహా అనుమానాలు వ్యక్తం కావడం సహా, సీఎంపై చిరాగ్‌ తీవ్ర విమర్శల నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌, బీజేపీ నేత భూపీందర్‌ యాదవ్‌ తదితరులు శుక్రవారం ఆయనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘ఆయన ఓ ప్రత్యేక దారిని ఎంచుకున్నారు. అంతేకాదు బీజేపీ సీనియర్‌ లీడర్ల పేర్లను ప్రస్తావిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మాకు బీ, సీ వంటి టీంలు ఏమీలేవు. ఎన్డీయేకు నాలుగింట మూడు వంతుల మెజారిటీ సాధిస్తుంది. చిరాగ్‌ పార్టీ కేవలం ఓట్లు చీల్చే పార్టీగానే మిగిలిపోతుంది’’అని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఫొటో వాడటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.(ఇది నాన్న చిరకాల కోరిక: చిరాగ్‌ పాశ్వన్‌)

నా గుండెను చీల్చి చూడండి
ఈ విషయంపై స్పందించిన చిరాగ్‌..‘‘నాకు ప్రధాని మోదీ ఫొటోలు అక్కర్లేదు. ఆయన నా గుండెల్లో ఉన్నారు. రాముడికి హనుమంతుడు ఎలాగో, ఆయనకు నేనూ.. అలాగే. మీరు గుండెను చీల్చి చేస్తూ అందులో మోదీజీ కనబడతారు’’అని చెప్పుకొచ్చారు. సీఎం నితీశ్‌ జీకే ఆయన ఫొటోల అవసరం ఎక్కువగా ఉందంటూ ఎద్దేవా చేశారు. ఇక తన తండ్రి మరణం తర్వాత జరిగిన పరిణామాల గురించి చిరాగ్‌ మాట్లాడుతూ.. ‘‘ నాన్న భౌతిక కాయాన్ని ఢిల్లీ నుంచి పట్నాకు తీసుకువచ్చిన సమయంలో నితీశ్‌ కుమార్‌, ఎయిర్‌పోర్టుకు వచ్చి నివాళులు అర్పించారు.

అప్పుడు నేను ఆయన పాదాలకు నమస్కరించాను. కానీ ఆయన నన్ను పట్టించుకోలేదు. అక్కడున్న వాళ్లంతా ఈ విషయాన్ని గమనించారు. అంతేకాదు మా అమ్మనుగానీ, నన్ను గానీ కనీసం పరామర్శించలేదు. రాజకీయ విభేదాలు ఉన్నంత మాత్రాన ఇలా ప్రవర్తిస్తారా? ఆయన ప్రవర్తకు నన్ను షాక్‌కు గురిచేసింది. కానీ ప్రధాని మోదీ అలా కాదు. నాన్న చనిపోయిన తర్వాత నన్ను పరామర్శించారు. నా భుజం తట్టి, మేమంతా ఉన్నామనే భరోసా ఇచ్చారు’’అని పేర్కొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top