Chidambaram: నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంపై చిదంబరం తీవ్ర విమర్శలు

Chidambaram: Budget Speech Was The most Capitalist Speech Ever - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో చేసిన బడ్జెట్‌ ప్రసంగంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇప్పటి వరకు ఏ ఆర్థిక మంత్రి చదవని పెట్టుబడిదారీ బడ్జెట్‌ ప్రసంగం చేశారని ధ్వజమెత్తారు. మొత్తం బడ్జెట్‌ ప్రసంగంలో పేదలన్న పదం కేవలం రెండుసార్లు మాత్రమే(పేరా ఆరులో) వచ్చిందని.. ఈ దేశంలో పేద ప్రజలు ఉన్నారని గుర్తు చేసినందుకు ఆర్థిక మంత్రికి ధన్యవాదాలు అంటూ ఎద్దేవా చేశారు. ఈ పెట్టుబడిదారీ బడ్జెట్‌ను ప్రజలు తిరస్కరిస్తారని అన్నారు.
చదవండి: వచ్చే వందేళ్ల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఇది: ప్రధాని మోదీ

99.99 శాతం ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు
రాబోయే 25 ఏళ్ల ప్రణాళికను వివరిస్తున్నామని ఆర్థిక మంత్రి చెప్పడం ఆశ్చర్యమేసిందని చిదంబరం పేర్కొన్నారు అంటే ప్రస్తుతంపై ఎలాంటి శ్రద్ధ అవసరం లేదని ప్రభుత్వం విశ్వసిస్తోందని విమర్శించారు. అమృత గడియల వరకు ఓపికగా వేచి ఉండమని చెప్పడం.. భారత ప్రజలను అపహాస్యం చేయడమేనని మండిపడ్డారు. దేశంలోని అత్యంత ధనవంతుల కోరిక మేరకే కేంద్రం ఈ బడ్జెట్‌ తెచ్చినట్లుగా కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రిప్టో కరెన్సీ నేటి నుంచి చట్టబద్ధమని ఆర్బీఐకి బదులు, కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించడాన్ని తప్పుబట్టారు. వీటన్నింటి వల్ల దేశంలోని 99.99 శాతం ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు.
చదవండి: అందుకే పన్నులను పెంచలేదు: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top