దగాకోరు డ్రామాలు!

Chandrababu's hypocritical politics against Dalits - Sakshi

దళితులపై చంద్రబాబు కపట రాజకీయం 

రిజర్వుడ్‌ స్థానాల్లో వరుసగా టికెట్‌ దక్కడం గగనమే

బాబు సామాజిక వర్గానిదే పెత్తనం అంతా

పొత్తులు కుదిరితే ముందుగా రిజర్వుడ్‌ సీట్లే బలి 

మాజీ మంత్రి జేఆర్‌ పుష్పరాజ్‌ను పక్కగదిలో కూర్చోబెట్టి టీజే వెంకటేష్‌తో బేరాలు కుదుర్చుకుని రాజ్యసభ సీటు అమ్ముకున్నారు.

♦ వర్ల రామయ్యకు ఆఖరిలో బలవంతంగా తిరుపతి ఎంపీ సీటు కేటాయించి బలి పశువును చేశారు. పామర్రులో పనిగట్టుకుని తమవాళ్లతో ఓడించారు.

♦ మీకెందుకురా రాజకీయాలు, పదవులు?.. అవి మాకోసమే ఉన్నాయంటూ అనుంగు శిషు్యడు చింతమనేనితో చెప్పించిన నాడు చంద్రబాబు ఆలోచనలు ఎలా ఉంటాయో మరోసారి రుజువైంది. 

♦ దళిత నాయకుల్లో ఏ ఒక్కరూ రాజకీయంగా ఎదగకుండా వెన్నుపోటు రాజకీయాలు ఆయన నైజం. ‘దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా?’ అని వ్యాఖ్యానించినప్పుడే చంద్రబాబు అంతరంగం బోధపడింది. ‘దళితులు పీకిందీ లేదు... పొడిచిందీ లేదు’ అంటూ దురహంకారంతో మాట్లాడిన లోకేష్‌ తండ్రికి తగ్గ తనయుడినని రుజువు చేసుకున్నారు. 

నాగా వెంకటరెడ్డి, సాక్షి, ప్రత్యేక ప్రతినిధి:  ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దళిత బాంధవుడిగా ప్రచారం చేసుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు తనకు అలవాటైన డ్రామాలను రక్తి కట్టిస్తున్నారు. తమ పార్టీలోని దళిత నేతలను కరివేపాకులా వాడుకుంటున్న చంద్రబాబు దళిత సంక్షేమమంటూ మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ, ఆ తరువాత కూడా దళితులను రాజకీయంగా ఎదగనివ్వకుండా చంద్రబాబు అణగదొక్కారనేందుకు ఎన్నో ఉదంతాలున్నాయి.

రిజర్వుడు స్థానాలకు అభ్యర్థుల ఎంపికలోనూ బాబు కోటరీ బృందానిదే పెత్తనం. తాము మంత్రులుగా పనిచేసినా చివరిదాకా టికెట్‌ కోసం ఎదురు చూడాల్సిందేనని గుంటూరు జిల్లాకు చెందిన పార్టీ సీనియర్‌ దళితనేత ‘సాక్షి’తో పేర్కొన్నారు. తామెంత సీనియర్లు అయినా టికెట్‌ దక్కాలంటే బాబు వర్గీయుల సిఫార్సులు తప్పనిసరని కృష్ణా జిల్లాకు చెందిన మరో నాయకుడు వ్యాఖ్యానించారు. 

♦   కొవ్వూరు నుంచి 2009లో టీవీ రామారావు విజయం సాధించినప్పటికి తదుపరి ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వలేదు. 2014లో అక్కడ గెలుపొంది మంత్రిగా వ్యవహరించిన కె.ఎస్‌.జవహర్‌కు 2019లో టికెట్‌ నిరాకరించి తిరువూరుకు మార్చడంతో ఓడిపోయారు. 2014లో పాయకరావుపేట నుంచి గెలుపొందిన వంగలపూడి అనితను 2019లో కొవ్వూరుకు మార్చి బరిలోకి దించటంతో ఓడిపోయారు. కొవ్వూరు ఎమ్మెల్యే ఎవరైనా పెత్తనం మాత్రం బాబు వర్గీయులదే.
♦    చింతలపూడిలో 2009, 2014, 2019లో వరుసగా మార్పులు చేశారు. 2014లో గెలిచి మంత్రిగా పనిచేసిన పీతల సుజాతను తరువాత పక్కనపెట్టేశారు. 2009, 2019లో కె.రాజారావు పార్టీ అభ్యర్థి కావడం గమనార్హం.
♦ ఉమ్మడి కడప జిల్లా రైల్వేకోడూరులో 1983 నుంచి ఉప ఎన్నికతో సహా పదిసార్లు ఎన్నికలు జరగ్గా తూమాటి పెంచలయ్య మాత్రమే రెండుసార్లు పోటీ చేయగలిగారు. అదీ ఎన్టీఆర్‌ ఉన్నప్పుడు. ఆ తరువాత ఎనిమిది ఎన్నికల్లోనూ కొత్త ముఖాలే. కె.నారాయణయ్య నాయుడు, జి.ఎన్‌.నాయుడు కనుసన్నల్లో నడుచుకున్న వారికే అవకాశం దక్కింది.
♦ బద్వేలు, నందికొట్కూరు, గంగాధర నెల్లూరు నియోజకవర్గాల అభ్యర్థులు గత మూడు ఎన్నికల్లోనూ మారిపోయారు. మిగతా చోట్లా ఇదే పరిస్థితి. టీడీపీలో రిజర్వుడు స్థానం నుంచి రెండు, మూడు పర్యాయాలు వరుసగా టిక్కెట్‌ దక్కడమంటే పెద్ద విశేషమే.

దళితులు పీకిందేమీ లేదు: లోకేశ్‌
యువగళం పాదయాత్రలో భాగంగాగురువారం రోజు నంద్యాల జిల్లా డోన్‌ పరిధిలోని జక్కసానిపల్లెలో ఎస్సీలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్‌ విదేశీ విద్య పథకం గురించి మాట్లాడుతూ ‘దళితులు పీకిందీ లేదు... పొడిచిందీ లేదు...’ అని దారుణంగా వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

♦ రాజమహేంద్రవరంలో గోరంట్ల బుచ్చయ్యచౌదరి వరుసగా రెండు పర్యాయాలు ఓడినా ఆయనకు మాత్రం సీటు గ్యారంటీనే. ఇదే జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల జాబితాను పరిశీలిస్తే టీడీపీ అధినేత తీరు తేటతెల్లమవుతుంది.  
♦ దేవినేని ఉమాకు అనుకూలంగా ఉన్నందున ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో తంగిరాల సౌమ్య, అంతకుముందు ఆమె తండ్రి తంగిరాల ప్రభాకరరావుకు అవకాశం కల్పించారు. 
♦  ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ సహకారంతో బాపట్ల జిల్లా వేమూరులో  నక్కా ఆనందబాబు కొనసాగుతుండటం గమనార్హం. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో మాకినేని పెదరత్తయ్యది పెత్తనమైనా 2009లో కందుకూరి వీరయ్య, 2014లో రావెల కిషోర్‌బాబు, 2019లో డొక్కా మాణిక్య వరప్రసాద్‌ పోటీ చేశారు.
♦  పొత్తు కుదిరిందంటే చాలు.. రిజర్వుడు స్థానాలను కేటాయించేందుకు చంద్రబాబు ఏమాత్రం సంకోచించరు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు వామపక్షాల కోటాలో చేరేది. కర్నూలు జిల్లా కోడుమూరును గతంలో బీజేపీకి కేటాయించడం విశేషం. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top