Chandrababu Naidu Expressed His Anger on Kesineni Nani - Sakshi
Sakshi News home page

మీ వారసత్వంతో కలిసి పనిచేయలేం.. నానిపై చంద్రబాబు సీరియస్‌

Published Sun, Nov 20 2022 2:41 PM

Chandrababu Naidu expressed his anger on Kesineni Nani - Sakshi

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి:  ‘టీడీపీ ఓ కంపెనీ. దాని ఓనర్‌ మీరు. మీ ఇష్టం వచ్చినట్లు పార్టీని నడుపుకోండి. నా కంపెనీకి నేనే యజమానిని. నా వీలునుబట్టి నేను వెళ్తాను. మీ వారసత్వంతో కలిసి పనిచేయలేం’ అంటూ విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌(నాని) ఘాటుగా స్పందించడంతో విస్తుపోవడం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ ముఖ్యనాయకుల వంతైంది. కాసేపటికి చంద్రబాబు షాక్‌ నుంచి తేరుకుని ‘ఇష్టమున్న వాళ్లు పార్టీలో ఉండండి. వెళ్లిపోయేవాళ్లు పోండి’ అంటూ హెచ్చరించడంతో టీడీపీ నాయకులు మిన్నకుండిపోయారు.

ఎన్టీఆర్‌ జిల్లాలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహణకు ముందు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఎంపీ కేశినేని నాని, గద్దె రామ్మోహన్, నియోజకవర్గ ఇన్‌చార్జులు వర్ల రామయ్య, నెట్టెం రఘురాం, బుద్దా వెంకన్న తదితర సీనియర్లతో మంగళగిరిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో చంద్రబాబు భేటీ అయ్యారు. ‘జిల్లాలో పార్టీ పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు. అంతర్గత కుమ్ములాటలతో నష్టం జరుగుతోంది. ఎంత చెప్పినా మీలో మార్పు రావడం లేదు’ అంటూ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘నన్ను దృష్టిలో పెట్టుకునే మీరు మాట్లాడుతున్నట్లు ఉంది. నా వల్ల పార్టీలో ఎలాంటి డిస్టర్బెన్స్‌ లేదు. నేనేమీ తగాదాలు పెట్టుకోవడం లేదు. ఎవరి మధ్యా గొడవలు పెట్టడం లేదు. ఈ పార్టీ మీ కంపెనీ. దీనికి మీరు ఓనర్‌. అలాగే కేశినేని కంపె నీకి నేను ఓనర్‌ని. నా ఇష్ట ప్రకారం నా కంపెనీ నడుస్తుంది. పార్టీలో మీరు చెప్పిందే జరుగుతుంది. ఆ తరువాత మీ వారసులు చెప్పింది నడస్తుంది’ అంటూ ఎంపీ కేశినేని కూడా అంతే స్థాయిలో స్పందించడంతో చంద్రబాబు సహా అక్కడున్న నాయకులు అవాక్కయ్యారని సమాచారం. కాసేపటికి తేరుకున్న బాబు.. ‘నానీ అసలు నువ్వేం మాట్లాడుతు న్నావు. నీకేమైనా తెలుస్తోందా? కంపెనీ ఏంటి? వారసులేంటి?’ అని హెచ్చుస్వరంతో అనడంతో కేశినేని మౌనం దాల్చారని తెలిసింది. 

పోటీపడి పార్టీని చేజిక్కించుకున్నా 
‘ఈ పార్టీకి వారసులుగా నేను, హరికృష్ణ, లక్ష్మీపార్వతి పోటీపడ్డాం. మా ముగ్గురి మధ్య జరిగిన పోటీలో నేను ఎక్కువగా కష్టపడ్డాను. పార్టీ నాయకత్వాన్ని చేజిక్కించుకోగలిగాను. నిత్యం కష్టపడితేనే పార్టీని నడపగలం అని చంద్రబాబు అనడంతో... ‘ఓకే సార్‌. థాంక్స్‌. మీరు టికెట్‌ ఇచ్చారు. రెండుసార్లూ గెలిచాను. మీ వారసత్వంతో నేను పనిచేయలేనులెండి. నాకు హైదరాబాద్, ఢిల్లీలో ఆఫీసులు ఉన్నాయి.

అక్కడికెళ్లి నా పనేదో నేను చూసుకుంటాను. మా పార్టీలోకి రండని రాజ్‌నాథ్‌సింగ్, గడ్కరీ  ఎప్పుడో ఆహ్వానించినా నేనుగా వెళ్లలేదు. మీకు దగ్గరి వారైన సుజనా, రమేష్‌లే వెళ్లారు. ఇక్కడ (విజయవాడ) కూడా మీరు ఎవరినో (కేశినేని శివనాథ్‌ ఉరఫ్‌ చిన్నిని పరోక్షంగా ఉదహరిస్తూ) ఆల్రెడీ చూసుకుంటున్నారుగా. అలాగే కానివ్వండి. ఎంకరేజ్‌ చేయండి’ అంటూ కేశినేని నాని ముక్తాయించడంతో బాబు సీరియస్‌ అయ్యారని సమాచారం. 

ఉంటే ఉండండి... పోతేపోండి 
‘ఎవరినైనా సరే నేను ఉపేక్షించను. పార్టీలో ఉండేవాళ్లు ఉండండి. వెళ్లిపోయేవాళ్లు పోండి’ అని చంద్రబాబు గట్టిగా అనడంతో ‘నేనేమీ పోటీ చేయ నులెండి. మీకు నచ్చినోళ్లకే టికెట్‌ ఇచ్చుకోండి’  అంటూ కేశినేని ఇచ్చిన సమాధానంతో సమావేశాన్ని ముగించేశారని పార్టీ వర్గాల సమాచారం. 

గుంటూరులోనూ తీసికట్టే.. 
గుంటూరు జిల్లాలో నియోజకవర్గ ఇన్‌చార్జులు లేక పార్టీ కార్యక్రమాల నిర్వహణ కొరవడుతోందని ఓ సీనియర్‌ మాజీ మంత్రి వాపోయారు. సత్తెనపల్లి, నరసరావుపేట, ప్రత్తిపాడులో పరిస్థితులను ఉదహరించారు. కొన్ని నియోజకవర్గా లకు పేరుకే ఇన్‌చార్జులని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి. మొన్నటికి మొన్న గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి నియోజకవర్గ అభివృద్ధిపై బహిరంగ సవాల్‌ విసిరినా పార్టీ స్పందించకపోవడాన్ని టీడీపీకి చెందిన పొరుగు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు తప్పుపట్టారు. లోకేష్‌ నాయకత్వం వహిస్తున్న మంగళగిరిలో సీనియర్‌ నాయకులు వరుసపెట్టి వీడుతున్న వైనం పార్టీ దుస్థితికి అద్దంపడుతోందని టీడీపీ నాయకులు వాపోతున్నారు. రాజధాని ప్రాంతంగా గొప్పలుపోతున్న తాడికొండలోనూ సానుకూలత కనిపించడం లేదనే ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది.

కీలక జిల్లాల్లో గడ్డు పరిస్థితులు 
‘అత్యంత కీలకమని భావించే ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టీడీపీకి గడ్డుపరిస్థితులు ఉన్నాయి. పలు నియోజకవర్గాలకు ఇన్‌చార్జులు లేని దుస్థితి. ఉన్న వారి మధ్య సఖ్యత లేదు. పార్టీ క్యాడర్‌లో అధినాయకత్వం కనీస నమ్మకాన్ని కలిగించలేకపోతోంది’ అని గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. కొన్నాళ్ల కిందట ఎన్టీఆర్‌ జిల్లా సమావేశంలో జరిగిన వాగ్వివాదాన్ని విశ్లేషిస్తే అధినేతకు ముఖ్య నాయకులపై ఎంత పట్టు ఉందో ఇట్టే తేటతెల్లం అవుతోందని మరో మాజీ ఎంపీ పేర్కొన్నారు.

అమరావతి రాజధానికి కేంద్రంగా చెప్పుకుంటున్న జిల్లాల్లో పార్టీ దుస్థితిని సీనియర్లు బేరీజు వేసుకుంటూ పెదవి విరుస్తున్నారు. గత సాధారణ, మునిసిపల్‌ ఎన్నికలు మొదలు ప్రతి సందర్భంలోనూ అధినేత ఎంత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నా స్పందన నిరాశాజనకంగానే ఉందని సీనియర్‌ నాయకత్వం వాపోతోంది. తాజాగా కర్నూలు జిల్లా పర్యటనలో ‘ఇవే చివరి ఎన్నికలు. మీరు గెలిపిస్తేనే అసెంబ్లీకి. లేదంటే ఇంటికే’ అంటూ చంద్రబాబు తన బేలతనాన్ని వ్యక్తం చేయడం ద్వారా పార్టీ దుస్థితిని తేటతెల్లం చేస్తున్నారని ఆ పార్టీ సీనియర్‌ నాయకులు అభిప్రాయపడుతున్నారు.   

Advertisement
 
Advertisement
 
Advertisement