శివసేనకు చెక్‌ పెట్టేందుకే.. ఆ నలుగురికి అవకాశం!

Cabinet Reshuffle: 4 Likely Faces From Maharashtra BJP - Sakshi

నలుగురు బీజేపీ ఎంపీలకు కేంద్ర మంత్రులుగా అవకాశం 

కొంకణ్‌ నుంచి సీనియర్‌ నేత నారాయణ్‌ రాణేకు పదవి 

థానేలో పట్టు కోసం ఎంపీ కపిల్‌ పాటిల్‌కు అవకాశం 

సాక్షి, ముంబై: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో మంత్రిమండలి విస్తరణలో మహారాష్ట్రకు చెందిన నలుగురు లోకసభ సభ్యులకు (ఎంపీలకు) అవకాశం లభించింది. అందరూ ఊహించినట్లుగానే  మాజీ ముఖ్యమంత్రి నారాయణ రాణేకు కేంద్ర మంత్రి మండలిలో స్థానం దక్కింది. ఆయనతోపాటు ఓబీసీ సమాజానికి చెందిన భివండీ ఎంపీ కపిల్‌ పాటిల్, 2019లో దిండోరి లోకసభ ఎన్నికల్లో రెండు లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన డాక్టరు భారతీ పవార్, ఔరంగాబాద్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు డా. భాగవత్‌ కరాడ్‌ మొదలగు నలుగురికి కేంద్ర మంత్రిమండలిలో అవకాశం లభించింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో బుధవారం సాయంత్రం జరిగిన మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవాల్లో మహారాష్ట్రకు చెందిన ఈ నలుగురు ప్రమాణస్వీకారం చేశారు. దీనిపై మహారాష్ట్ర బీజేపీలో ఆనందం వ్యక్తమవుతోంది.

రాబోయే ముంబై, థానే, ఔరంగాబాద్‌ తదితర మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు, 2024లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికతోపాటు ప్రస్తుతం రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌గా మారిన ఓబీపీ రాజకీయ రిజర్వేషన్, మరాఠా రిజర్వేషన్‌ తదితర అంశాలన్నింటిని దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర నుంచి నలుగురికి అవకాశం ఇచ్చినట్లు రాజకీయ నిపుణులు తెలుపుతున్నారు. రాణేకు కేంద్ర మంత్రిత్వ శాఖలో అవకాశంపై  ప్రధాని నరేంద్రమోదీపై శివసేన విమర్శలు గుప్పించింది. శివసేన నాయకుడు కిషోర్‌ తివారీ మాట్లాడుతూ.. ‘‘ నారాయణ్‌ రాణే ఒక జెడ్‌పీ బ్లాక్‌ లీడర్‌. శివసేన అధినేత బాలసాహెబ్‌ ఠాక్రే రాణేను ముఖ్యమంత్రిగా మార్చడానికి ముందు ఆయన గుమస్తా. అతన్ని పెద్దగా చేసిన వ్యక్తినే మట్టుపెట్టాడు. రాణే ఎక్కడికి వెళ్తాడో అక్కడ గందరగోళం సృష్టిస్తాడు.ం మోదీ మంత్రిత్వ శాఖలో అదే జరుగుతుంది ’’అన్నారు. 

శివసేనకు చెక్‌ పెట్టేందుకే.. 
కేంద్ర మంత్రి మండలిలో మాజీ ముఖ్యమంత్రి నారాయణ రాణేకు అవకాశం ఇవ్వడంతో మహారాష్ట్రలో ముఖ్యంగా కోంకణ్‌లో పార్టీ మరింత బలోపేతం అయ్యే అవకాశాలున్నాయని బీజేపీ భావిస్తోంది. మరోవైపు మరాఠా రిజర్వేషన్‌ అంశంపై కూడా బీజేపీకి లాభం చేకూరనుందని భావిస్తున్నారు. ముంబైతోపాటు కోంకణ్‌లో శివసేన ప్రభావం అధికంగా ఉంటుంది. ఇలంటి నేపథ్యంలో శివసేనకు గట్టి పోటీ ఇవ్వాలంటే శివసేనతో ఢీ కొనేందుకు నారాయణ రాణేను రంగంలోకి దింపనున్నారని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. దూకుడు స్వభావం కలిగిన నారాయణ రాజకీయ జీవితం శివసేన నుంచి ప్రారంభమైంది. కార్పొరేటర్‌ నుంచి ముఖ్యమంత్రి వరకు అన్ని పదవులు శివసేనలో ఉండగానే ఆయనకు దక్కాయి. అయితే శివసేనను వీడిన ఆయన ముందు కాంగ్రెస్‌లో అనంతరం బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన ఆయనకు కేంద్ర మంత్రి మండలిలో అవకాశం లభించింది. దీనిపై ఆయన కుటుంబీకులతోపాటు మద్దతుదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.  

థానేలో పట్టు కోసం.. 
భివండీలో ఎంపీ కపిల్‌ పాటిల్‌కు కేంద్ర మంత్రి పదవి దక్కడంపై భివండీతోపాటు థానే జిల్లాలోని బీజేపీ కార్యకర్తల్లో ఆనందం వ్యక్తమవుతోంది. థానే జిల్లాలో శివసేనకు చెక్‌ పెట్టేందుకు ఆయనకు మంత్రి మండలిలో అవకాశం ఇచ్చినట్లు రాజకీయ నిపుణులు చెబుతున్నారు. గ్రామపంచాయితీ నుంచి కేంద్రమంత్రి వరకు ఎదిగిన కపిల్‌ పాటిల్‌ ఎన్సీపీలో ఉండేవారు. అయితే 2014లో బీజేపీలో ప్రవేశించిన ఆయన లోకసభ సభ్యునిగా విజయం సాధించారు. అనంతరం 2019లో కూడా వరుసగా భివండీ లోకసభ నుంచి విజయం సాధించారు. ఇలా రెండు మార్లు విజయం సాధించిన ఆయనకు కేంద్ర మంత్రి మండలిలో అవకాశం దక్కడంపై బీజేపీ కార్యకర్తల్లో ఆనందం వ్యక్తమవుతోంది. భివండీలో పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు ఉన్నారు. మరోవైపు తెలుగువారైన బీజేపీ కార్యకర్తలు, పదాధికారులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  

కార్పొరేటర్‌ నుంచి కేంద్రమంత్రి వరకు.. 
డాక్టరైన భాగవత్‌ కరాడ్‌ కార్పొరేటర్‌ నుంచి కేంద్రమంత్రి వరకు ఎదిగారు. అహ్మదపూర్‌ తాలూకా చిఖలీ గ్రామంలోని రైతు కుటుంబానికి చెందిన ఆయన సుమారు 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి విద్యాబ్యాసం చేశారు. ఇలా ఔరంగాబాద్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ నుంచి విద్యాభ్యాసం చేసి డాక్టరయ్యారు. ఔరంగాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా రెండు పర్యాయాలు మేయర్‌గా విధులు నిర్వహించారు. 2020లో ఆయన రాజ్యసభ సభ్యునిగా నియామాకం అయ్యారు. ఇలా ఓబీసీ సమాజానికి చెందిన ఆయనకు ముఖ్యంగా డాక్టరు అయిన భాగవత్‌ కరాత్‌కు మంత్రి పదవిలో చోటు ఇచ్చి ఓబీసీ వర్గాలను కొంత మేర సంతోషపరిచారని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. రాష్ట్రంలోని ఓబీసీలకు ఒకరకంగా కేంద్రంలో ప్రాతినిథ్యం ఇచ్చినట్టు అయింది.  

మహిళకు అవకాశం.. 
కేంద్ర మంత్రి మండలి విస్తరణలో మొత్తం నలుగురికి అవకాశం దక్కగా ఇందులో ఒకే ఒక్క మహిళగా డా. భారతీ పవార్‌ కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. భారతీ పవార్‌ కూడా ఎంబీబీఎస్‌ పూర్తి చేసి డాక్టర్‌గా మారిన ఆమె జిల్లా పరిషత్‌ ఎన్నికలతో రాజకీయాల్లో ప్రవేశించారు. ఎన్సీపీ నుంచి పోటీ చేసిన ఆమె బీజేపీలో చేరారు. 2019 లోకసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా దిండోరి లోకసభ నియోజకవర్గం నుంచి ఏకంగా రెండు లక్షల భారీ మెజార్టీతో విజయం సాధించారు. అయితే Ðకేంద్ర మంత్రిమండలి విస్తరణలో మాత్రం ఆమె పేరు పెద్దగా చర్చల్లో విన్పించలేదు. ప్రీతం ముండే, రక్షా ఖడ్సే, హీనా గావిత్‌ పేర్లు విన్పిం చాయి. అయితే చివరికి ఊహించని విధంగా ఆమె పేరు ఖరారైంది. దీనిపై ఆమెమద్దతు దారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top