
కామారెడ్డిలో బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న కేటీఆర్
నీ లెక్క రాంగ్ రూట్లో రాలేదు.. ఉద్యమం నుంచి ఎదిగి వచ్చిన
రాహుల్ గాంధీ అయ్య, అవ్వ పేర్లు చెప్పుకుని రాలేదా?
మీ మంత్రుల్లో చాలామంది ఎట్ల వచ్చిండ్రు
దమ్ముంటే ఎన్నికల కోడ్ రాకముందే రుణమాఫీ చేయి
చిల్లర మాటలు బంద్‌జేసి పాలన మీద దృష్టి పెట్టు
వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రకటించు
సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్
రేవంత్ సగం కాంగ్రెస్, సగం బీజేపీ మనిషి అని ధ్వజం
సాక్షి, కామారెడ్డి, సిరిసిల్ల: ‘‘అయ్య పేరు చెప్పుకుని రాలేదంటూ సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతుండు. అవ్.. మా అయ్య పేరు కేసీఆర్. కొట్లాడి రాష్ట్రం తెచ్చిన తెలంగాణ జాతిపిత’’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు వ్యాఖ్యానించారు. ‘‘రాహుల్ గాంధీ అయ్య, అవ్వ పేర్లు చెప్పుకుని రాలేదా? నీ పక్కన ఉన్న శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలు ఎట్ల వచ్చిండ్రు’’ అంటూ ప్రశ్నించారు. ‘‘నేను నీలెక్క పార్టీలు మారి, ఆంధ్రోళ్ల బూట్లు నాకి, రాంగ్‌రూట్లో రాలేదు.
నేను ఉద్యమంల నుంచి ఎదిగి వచ్చినోన్ని. ఐదుసార్లు సిరిసిల్ల ప్రజలు గెలిపించిండ్రు’’ అని చెప్పుకొచ్చారు. ఆదివారం కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో జరిగిన బీఆర్‌ఎస్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాల్లో కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మూడు నెలల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందన్నారు. రేవంత్‌రెడ్డి పాలనకు ఇంకో వారం గడిస్తే వంద రోజులవుతుందని, అప్పుడు ఆయన భరతం పట్టేందుకు కరెంటు కష్టాలు ఎదుర్కొంటున్న రైతులు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
కోడ్ పేరుతో తప్పించుకుంటే ఊరుకోం
సీఎం రేవంత్‌రెడ్డి మోసాల్లో దిట్ట అని కేటీఆర్ విమర్శించారు. డిసెంబర్ 9న రూ.2 లక్షలలోపు రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పాడన్నారు. వరికి క్వింటాలుకు రూ.5 వందల బోనస్ ఇస్తానన్నది కూడా రేవంత్‌రెడ్డియేనన్నారు. మహిళ లకు రూ.2,500 ఇస్తానని, ఫించన్ రూ.4 వేలకు పెంచుతానని, కల్యాణలక్ష్మి పథకం ద్వారా రూ.లక్ష తో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల కోడ్ రాకముందే జీవోలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. కోడ్ పేరుతో తప్పించుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బుడ్డర ఖాన్, చిల్లర మాటలు బంద్‌జేసి పాలన మీద దృష్టి పెట్టాలని హితవుపలికారు. లంకెబిందెలంటూ... బడే బాయ్ అంటూ.. కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడవాలని రేవంత్‌రెడ్డి చూస్తున్నారని, పార్లమెంట్ ఎన్నికల తరువాత రేవంత్‌రెడ్డి మరో ఏక్‌నాథ్ శిందే లాగా మారుతారని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్‌రెడ్డి సగం కాంగ్రెస్, సగం బీజేపీ మనిషి అని విమర్శించారు.
తప్పుడు ప్రచారం వల్లే కామారెడ్డిలో ఓటమి..
కామారెడ్డిలో భూములు గుంజుకుంటరంటూ తప్పుడు ప్రచారం జరగడం వల్లే ఓటమి ఎదురయ్యిందని కేటీఆర్ పేర్కొన్నారు. త్వరలోనే బీఆర్‌ఎస్‌కు పూర్వ వైభవం వస్తుందని కామారెడ్డి నుంచే జైత్రయాత్ర మొదలుపెట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.