
లేని గొప్పలు చెప్పుకోవడం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అలవాటుగా మారిందని, తన గురురు చంద్రబాబు కోసం తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తున్నారని బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి మండిపడ్డారు. తిరుమలగిరి సభలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ జగదీష్‌రెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడారాయన.
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణకు రేవంత్ చేసింది ఏమీ లేదు. చెప్పుకోవడానికి ఏమీ లేదు. లేని గొప్పలు చెప్పుకోవడం ఆయనకు అలవాటు. తిరుమలగిరి సభకు స్పందనే లేదు. అందుకే సీఎం ఆ సభలో బూతులు మొదలుపెట్టారు. నానాటికీ ఆయన తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారు అని జగదీష్ రెడ్డి అన్నారు.
‘‘నీళ్ళ విషయంలో మరొక సారి రేవంత్ అజ్ఞానం బయటపడింది. ఏపీ సీఎం చంద్రబాబు పంపిన దానినే రేవంత్ మీడియా ముందు మాట్లాడుతున్నారు. తద్వారా తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. గురుదక్షిణ కింద కృష్ణ, గోదావరి జలాలను బాబుకు అప్పజెప్పబోతున్నారు. బనకచర్ల కోసం మేడిగడ్డను గాలికి వదిలేస్తున్నారు’’ అని రేవంత్‌పై జగదీష్ మండిపడ్డారు. మేడి గడ్డ బ్యారేజీ, అన్నారం , సుందిల్ల నుండి బాహుబలి పంపు హౌస్ వరకు ఎక్కడైనా చర్చకు సిద్దం’’ అని సవాల్ చేశారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో 6,47,479 కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశాం. మరి మా హయంలో రేషన్ కార్డులు పంపిణీ జరగలేదని అంటున్న రేవంత్ చెంప దెబ్బకు సిద్ధమా?. ఇప్పుడు ఎన్నికలు పెడితే నల్గొండలో 12 సీట్లకు 12 సీట్లు బీఆర్‌ఎస్ గెలుస్తుంది.
ధాన్యం ఉత్పత్తిలో నల్గొండ జిల్లాను దేశంలోనే నంబర్ వన్‌గా బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీర్చిదిద్దింది. ధాన్యం ఉత్పత్తిలో 3 లక్షల మెట్రిక్ టన్నుల నుండి 40 లక్షల మెట్రిక్ టన్నుల పెంచింది బిఆర్ఎస్ ప్రభుత్వమే. నల్గొండలో యాదాద్రి పవర్ ప్లాంట్, 3 మెడికల్ కాలేజీ లు, యాద్రాది టెంపుల్ అభివృద్ధి కేసీఆర్ హయాంలోనే జరిగాయి కదా. మరి సీఎంగా రేవంత్ హయాంలో ఒక్క ప్రాజెక్ట్ అయినా ప్రారంభించారా?. నల్గొండ రైతులనే అడుగుదాం.. వారి చెంప దెబ్బలకు నేను సిద్ధంగా ఉన్నా. మరి సీఎం రేవంత్, మంత్రులు అందుకు సిద్ధమేనా? అని జగదీష్‌రెడ్డి సవాల్ విసిరారు.

ఇక బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత విషయంలో తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలను జగదీష్ రెడ్డి ఖండించారు. రాజకీయాల్లో ఇలాంటి అక్కర్లేదు. ఎవరికివారే సంస్కారం నేర్చుకుంటే మంచిది. సీఎం రేవంత్ కూడా విజ్ఞతతో మాట్లాడడం నేర్చుకోవాలి అని జగదీష్‌రెడ్డి హితవు పలికారు.