7,041 మంది రైతులకు అందని రుణమాఫీ | - | Sakshi
Sakshi News home page

7,041 మంది రైతులకు అందని రుణమాఫీ

Mar 10 2026 1:25 PM | Updated on Mar 10 2026 1:25 PM

పథకం ముగిసినట్లు ప్రభుత్వం ప్రకటన

వడ్డీ చెల్లించాలంటున్నారు

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో 7,041 మంది రైతులకు రూ.2 లక్షలలోపు రుణమాఫీ కాలేదు. ప్రభుత్వ యంత్రాంగం తప్పిదం కారణంగా ఆయా రైతులకు రుణమాఫీ పథకం వర్తించలేదు. రెండేళ్లు ఏడాది గడిచిపోయినా ఆయా రైతుల గోడును పట్టించుకునేవారు లేకుండాపోయారు.

రుణమాఫీ కోసం రైతులు.. బ్యాంకులు, వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోయారు. వారు ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కూడా కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. అయితే రైతుల రుణమాఫీ కింద విడుదల చేసిన డబ్బును ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం స్పందించి తమకు రుణమాఫీ పథకాన్ని వర్తింపజేసి ఆదుకోవాలని 7,041 మంది రైతులు కోరుతున్నారు. వారిలో నల్లగొండ మండలం ఒక్క సూరారం రైతులే 165 మంది ఉన్నారు.

ఇదే అసలు సమస్య

రాష్ట్రంలో ప్రభుత్వం రుణమాఫీ పథకాన్ని విడతల వారీగా అమలు చేసింది. 2024 మొదట్లో ఒకసారి రూ.1 లక్షలోపు రుణాలు తీసుకున్న వారికి రుణమాఫీ పథకాన్ని అమలు చేసింది. ఆ తరువాత అదే ఏడాది డిసెంబర్‌లో రూ.2 లక్షలలోపు రుణాలు తీసుకున్న రైతులకు పథకాన్ని అమలు చేసింది. అయితే అందులో ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకు (ఏపీజీవీబీ) నుంచి రుణాలు తీసుకున్న రైతులకు మాత్రం రుణమాఫీ కాలేదు. ప్రభుత్వం రుణమాఫీ పథకాన్ని అమలు చేసిన సమయంలోనే ఏపీజీవీబీని తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా (టీజీబీ) మార్చారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఏపీజీవీబీకి ఉన్న ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌తోనే మాఫీ చేయాల్సిన రైతుల రుణాల వివరాలను బ్యాంకులకు పంపించింది. అయితే అప్పటికే టీజీబీలకు కొత్త ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లు వచ్చేశాయి. బ్యాంకు ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ మారిపోవడం, ఏపీజీవీబీ ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌తోనే నిధులను పంపించడంతో అవి డైరెక్ట్‌ బెనిఫిషరీ ట్రాన్స్‌ఫర్‌ (డీబీటీ) కింద రైతుల ఖాతాల్లో జమ కాలేదు. దీంతో ఆయా రైతులందరికి రుణమాఫీ అందలేదు

పట్టించుకోని బ్యాంకులు, ప్రభుత్వం

ఏపీ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌.. టీజీబీగా మారడంతో రుణమాఫీ కాని రైతులంతా అటు ప్రభుత్వం చుట్టూ, ఇటు బ్యాంకుల చుట్టూ ఏడాది కాలంగా తిరుగుతూనే ఉన్నారు. బ్యాంకు ఉద్యోగులను అడిగితే తాము టీజీబీగా మారినట్లు, మారిన ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లను కూడా ప్రభుత్వానికి పంపించామని, వారు చూసుకోకపోతే తామేం చేస్తామని చెబుతున్నారు. ఇక వ్యవసాయ శాఖ అధికారులను అడిగితే తాము నివేదికను ప్రభుత్వానికి పంపించామని, తామేం చేయమలేమని చెబుతున్నారు. రుణాలకు వడ్డీ చెల్లించాలని వేధిస్తున్నారు. గత్యంతరం లేక రైతులు బ్యాంకులకు వడ్డీ చెల్లించాల్సి వస్తోంది.

రాష్ట్రంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షలలోపు రుణమాఫీ పథకం ముగిసిందని ప్రభుత్వం ప్రకటించింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఈ మేరకు ప్రకటన చేశారు. కానీ నల్లగొండ జిల్లాలోని 7041 మంది రైతులకు సంబంధించిన రుణమాఫీ విషయాన్ని పట్టించుకోవడం లేదు. మరోవైపు వరంగల్‌ జిల్లాలోనూ ఇదే సమస్యతో వేల మంది రైతులు రుణమాఫీ కాలేదని తెలిసింది.

నాకు బ్యాంకులో రూ. 86,945 రుణం ఉంది. రుణమాఫీ ఇంతవరకు కాలే దు. బ్యాంకు అధికారులు వడ్డీ చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

– శ్రీరామోజు వెంకటాచారి

Advertisement
 
Advertisement
Advertisement