సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ధాన్యం మళ్లింపు కేసులో అరెస్టయిన కందుకూరి మహేందర్‌ను రెండు రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. జిల్లాలో రూ.191.13 కోట్ల విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించిన కేసులో మహేందర్‌తో పాటు అతని భార్యను ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో తదుపరి విచారణలో భాగంగా మహేందర్‌ను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జేఎంఎఫ్‌సీ (స్పెషల్ మొబైల్) కోర్టు పోలీసుల అభ్యర్థనను సమ్మతిస్తూ మహేందర్‌ను రెండు రోజులపాటు పోలీస్ కస్టడీకి అనుమతిచింది. ఈ నేపథ్యంలో మహేందర్ తరఫున దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌ను కోర్టు వాయిదా వేసింది.
జెడ్పీ సీఈఓగా విధుల్లో చేరిన ప్రేమ్‌కరణ్‌రెడ్డి
నల్లగొండ : రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఓఎస్‌డీ ప్రేమ్‌కరణ్‌రెడి తిరిగి నల్లగొండ జెడ్పీ సీఈఓగా సోమవారం విధుల్లో చేరారు. నల్లగొండ జెడ్పీ సీఈఓగా ఉన్న ఆయన గతేడాది మేలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వద్ద ఓఎస్‌డీగా వెళ్లిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తిరిగి నల్లగొండ జెడ్పీ సీఈఓగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయనను జిల్లా పరిషత్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కొప్పు రాంబాబు, కార్యదర్శి నరేందర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, సూపరింటెండెంట్లు సన్మానించారు.
హెచ్‌పీవీ టీకా కేంద్రం తనిఖీ
నాగార్జునాసాగర్ : సాగర్ కమలానెహ్రూ ఏరియా ఆస్పత్రిలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ సెంటర్‌ను జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి (డీఐఓ) పద్మ సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె బాలికలందరూ హెచ్‌పీవీ టీకా తీసుకునేలా చూడాలన్నారు. పెద్దవూర, అనుముల, తిరుమలగిరి సాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని ఆశ వర్కర్లు అర్హులైన బాలబాలికలను వారి తల్లిదండ్రులతోపాటు వ్యాక్సినేషన్ కేంద్రానికి తీసుకుని రావాలని సూచించారు. సోమ, మంగళ, గురు, శుక్ర వారాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు టీకాలు వేస్తారని తెలిపారు. 14 ఏళ్లు పూర్తయి.. 15 ఏళ్లు నిండని బాలబాలికలంతా వ్యాక్సిన్ తీసుకోవాలని పేర్కొన్నారు. ఆమె వెంట ఉదయ్, స్టెఫీ, కమలమ్మ, గంగాబాయి, తిరుమలచారి ఉన్నారు.


