నల్లగొండ : ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని.. పెండింగ్ పెట్టొద్దని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి మాట్లాడారు. మొత్తం 125 ఫిర్యాదులు రాగా, అందులో రెవెన్యూ శాఖకు సంబంధించినవి 72, జిల్లా అధికారులకు సంబంధించి 53 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని, వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నెల రోజులకు మించి పెండింగ్‌లో పెట్టవద్దన్నారు. అనంతరం ఆయన వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ‘ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా పెండింగ్ ఫైళ్ల జాబితా రూపొందించి ఈ నెల 15వ తేదీలోగా వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. వచ్చే వారంలోపు పరిష్కరించిన వాటి వివరాలను సమర్పించాలన్నారు. ఇకపై అన్ని కార్యాలయాల ఫైళ్లు ఈ– ఆఫీస్ ద్వారా నిర్వహించాలనాని, ఇందుకోసం ఎన్‌ఐసీ ద్వారా ప్రతి శాఖకు ఒక మెయిల్ ఐడీ ఇస్తామన్నారు. జనగణనలో భాగంగా ఎన్యూమరేషన్ బ్లాక్‌లను ఖరారు చేయాలని సూచించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్‌రెడ్డి, ఆర్డీఓలు రమణారెడ్డి, శ్రీదేవి పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ చంద్రశేఖర్


