మమత సర్కారుకు టాటా

BJP President JP Nadda kickstarts parivartan yatra in Bengal - Sakshi

అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు వీడ్కోలు చెప్పడం ఖాయం 

‘పరివర్తన్‌ యాత్ర’లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

నవద్వీప్‌/మాల్డా: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ ప్రభుత్వానికి వీడ్కోలు పలకాలని పశ్చిమ బెంగాల్‌ ప్రజలు నిర్ణయించుకున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఆయన శనివారం బెంగాల్‌ రాష్ట్రం నాడియా జిల్లాలోని నవద్వీప్‌ నుంచి పరివర్తన్‌ యాత్ర (రథయాత్ర)ను ప్రారంభించారు. బెంగాల్‌లో మార్పునకు సమయం ఆసన్నమైందన్నారు. రాష్ట్రంలో తృణమూల్‌ ప్రభుత్వం పరిపాలనను రాజకీయంగా, పోలీసు వ్యవస్థను నేరమయంగా, అవినీతిని వ్యవస్థీకృతంగా మార్చేసిందని దుయ్యబట్టారు. మా, మాటీ, మానుష్‌(తల్లి, భూమి, ప్రజలు) అనే తృణమూల్‌ నినాదం కనుమరుగైందన్నారు. తల్లిని అగౌరవపర్చారని, భూమిని లూటీ చేశారని, ప్రజలకు రక్షణ కల్పించలేకపోయారన్నారు.

 

బెంగాల్‌లో దౌర్జన్య పాలన
‘జైశ్రీరామ్‌’ నినాదంలో తప్పేముందని నడ్డా ప్రశ్నించారు. ఈ నినాదాన్ని మమతా బెనర్జీ ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని నిలదీశారు. సొంత దేశ సంస్కృతితో అనుసంధానం కావడం తప్పు ఎలా అవుతుందన్నారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దేశ సంస్కృతిని నిరాకరిస్తున్నారని ఆక్షేపించారు. బెంగాల్‌ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా మమతా బెనర్జీ అడ్డుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో దౌర్జన్య పాలన సాగుతోందని మండిపడ్డారు. 130 మంది బీజేపీ కార్యకర్తలను హత్య చేశారని, తనపైనా జరిగిందని వెల్లడించారు.  

బెంగాల్‌ రైతులకు తీరని ద్రోహం
పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకాన్ని పశ్చిమ బెంగాల్‌లో అమలు చేయకుండా మమత ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులకు ద్రోహం చేసిందని నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాల్డాలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కృషక్‌ సురక్ష అభియాన్, ఏక్‌ ముట్టీ చావల్‌ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రోడ్‌ షోలో పాలుపంచుకున్నారు. రైతన్నల సంక్షేమానికి బీజేపీ, నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉన్నాయని పునరుద్ఘాటించారు. రైతులు తాము పండించిన పంటలకు పెట్టబడి వ్యయం కంటే 1.5 శాతం అధిక ప్రయోజనం పొందుతున్నారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఇటీవలే 100వ కిసాన్‌ రైలును ప్రారంభించారని గుర్తుచేశారు. ఈ రైళ్లలో రైతులు తమ పంటలను దేశంలో ఎక్కడికైనా రవాణా చేసుకోవచ్చని వెల్లడించారు.

‘జైశ్రీరామ్‌’ అంటే కోపమెందుకో?
మమత సర్కార్, టీఎంసీకిæ ప్రజలు ‘నమస్తే, టాటా’ చెప్పబోతున్నారని నడ్డా వ్యాఖ్యానించారు. ‘జైశ్రీరామ్‌’ నినాదాలు వినగానే మమతా బెనర్జీకి ఎందుకు కోపం వస్తోందో అర్థం కావడం లేదన్నారు. మాల్డా జిల్లాలోని షాహాపూర్‌ గ్రామంలో ‘కృషక్‌ సురక్ష సహ–భోజ్‌’లో భాగంగా నడ్డా స్థానిక రైతులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top