బీజేపీలో భారీ ప్రక్షాళన.. కీలక మార్పులు! | BJP organisational overhaul, cabinet reshuffle likely soon full details | Sakshi
Sakshi News home page

BJP: ఇక సంస్థాగతంపై దృష్టి

May 13 2026 3:59 PM | Updated on May 13 2026 4:20 PM

BJP organisational overhaul, cabinet reshuffle likely soon full details

యువ నాయకత్వానికి పెద్దపీట

సాక్షి, న్యూఢిల్లీ: అత్యంత కీలకమైన ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ ముగియడంతో కాషాయ దళం సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించింది. జాతీయ స్థాయిలో విస్తృత మార్పులకు శ్రీకారం చుట్టేందుకు అధిష్టానం సిద్ధమవుతోంది. యువ నాయకత్వానికి పెద్దపీట వేస్తూ పార్టీని పూర్తిస్థాయిలో పునర్‌వ్యవస్థీకరించనుంది. ఈ నెలాఖరులోగా లేదా జూన్‌ మొదటి వారంలో ఇందుకు సంబంధించి కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశముందని పార్టీ వర్గాలంటున్నాయి. 2029 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా సామాజిక సమీకరణాలు, యువత, మహిళలకు ప్రాధాన్యం అనే మూడు ప్రధాన అజెండాలతో ఈ ప్రక్షాళన చేపడతారని విశ్వసనీయంగా తెలుస్తోంది.

నితిన్‌ నబీన్‌ నుంచే మొదలు 
బీజేపీ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన అధ్యక్షుల్లో ఒకరిగా నితిన్‌ నబీన్‌ ఇటీవలే నియమితులైన విషయం తెల్సిందే. ఆయన దగ్గర్నుంచే సంస్థాగత ప్రక్షాళన దిశగా పార్టీ ముందుకు సాగుతోంది. అయితే, ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను పార్టీ సీరియస్‌గా తీసుకోవడంతో సంస్థాగత నిర్మాణ ప్రక్రియ కాస్తంత వాయిదాపడింది. ఎన్నికల ప్రక్రియ ముగియడంతో తిరిగి ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీ జాతీయ కార్యవర్గంలోని ఉపాధ్యక్షులు, జాతీయ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అధికార ప్రతినిధులతో సహా రాష్ట్ర ఇన్‌చార్జిలు, మోర్చాల బాధ్యతల్లో పెద్దఎత్తున మార్పులు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా మోర్చా, యువమోర్చా విభాగాల్లో సమగ్రంగా మార్పులు చేపట్టనున్నట్లు సమాచారం.

కొత్తగా నియమితులయ్యే నాయకుల్లో 55 ఏళ్లలోపు వారే అత్యధికంగా ఉండే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ‘ఇటీవలి కాలంలో పార్టీ 45–56 ఏళ్ల వయస్సున్న నాయకులను ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా ఎంపిక చేస్తోంది. బిహార్‌ ముఖ్యమంత్రి సమ్రాట్‌ చౌదరి వయస్సు 56, ఛత్తీస్‌గఢ్‌ ఉప ముఖ్యమంత్రులు అరుణ్‌ సావ్‌కు 56 ఏళ్లు, విజయ్‌ శర్మకు 52 సంవత్సరాలు. ఇక బెంగాల్‌ కొత్త సీఎం సువేందు అధికారి వయస్సు 55. ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి వయస్సు 50, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ వయస్సు 53 ఏళ్లు. గుజరాత్‌లో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ అనంతరం కేబినెట్‌ సగటు వయస్సు 59 నుంచి 52కి తగ్గింది. అదే మాదిరిగా పార్టీలోనూ యువతకు ప్రాధాన్యం ఇచ్చేలా కీలక మార్పులు ఉంటాయి’ అని పార్టీ జాతీయ నేత ఒకరు తెలిపారు.

రాష్ట్ర రాజకీయాల్లో చురుకుగా పనిచేసిన యువ నేతలకు జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించేందుకు కసరత్తు జరుగుతోందని సమాచారం. సోషల్‌ మీడియా, డిజిటల్‌ ప్రచారం, బూత్‌ స్థాయి నిర్వహణలో నైపుణ్యం ఉన్న నేతలకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీలో కొత్తగా చోటుచేసుకునే మార్పుల్లో భావజాలానికి కట్టుబడి పనిచేసిన వారికే ఎక్కువ ప్రాధాన్యం ఉండే అవకాశముందని సమాచారం. ముఖ్యంగా ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థల నేపథ్యం ఉన్న నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు చర్చలు సాగుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

కేంద్ర కేబినెట్‌లోనూ మార్పులు? 
పార్టీ నిర్మాణంతో పాటే కేంద్ర మంత్రివర్గ విస్తరణ, పునర్‌వ్యవస్థీకరణ సైతం చేపట్టే అవకాశమున్నట్లు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. పార్టీలోని యువత తో పాటు ఎన్‌డీఏ మిత్రపక్షాలకు మరింత ప్రాధాన్యం కల్పిస్తూ కొత్త వారిని కొందరిని కేంద్ర కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో 2021 నుంచి పెద్దగా మార్పులు చోటుచేసుకోలేదు.

చ‌ద‌వండి: ఏడాది పాటు ప‌సిడి కొనొద్దు.. ప‌రిష్కారం ఇదిగో!

మోదీ 2.0 రెండో దఫా ప్రభుత్వంలో చేరిన 34 మంది మంత్రుల్లో 19 మంది కేబినెట్‌ హోదాతో ఇప్పటికీ కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రుల పనితీరు, శాఖల పనిభారం, రాజకీయ సమీకరణలపై సమీక్ష చేపట్టి, తదనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తారని అంటున్నారు. దేశవ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతం చేయడం, సామాజిక వర్గాల సమీకరణ, యువతను ఆకర్షించడం, మహిళల ప్రాతినిథ్యాన్ని పెంచడం వంటి లక్ష్యాలతోనే ఈ ప్రక్షాళన జరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందుగానే సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడమే కాషాయ దళ నేతల ప్రధాన వ్యూహంగా ఉంటుందని అంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement