టైటాన్ సీఎఫ్‌ఓ అశోక్ సోంతాలియా
న్యూఢిల్లీ: పశ్చిమ ఆసియా సంక్షోభం నేపథ్యంలో విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకునేందుకు దేశ ప్రజలు ఏడాది పాటు బంగారం కొనకుండా ఉంటే చాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటనపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ చేసిన ప్రకటనపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. ప్రధాని ప్రతిపాదనపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని ప్రకటనను కొంత మంది సమర్థిస్తుండగా, మరి కొంత మంది ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. బంగారం కొనుగోళ్లు ఆపేస్తే నగల పరిశ్రమ నాశమవుతుందని, కోట్లాది మంది ఉపాధికి దూరమవుతారని భయాందోళనలు చెందుతున్నారు.
ఈ నేపథ్యంలో బంగారం దిగుమతులను తగ్గించడానికి టైటాన్ సీఎఫ్‌ఓ అశోక్ సోంతాలియా ఓ పరిష్కారాన్ని సూచించారు. మన దేశంలో పోగుపడి ఉన్న బంగారాన్ని మార్పిడి చేయడం ద్వారా దిగుమతులను తగ్గించవచ్చని ఆయన సలహా ఇచ్చారు. బిజినెస్ టుడేతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ.. ''ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన ప్రభావం బంగారం కొనుగోళ్ల వైపు ఉంటుందా, సరఫరా వైపు మళ్లుతుందా అని వేచిచూస్తున్నాం. బంగారం దిగుమతుల గురించే కేంద్ర సర్కారు ఎక్కువ ఆందోళనగా ఉన్నట్టు కనబడుతోంది. ఒకవేళ అదే నిజమైతే ఈ సమస్యను అధిగమించడానికి స్వల్పకాలిక, దీర్ఘకాలిక పరిష్కారాలు ఉన్నాయి. మన దేశంలో ప్రజల దగ్గర, దేవాలయాలు, లాకర్లలో పెద్ద మొత్తంలో ఉన్న బంగారాన్ని మార్పిడి చేయడం ద్వారా దిగుమతులను గణనీయంగా తగ్గించవచ్చ''ని అశోక్ సోంతాలియా పేర్కొన్నారు.
నిశితంగా పరిశీలిస్తున్నాం
బంగారం కొనుగోళ్లు హఠాత్తుగా నిలిచిపోతే కోట్లాది మంది ఉపాధికి విఘాతం కలుగుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని అశోక్ సోంతాలియా చెప్పారు. తమ ప్రతిపాదనను వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని అనుకోవడం లేదని స్పష్టం చేశారు. ప్రధాని ప్రకటన ప్రభావం బంగారం కొనుగోళ్లపై ఎలా ఉంటుందో చూడటానికి రెండు వారాలు వేచి చూస్తామన్నారు. అలాగే పసిడి కొనుగోళ్ల నియంత్రణ ప్రభుత్వం ఎలాంటి విధాన ప్రకటన చేస్తుందో చూడాలన్నారు. ఈ రెండు అంశాలను వారం పది రోజుల పాటు నిశితంగా గమనిస్తామన్నారు.
చదవండి: ఓబీసీ క్రిమిలేయర్ కిరికిరి తేలింది!
పసిడి అమ్మకాల నియంత్రణలో నరేంద్ర మోదీ సర్కారు సమగ్ర దృక్పథంతో వ్యవహరిస్తుందన్న నమ్మకాన్ని అశోక్ సోంతాలియా (Ashok Sonthalia) వ్యక్తం చేశారు. దేశ ప్రయోజనాలతో పాటు నగల పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న వారి ఉపాధిని దెబ్బతీయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న విశ్వాసాన్ని వెలిబుచ్చారు. ఆభరణాల పరిశ్రమ కూడా నష్టపోకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
జీజేసీ అభ్యంతరం
కాగా, పుత్తడి కొనుగోళ్లను నియంత్రించాలన్న ప్రధాని మోదీ ప్రకటనపై అఖిల భారత రత్నాలు, ఆభరణాల మండలి (జీజేసీ) అభ్యంతరం వ్యక్తం చేసింది. బంగారం అమ్మకాలు తగ్గితే ప్రత్యక్షంగా, పరోక్షంగా కోట్లాది మందికి ఉపాధి కరవుతుందని ఆందోళన చెందింది. అనేక రంగాలపై ప్రతికూల ప్రభావం ఉంటుందని, దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా భారం పడే అవకాశం ఉందని అభిప్రాయపడింది. బ్యాంకింగ్, బీమా, ఆర్థిక సేవల రంగాలతో పాటు లాజిస్టిక్స్, జ్యుయెల్లరీ డిజైన్, ఈ- కామర్స్ తదితర రంగాలు కూడా దెబ్బతింటాయని అంచనా వేసింది.
విదేశీ వద్దు.. స్వదేశీ ముద్దు
అమెరికా- ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇంధన విపత్తు నెలకొందని, దీన్ని అధిగమించడానికి దేశ ప్రజలకు 7 రకాల చర్యలను ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. వర్క్ ఫ్రం హోమ్, బంగారం కొనుగోళ్ల నిలిపివేత, ప్రజా రవాణా వాడకం, పరిమితంగా వంట నూనెలు, విదేశీ వస్తువుల వినియోగం, సేంద్రియ వ్యవసాయం, విదేశీ పర్యటనల రద్దు వంటి అంశాలను ప్రధాని ప్రస్తావించారు.
Nation First Duty Above Comfort!
PM @narendramodi gave 7 important appeals to strengthen India during challenging global times prioritize work from home wherever possible, reduce fuel consumption, avoid foreign travel for a year, adopt Swadeshi products, cut down cooking oil… pic.twitter.com/jhDGYTarH6— MyGovIndia (@mygovindia) May 10, 2026


