ఓబీసీ క్రీమీలేయర్‌ కిరికిరి తేలింది! | Kodepaka Kumara Swamy write on OBC creamy layer issue | Sakshi
Sakshi News home page

ఓబీసీ క్రీమీలేయర్‌ కిరికిరి తేలింది!

May 8 2026 12:16 PM | Updated on May 8 2026 1:54 PM

Kodepaka Kumara Swamy write on OBC creamy layer issue

ఇటీవల సుప్రీంకోర్టు యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ రోహిత్ నాథ‌న్ (Union of India Vs Rohith Nathan) కేస్ తీర్పులో ఓబీసీ రిజర్వేషన్లలో అభ్యర్థులు క్రిమిలేయరా? లేదా నాన్ క్రిమిలేయరా అనే విషయాన్ని నిర్ధారించేటప్పుడు ప్రభుత్వరంగ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల మరియు ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల జీతభత్యాలను మాత్రమే పరిగణలోకి తీసుకోని నిర్ధారించడాన్ని తప్పుపడుతూ, చరిత్రాత్మకమైన తీర్పును వెలువరించింది. ఇట్టి తీర్పు కేంద్ర ప్రభుత్వంలోనీ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ శాఖలో ఓబీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేస్తున్న అధికారులకు, అదేవిధంగా ఉద్యోగుల జీతభత్యాలను మాత్రమే పరిగణలోకి తీసుకొని ఓబీసీ (నాన్ క్రిమిలేయర్) సర్టిఫికెట్ జారీ చేయడానికి ఇబ్బందులకు గురిచేస్తున్న తహాసిల్దార్లకు చెంపపెట్టుగా భావించాలి.

దేశంలో మొత్తం 8 రకాల రిజర్వేషన్లను విద్యా, ప్రభుత్వ ఉద్యోగాల్లో అమలు చేస్తున్నారు. ఇందులో ఎవరికీలేని క్రిమిలేయర్ సమస్య కేవలం బీసీ రిజర్వేషన్లపై ఉంది. కారణం భారత రాజ్యాంగంలోని లోపాలు నేడు బీసీ కులాల పాలిట శాపంగా మారింది. రాజ్యాంగాన్ని సవరిస్తే తప్ప బీసీ కులాలకు న్యాయం జరిగే అవకాశాలు లేవు. బీసీ రిజర్వేషన్లు క్రీమీలేయర్ సమస్యను పరిశీలించినట్లయితే.. 1992లో సుప్రీంకోర్టు 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మండల కమిషన్ నివేదిక ఆధారంగా 27% రిజర్వేషన్లు అమలు చెయ్యాలని, అమలు చేసే క్రమంలో ఓబీసీ కులాల్లోని సంపన్న శ్రేణికి చెందిన వారిని రిజర్వేషన్ల పరిధి నుంచి తొలగించి ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేసుకోవచ్చని తీర్పునిచ్చింది. 

సదరు తీర్పులో ప్రధానంగా సుప్రీంకోర్టు చెప్పిన అంశము ఏమనగా? రాజ్యాంగం ప్రకారము సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల పౌరుల రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల మాదిరిగా కులాల/తెగల ప్రాతిపదికన కల్పించిన రిజర్వేషన్లు కావు అని తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ/ఓబీసీ జాబితాల్లో కులాలను చేరుస్తున్నారు కాబట్టి ఆయా కులాల్లో సామాజికంగా అభివృద్ధి చెందిన వారిని సంపన్న శ్రేణి వర్గంగా గుర్తించి రిజర్వేషన్ల పరిధి నుంచి తొలగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఆ క్రమంలో కేంద్ర ప్రభుత్వము 1993లో జస్టిస్ రామ్ నందన్ ప్రసాద్ అధ్యక్షతన జాతీయస్థాయిలో నిపుణుల కమిటీని నియమించి ఓబీసీ జాబితాలోని కులాల్లో సంపన్న శ్రేణి వర్గాలను గుర్తించాలని ఆదేశించింది. అట్టి నిపుణుల కమిటీ మొత్తం ఓబీసీ జాబితాలోని కులాల్లో ఆరు గ్రూపులను సంపన్న శ్రేణి వర్గాలుగా గుర్తించి వారిని రిజర్వేషన్ల పరిధి నుంచి తొలగించింది. 

అందులో (1) రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో కొనసాగుతున్న వారి పిల్లలు (2) ఉద్యోగుల పిల్లలు (3) ఆర్మీ ఉద్యోగుల పిల్లలు (4) వ్యాపారవేత్తల వారి పిల్లలు (5) ఆస్తులు కలిగిన వారి పిల్లలు (6) ఆదాయ/సంపద పరీక్ష. ఇందులో చివరిదైన ఆదాయ/సంపద పరీక్షలో ఒక వ్యక్తి సంపన్న శ్రేణికి చెందిన వాడా లేదా అనే విషయాన్ని నిర్ధారించి ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేసే క్రమంలో ఉద్యోగుల జీతభత్యాలను మరియు వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయాన్ని పరిగణలోకి తీసుకోవద్దని ఇతర నిబంధనలు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని తెలిపింది. 1993లో వార్షిక ఆదాయ పరిమితి 1 లక్షగా నిర్ధారించారు ప్రస్తుతము 8 లక్షల పరిమితి ఉంది. అదేవిధంగా రూపాయి విలువ హెచ్చుతగ్గులను ఆధారంగా చేసుకొని ప్రతి మూడు సంవత్సరాలకు వార్షిక ఆదాయ పరిమితిని సమీక్షించి ఆదాయ పరిమితిని పెంచాలని తెలిపింది. ఆ లెక్కన నేటికీ ఆదాయ పరిమితిని పదిసార్లు సమీక్షించి పెంచవలసి ఉండేది అలా పెంచినట్లైతే నేడు వార్షిక ఆదాయ పరిమితి 30 లక్షలుగా ఉండాలి.

కేంద్ర ప్రభుత్వము 1993లో ఓబీసీ రిజర్వేషన్లలో సంపన్న శ్రేణిని జస్టిస్ రామ్ నందన్ ప్రసాద్ అధ్యక్షతన సమర్పించిన నివేదికాధారంగా ఓబీసీ కులాల్లో ఆరు తరగతులను సంపన్న శ్రేణిగా ప్రకటిస్తూ ఇందులో రెండవదైన ఉద్యోగుల పిల్లలకు సంబంధించి మూడు విభాగాలుగా గుర్తించింది (A) తండ్రి లేదా తల్లి ఇద్దరిలో ఎవరైనా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, గ్రూప్-1,  కేటగిరి- ఏ, క్లాస్ - ఏ ఉద్యోగాల్లో నేరుగా నియమించ బడినట్లయితే వారి పిల్లలు సంపన్న శ్రేణి వర్గంలోకి వస్తారు వారికి ఓబీసీ రిజర్వేషన్లు వర్తించవు (B) తల్లి లేదా తండ్రి గ్రూప్ -2, క్లాస్ -2 పోస్టులో నియమించబడి గ్రూప్ -1 పదోన్నతి 40 సంవత్సరాల లోపు పొందినట్లయితే, తల్లి మరియు తండ్రి గ్రూప్-2 పోస్టులో నేరుగా నియమించ బడినట్లైతే వారి పిల్లలు సంపన్న శ్రేణి వర్గంలోకి వస్తారు వారికి రిజర్వేషన్లు వర్తించవు (C) ప్రభుత్వ రంగ సంస్థలు మరియు యూనివర్సిటీల్లో పనిచేస్తున్న తండ్రి లేదా తల్లుల సమానత్వపు హోదాను పైన (A) & (B)లో తెలిపిన నిబంధనల ప్రకారం వారి హోదాను బట్టి వారి పిల్లలు సంపన్న శ్రేణి వర్గానికి చెందుతారా? లేదా? అనేది నిర్ధారించాలి. 

ఒకవేళ ప్రభుత్వంలోని పోస్టులకు సమానమైన పోస్టులను గుర్తించనట్లయితే వారికి ఆదాయ/సంపద టెస్టు ద్వారా వారి సంతతి క్రిమిలేరా? కాదా? అనేది నిర్ధారించాలని తెలిపింది. ఈ నిబంధనలకు విరుద్ధంగా 2004లో కేంద్ర ప్రభుత్వం వివరణ జారీ చేస్తూ అందులో 9వ పేరాలో ఎక్కడైతే ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు లేదా ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల పోస్టుల సమానత్వాన్ని ప్రభుత్వ ఉద్యోగాలతో పోల్చి గుర్తించలేనీ సందర్భాల్లో ఉద్యోగుల జీతభత్యాలను కూడా లెక్కలోకి తీసుకొని వారి పిల్లలను సంపన్న శ్రేణి వర్గమా? కాదా? అనేది నిర్ధారించాలని వివాదాస్పదమైన వివరణలను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించింది. అసలు సమస్య 2004 నుండి ఓబీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్ జారీలో సమస్యలు తలెత్తాయి.

1993లో జస్టిస్ రామ్ నందన్ ప్రసాద్ అధ్యక్షతన ఏర్పడిన నిపుణుల కమిటీ శాస్త్రీయబద్ధంగా నివేదికను సమర్పించింది. ప్రధానంగా ఒక వ్యక్తి ఆడ లేదా మగ సంపన్న శ్రేణి వర్గానికి చెందిన వారా? లేదా? అనే నిర్ధారణ వారి యొక్క తల్లి లేదా తండ్రి హోదాపై/ఆస్తులపై/భూగరిష్ట పరిమితి నిబంధనపై/జీతభత్యాలు మరియు వ్యవసాయ ఆదాయం మినహాయింపుతో కూడిన ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. 2015 నుండి నేటి వరకు సుమారుగా 100 మందికిపైగా ఓబీసీ అభ్యర్థులు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్ సమర్పించి కేంద్రీయ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరైనారు. 

వారి యొక్క తల్లిదండ్రులు ప్రభుత్వ రంగ సంస్థల్లో, ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న వారు కాబట్టి కేంద్ర ప్రభుత్వలోని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ లోని అధికారులు అభ్యర్థులు సమర్పించిన నాన్ క్రిమినల్ సర్టిఫికెట్ పై అభ్యంతరం తెలుపుతూ, వారి యొక్క తల్లిదండ్రుల యొక్క పోస్టులు ప్రభుత్వ పోస్టులతో సమానత్వాన్ని కలిగిన నిరూపణ లేదనే సాకుతో వారి తల్లిదండ్రుల ఆదాయాన్ని పరిగణలోకి తీసుకొని వారికి ఉద్యోగాలను నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అందులో కొందరు అభ్యర్థులు ఓబీసీ నాన్ క్రిమిలేయర్ కోటాలో ఐఏఎస్ ఉద్యోగం పొందవలసిన వారికి ఐపీఎస్ ఉద్యోగం ఇచ్చారు. ఐపీఎస్ ఉద్యోగం రావలసిన వారికి ఇతర పోస్టులను కేటాయించారు మరికొందరికి ఉద్యోగ నియామకాన్ని నిరాకరించారు. ఇందులో కొంతమంది అభ్యర్థులు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చెన్నై, తమిళనాడు హైకోర్టులో, ఢిల్లీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అధికారుల నిర్వాకాన్ని వ్యతిరేకిస్తూ కేసులు వేశారు. అందులో గౌరవ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చెన్నై, హైకోర్టులు కేంద్ర ప్రభుత్వ అధికారుల తీరును తప్పుపడుతూ, అసలు సమాజంలో ప్రభుత్వ ఉద్యోగులకు గౌరవం/హోదా ఉంటుంది కానీ ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు సమాజంలో గౌరవము/హోదా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఉండదు. 

అలాంటప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు భిన్నంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల జీతభత్యాలు, ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల జీతభత్యాలను పరిగణలోనికి తీసుకొని ఓబీసీ నాన్ క్రీమిలేయర్ కోటాలో రావలసిన ఉద్యోగాలను నిరాకరించడాన్ని తప్పుపడుతూ, వెంటనే సదరు అభ్యర్థుకు ఓబీసీ నాన్ క్రిమిలేయర్ కోటాలో నియామకాలు ఇవ్వాలని ఆదేశించాయి అయినా కేంద్ర ప్రభుత్వ అధికారులు హైకోర్టు తీర్పులను పక్కన పెడుతూ, సుప్రీంకోర్టులో అప్పీల్ పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ వేసిన అప్పీల్ పిటిషన్ను తిరస్కరిస్తూ, హైకోర్టు ఉత్తర్వులను ఆమోదిస్తూ 2004లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణతో కూడిన పేరా 9 రాజ్యాంగ విరుద్ధమని తెలుపుతూ, మొత్తంగా 1993లో ఇచ్చినటువంటి ఆఫీస్ మెమోరాండంను ఆమోదిస్తూ, సదరు నష్టపోయిన అభ్యర్థులకు వెంటనే సూపర్ న్యూమరి పోస్టుల్లో వారికి రావలసినటువంటి ఐఏఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్ తదిర ఉన్నత పోస్టుల్లో నియమించాలని మొత్తం ప్రక్రియ ఆరు నెలల్లో పూర్తిచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
 

చ‌ద‌వండి: యూఏఈ నిష్క్ర‌మ‌ణ‌తో మ‌న‌కేంటి?

ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పరిగణలోకి తీసుకొని వెంటనే కేంద్ర ప్రభుత్వము పూర్తి వివరణలతో కూడిన ఉత్తర్వులను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు జారీ చేయాలి. ఇప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల జీతభత్యాలను లేదా వ్యవసాయ ఆదాయాన్ని పరిగణలోకి తీసుకొని ఓబీసీ నాన్ క్రిమిలేరు సర్టిఫికెట్ల జారీ తిరస్కరించవద్దని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ కొంతమంది తహసీల్దార్లు కేవలం ఉద్యోగుల జీతభత్యాలను పరిగణలోకి తీసుకొని ఓబీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్ల జారీని తిరస్కరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకొని అర్హత కలిగిన అభ్యర్థులందరికీ ఓబీసీ/బీసీ నాన్ క్రిమిలేయర్ ధ్రువీకరణ పత్రాల జారీకి మార్గదర్శకాలను జారీచేసి బీసీ కులాలకు న్యాయం చేయ్యాలి.

– కోడెపాక కుమారస్వామి
తెలంగాణ విద్యుత్‌ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు
చరవాణి నం: 94909 59625

Advertisement
 
Advertisement
Advertisement