కేరళ ప్రభుత్వానికి బీజేపీ ఎమ్మెల్యే మద్దతు

BJP MLA Support To Resolution Against Farm Act In Kerala - Sakshi

తిరువనంతపురం : కేరళ అసెంబ్లీలో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. కేంద్ర  ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ.. కేరళ అసెంబ్లీ ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. కొత్త చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా రైతులు నిరసన తెలుపుతున్న నేపథ్యంలో వాటిని వెంటనే రద్దు చేయాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అయితే ఈ బిల్లుకు అసెంబ్లీలో బీజేపీకి ప్రాతినిథ్యం వహిస్తున్న ఏకైక ఎమ్మెల్యే ఓ రాజ్‌గోపాల్‌ సైతం మద్దతు ప్రకటించడం అధికార పక్షానికి ఆశ్యర్యం కలిగించింది. దీంతో ప్రభుత్వం రూపొందించిన బిల్లుకు సభ ఏకగ్రీవ ఆమోదం తెలిపిందని సభా స్పీకర్‌ పీ రామకృష్ణ తెలిపారు. (కేంద్ర చట్టాలపై కేరళ అసెంబ్లీ తీర్మానం)

అనంతరం మీడియా పాయింట్‌ వద్ద రాజ్‌గోపాల్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రైతుల పక్షాన నిలిచిన ఎల్డీఎఫ్‌ ప్రభుత్వానికి తన మద్దతు ఉంటుందని తెలిపారు. కాగా ఈ బిల్లుకు కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని యూడీఎఫ్‌ కూడా మద్దతు ప్రకటించింది. కాగా వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతులు చేపట్టిన ఆందోళన 36వ రోజుకు చేరుకుంది. ఈ క్రమంలోనే బుధవారం నాడు రైతు నేతలతో జరిగిన సమావేశాలు కొంత మేర ఫలించాయి. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top