నంబర్‌ వన్‌ తెలంగాణ ద్రోహి కేసీఆర్‌ | Sakshi
Sakshi News home page

నంబర్‌ వన్‌ తెలంగాణ ద్రోహి కేసీఆర్‌

Published Mon, Dec 5 2022 1:05 AM

BJP Chief Bandi Sanjay Sensational Comments On Telangana CM KCR - Sakshi

నిర్మల్‌: కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుగా 575 టీఎంసీలు రావాల్సి ఉండగా.. 299 టీఎంసీలకే సంతకం పెట్టి, మన వాటాకు గండి కొట్టిన నంబర్‌ వన్‌ తెలంగాణ ద్రోహి, సారా స్కాంలో తన బిడ్డను అరెస్టు చేస్తే ఉద్యమం చేయాలంటున్న దుర్మార్గుడు కేసీఆర్‌ అని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాసంగ్రామ యాత్ర ఏడోరోజు నిర్మల్‌ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.  

కవిత ఏమైనా స్వాతంత్య్ర సమరయోధురాలా? 
బీజేపీని, మోదీని తిట్టడమే కేసీఆర్‌ పనిగా పెట్టుకున్నాడని సంజయ్‌ విమర్శించారు. బీజేపీ మద్దతుతోనే తెలంగాణ ఏర్పడిందని, అందుకే సీఎం పీఠంపై కూర్చున్నావన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. కేసీఆర్‌ బిడ్డ కవిత ఏమైనా స్వాతంత్య్ర సమరయోధురాలా..? లేక రజాకార్లపై పోరాడిన మరో ఝాన్సీ లక్ష్మీబాయా..? అని ప్రశ్నించారు. ప్రజల సొమ్ముతో లక్ష కోట్ల లిక్కర్‌ దందా చేసిందని ఆరోపించారు. అలాంటి కవితను అరెస్ట్‌ చేస్తే తెలంగాణ ప్రజలెందుకు ధర్నా చేయాలని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ ఆయన కుమార్తె కవిత ప్రస్తుతం కేసుల భయంతో ఒకటే విలపిస్తున్నారని, వారి కన్నీళ్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిండుతోందని బండి సంజయ్‌ ఎదేవా చేశారు.

అల్లోల అవినీతి తిమింగలం.. 
రెండు వేల ఎకరాలు దోచుకుని వేలకోట్లు సంపాదించిన కబ్జాకోరు ఇంద్రకరణ్‌రెడ్డి అని, అధికారంలోకి వచ్చాక అల్లకల్లోల అవినీతి మంత్రి అంతు చూస్తామని సంజయ్‌ హెచ్చరించారు. మున్సిపాలిటీలో స్వీపర్‌ ఉద్యోగాల కోసం లక్షల రూపాయలు లంచంగా తీసుకున్నాడని ఆరోపించారు. జనవరి 10లోపు ఆ డబ్బులు తిరిగి ఇవ్వకపోతే తామేంటో చూపిస్తామని హెచ్చరించారు.  

హిందువులు ఓటు బ్యాంకుగా మారాలి 
బొట్టు పెట్టుకున్నంత మాత్రాన హిందువులు కాలేరని, ధర్మం కోసం, దేశం కోసం పనిచేయాలని సంజయ్‌ సూచించారు. హిందువులు ఓటు బ్యాంకుగా మారాలన్నారు. హిందు అమ్మాయిలను లవ్‌జిహాద్‌ పేరిట వేధించే వాళ్ల బట్టలు ఊడదీసి కొడతామని హెచ్చరించారు. ఢిల్లీలో శ్రద్ధావాకర్‌ను 35 ముక్కలుగా నరికితే ఒక్క సెక్యులర్‌ నాయకుడు, ఏ సంఘమూ మాట్లాడలేదని మండిపడ్డారు. కేరళలో లవ్‌ జిహాద్‌ పేరిట అమ్మాయిలను ఎత్తుకెళ్తుంటే, ట్రిపుల్‌ తలాక్‌ పేరిట మహిళలను ఇబ్బందులు పెడుతుంటే క్రైస్తవ, ముస్లిం సంఘాలు ఎటుపోయాయని ప్రశ్నించారు. 

కేసీఆర్‌ కుటుంబాన్ని జైలుకు పంపుతాం 
తెలంగాణలో ఎగిరేది కాషాయ జెండానే అని చెప్పారు. బీజేపీ అధికారంలోకొస్తే అందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తామని, అర్హులందరికీ పక్కా ఇళ్లు కట్టిస్తామని అన్నారు. నిర్మల్‌కు బుల్డోజర్లను పంపి అక్రమంగా నిర్మించిన బడా బాబుల ఇళ్లను కూల్చివేయిస్తామని హెచ్చరించారు. కేసీఆర్‌ అవినీతి కుటుంబాన్ని జైలుకు పంపి తీరతామని పునరుద్ఘాటించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement