త్వరలో మరో విడత సంజయ్‌ పాదయాత్ర?

BJP Chief Bandi Sanjay Likely To Start Another Praja Sangrama Yatra - Sakshi

7న సమావేశాలపై జిల్లా పార్టీ అధ్యక్షులతో టెలీకాన్ఫరెన్స్‌ 

సాక్షి, హైదరాబాద్‌/బంజారాహిల్స్‌: రాష్ట్రంలో మరిన్ని విడతల ‘ప్రజాసంగ్రామయాత్ర’చేపట్టాలనే ఒత్తిడి బీజేపీ నాయకత్వంపై పెరుగుతోంది. పాదయాత్రలతో కార్యకర్తలతో కొత్త ఉత్సాహం నెలకొన్నందున ఆ యాత్రలు కొనసాగించాలనే డిమాండ్‌ పెరుగుతోంది. దీనికి సంబంధించి కార్యకర్తల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో కనీసం మరో విడత పాదయాత్ర నిర్వహించే అవకాశమున్నట్టు పార్టీవర్గాల సమాచారం.

ఇప్పటిదాకా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ నేతృత్వంలో ఐదు విడతలుగా చేపట్టిన పాదయాత్రలకు వచ్చిన భారీ స్పందన ద్వారా బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ అనే అభిప్రాయం ఏర్పడిందని పార్టీనేతలు చెబుతున్నారు. ఈ నేపత్యంలో ఈ నెల 18 లేదా 20వ తేదీ నుంచి పాదయాత్రను మళ్లీ మొదలుపెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్, సికింద్రాబాద్‌ నగరాల పరిధిలోని అసెంబ్లీ సీట్లలో లేదా కొడంగల్‌ నుంచి నిజామాబాద్, ములుగు నుంచి ఖమ్మం, అచ్చంపేట నుంచి సూర్యాపేట, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఈ యాత్ర చేపట్టే అవకాశాలున్నట్టు పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.

ఇటీవల జరిగిన ముఖ్యనేతల భేటీలోనూ ఆరోవిడత పాదయాత్రకు బీజేపీ ప్రధానకార్యదర్శి (సంస్థాగత) బీఎల్‌ సంతోష్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు సమాచారం. దీని తర్వాత బస్సుయాత్ర లేదా మరిన్ని విడతల పాదయాత్రలు నిర్వహించే యోచనలో ఉన్నట్టు సమాచారం. 7న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించే పోలింగ్‌బూత్‌ కమిటీ సభ్యుల సమావేశాల్లో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రికార్డెడ్‌ ఉపన్యాసాన్ని వినిపించడంతోపాటు హాజరైన వారంతా మిస్డ్‌కాల్‌ ఇవ్వడం ద్వారా నమోదు చేసుకోవాలని నిర్ణయించారు. స్థానికంగా అసెంబ్లీలో బూత్‌ కమిటీలు, శక్తికేంద్రాల (నాలుగైదు పోలింగ్‌బూత్‌లు కలిపి) సమావేశాలు నిర్వహించనున్నారు. ఆదివారం రాత్రి జిల్లా పార్టీ అధ్యక్షులు, జిల్లా ఇన్‌చార్జీలు, అసెంబ్లీ కన్వీనర్లు, జాయింట్‌ కన్వీనర్లతో సంజయ్‌ నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఆయా అంశాలు చర్చకు వచ్చాయి.

ఇక బీజేపీదే అధికారం
రాష్ట్రంలో ఇక బీజేపీదే అధికారమని సంజయ్‌ తెలిపారు. ఖైరతాబాద్‌ నియోజకవర్గం కేంద్రంగా జరి గిన బీజేపీ బూత్‌ కమిటీ సమావేశంలో సంజయ్‌ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌తో తెలంగాణకు బంధం తెగిపోయిందని, సీఎం కేసీఆర్‌ ఇక్కడ దుకాణం మూసేసి ఇంకోదానిని తెరిచారని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ శాంతిభద్రతల సమస్యను సృష్టించి బీజేపీ మీద వేయాలని చూస్తోందని ఆరోపించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top